మనసు గెలుచుకోండిలా!
ABN , First Publish Date - 2021-02-24T06:59:40+05:30 IST
ఇష్టపడిన వారిపై ప్రేమను చాటుకునేందుకు పెద్ద పెద్ద పనులు చేయాలనే రూల్ ఏమీ లేదు. మీ ప్రియతమకు ఆనందాన్ని ఇచ్చే చిన్న చిన్న పనులతో కూడా వారిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేయవచ్చు...
ఇష్టపడిన వారిపై ప్రేమను చాటుకునేందుకు పెద్ద పెద్ద పనులు చేయాలనే రూల్ ఏమీ లేదు. మీ ప్రియతమకు ఆనందాన్ని ఇచ్చే చిన్న చిన్న పనులతో కూడా వారిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేయవచ్చు. వారు మీకు ఎంత ప్రత్యేకమో చూపడానికి, మీ బంధం ఎప్పటికీ అనురాగాల పొదరిల్లులా ఉండేందుకు ఏం చేయాలంటే...
నచ్చిన ఫుడ్: రోజంతా పనితో అలిసిపోయిన మీ భాగస్వామికి మీరు స్వయంగా వారికి ఇష్టమైన ఫుడ్ వండండి. రుచిగా ఉందా లేదా అన్నది పక్కనబెడితే, వారి ఇష్టాన్ని తెలుసుకొన్నారనే సంతోషం వారి ముఖాన వెల్లివిరుస్తుంది. ఇలాంటి క్షణాలు మీ అనుబంధంలో అందమైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
థ్యాంక్యూ చెప్పాలి: మీకోసం ఏదైనా చేసినప్పుడు థ్యాంక్యూ చెబుతుండాలి. దాంతో వారు తమ శ్రమ వృథాగా పోలేదని భావిస్తారు. అంతేకాదు మీతో జతగా నడుస్తున్నందుకు వారిని అభినందిస్తూ అప్పుడప్పుడూ థ్యాంక్యూ చెప్పాలి.
సర్‌ప్రైజ్ ప్లాన్ చేయండి: మీ జంట పక్షికి బహుమతి ఇచ్చేందుకు ప్రత్యేక సందర్భం కోసం వేచిచూడకండి. మామూలు రోజున వారికి కానుక అందించి ఆ రోజును మీ ఇద్దరి జీవితాల్లో గొప్పగా మార్చుకోండి.
అవకాశం ఇవ్వండి: గొడవలు పడడం, వాదించుకోవడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం దొరకుతుంది. ఏదైనా విషయంపై వాదన మొదలైనప్పుడు ప్రతిసారి మీ అభిప్రాయమే నెగ్గాలని అనుకోవద్దు. అప్పుడప్పుడు మీ ప్రియతమ చెప్పేది వినాలి.
కలిసి టీవీ షోలు చూడడం: మీ భాగస్వామి ఇష్టపడే టీవీ షోలను వారితో కలిసి చూడండి. ఆ షోలపై మీ అభిప్రాయాలను పంచుకోండి. ఇలాచేయడం ద్వారా తమ ఇష్టాలను గుర్తిస్తున్నారని వారు గ్రహిస్తారు.
థ్రిల్‌నిచ్చే పర్యటనలు: వీకెండ్‌లో రోడ్ ట్రిప్ ప్లాన్ చేయండి. లేదా ఇద్దరూ కలిసి కుకింగ్ క్లాస్‌లో కొత్త వంటపాఠాలు నేర్చుకోండి. వీటితో పాటు భయాన్ని, థ్రిల్‌ను కలిగించే సాహసాలు చేయండి. ఇవన్నీ మీ ప్రయాణాన్ని కొత్తగా నిర్వచిస్తాయు.
ఐ లవ్యూ నోట్స్: ప్రేమను వ్యక్తం చేయడానికి సమయం ఏమీ ఉండదు. కాబట్టి ‘ఐ లవ్యూ’ అని రాసున్న నోట్స్‌ను మీ ప్రియమైన నేస్తం లంచ్‌బాక్స్ మీద అతికించండి. ఈ చిన్న నోట్ మీ ప్రేమను గుర్తుచేస్తుంటుంది.