Jagan GOVT IT FAIL: ఐటీ ఢమాల్‌

ABN , First Publish Date - 2022-12-17T04:02:20+05:30 IST

సంక్షేమంలోనే కాదు.. పరిశ్రమలు, ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో పెట్టుబడులు, ఎగుమతుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ ముందుకు దూసుకుపోతోందన్న ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటనల్లోని డొల్లతనం కేంద్ర గణాంకాలు బయటపెట్టాయి.

Jagan GOVT IT FAIL: ఐటీ ఢమాల్‌

జగన్‌ ఏలుబడిలో మరో రంగం కుదేల్‌

ఐటీ ఎగుమతుల్లో అట్టడుగున ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర గణాంకాలతో డొల్లతనం బట్టబయలు

టీడీపీ హయాంలో ఐటీ రంగానికి ఊపు

అప్పట్లోనే కీలక బడా కంపెనీలన్నీ ఏపీకి

అన్నింటినీ వెళ్లగొడుతున్న జగన్‌ సర్కార్‌

ఫలితంగా ఎగుమతుల్లో ఏడో స్థానం..

తెలంగాణ మూడో స్థానంలో..

తొలి రెండు స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర

పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం

ఉమ్మడి రాష్ట్రంలోనే విశాఖ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందింది. కానీ, రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో ఐటీసిటీగా ఎదిగిన నగరం విజయవాడ. అప్పట్లో ఐటీ కంపెనీలతో ఇక్కడి మేధాటవర్‌ కళకళలాడేది. చూస్తే ఇప్పుడు నాలుగైదు సంస్థలు మినహా మిగిలినవన్నీ వెళ్లిపోయాయి. కాల్‌సెంటర్లు, డేటా సెంటర్లు తదితర ఐటీ అనుబంధ రంగాలు కూడా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. అంకుర సంస్థలు, ఇంక్యుబేషన్‌ సెంటర్లు, స్టార్టప్స్‌ ఊసే లేదు. ఫలితంగానే ఐటీ ఎగుమతుల్లో ఇప్పుడు ఏపీ.. ఛత్తీ్‌సగఢ్‌తో పోటీ పడాల్సిన పరిస్థితి! కానీ, ఒకటే పనిగా పెట్టుకుని ఐటీ కంపెనీలను వెళ్లగొట్టడంలో మాత్రం ఇప్పటికీ రాష్ట్రానిదే ఒకటో స్థానం!

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : సంక్షేమంలోనే కాదు.. పరిశ్రమలు, ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో పెట్టుబడులు, ఎగుమతుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ ముందుకు దూసుకుపోతోందన్న ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటనల్లోని డొల్లతనం కేంద్ర గణాంకాలు బయటపెట్టాయి. ఉత్తుత్తి గాలిమాటలతో ఆయన నిర్మించిన ఐటీస్వర్గం పార్లమెంటు వేదికగా కూలిపోయింది. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్టీపీఐ).... రిజిస్టర్డ్‌ యూనిట్ల ద్వారా గత మూడేళ్లలో మన పొరుగు రాష్ట్రాలతో పోల్చితే సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున ఉంది. సెజ్‌ల కింద నమోదైన యూని ట్ల నుంచి చేసిన సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులలోనూ రాష్ట్రం అట్టడుగుకు దిగజారిపోయింది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు...ఐటీ రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. తగిన ప్రోత్సాహకాలు ఆయన ప్రభుత్వంలో అందటంతో విశాఖపట్నంతోపాటు విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో అనేక ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీలు తరలివచ్చాయి. జగన్‌ సీఎం అయ్యాక.. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఐటీ ప్రోత్సాహకాలన్నింటిని నిలిపివేయడంతో రాష్ట్రానికి వచ్చిన ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీలన్నీ తరలిపోయాయి. చంద్రబాబు పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం ఒక వెలుగు వెలిగితే.. గత మూడేళ్లుగా జగన్‌ ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలో ఐటీ రంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. ఫలితంగా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో ఏపీ పరిస్థితి హీనస్థితికి దిగజారిపోయింది. శుక్రవారం రాజ్యసభలో కేం ద్రం వెల్లడించిన గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది.

దక్షిణాదిన ఎస్టీపీఐ రిజిస్టర్డ్‌ యూనిట్ల ద్వారా గత మూడేళ్లలో చేసిన సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర ద్వితీయ స్థానంలో ఉండగా.. తెలంగాణ మూడోస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా తమిళనాడు, కేరళ, ఒడిసా రాష్ట్రాలు నిలిచాయి. ఆపై ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగుకు జారిపోయింది. మన అడుగున ఛత్తీ్‌సగఢ్‌ ఉంది. సెజ్‌ల కింద నమోదైన యూనిట్ల నుంచి చేసిన సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో కూడా గత మూడేళ్లలో ఎగుమతులతో ఆంధ్రప్రదేశ్‌ అఽథమ స్థానంలోనే ఉంది. కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం రాజ్యసభలో ఈ వివరాలను వెల్లడించారు.

ఉన్నవన్నీ ఆనాటి కంపెనీలే...

రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ఐటీ సంస్థలన్నీ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి చెప్పుకోదగిన ఐటీ కంపెనీ ఒక్కటి కూడా రాలేదు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ప్రత్యేక ఐటీ ప్రోత్సాహక విధానం అమలు చేశారు. ప్రముఖ ఐటీ కంపెనీలు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో బ్రాంచీలను ఏర్పాటు చేసేలా, వాటికి తగిన ప్రోత్సాహకాలు అందించారు. అదే క్రమంలో ఐటీ పరిశోధనలకు ఊతమిచ్చే అంకుర సంస్థలు, ఇంక్యుబేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహకాలు అందించారు. ఫలితంగా విజయవాడలో ఏపీఐఐసీ-ఏస్‌ అర్బన్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన మేథాపార్క్‌ టవర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో కిటకిటలాడేది. దీంతో అక్కడే మరో టవర్‌ నిర్మాణానికి అప్పటి ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ చర్యలు చేపట్టారు. హెచ్‌సీఎల్‌, టీసీఎల్‌ వంటి పెద్ద కంపెనీలు కూడా రాష్ట్రానికి తరలివచ్చాయి. తిరుపతి సమీపంలో ఎలక్ర్టానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సెజ్‌కు రూపకల్పన చే సి అనేక కంపెనీలను అక్కడకు తీసుకొచ్చారు. సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు, సెల్‌ఫోన్‌ అసెంబ్లింగ్‌ కంపెనీలు, టీవీల తయారీ కంపెనీలు వచ్చాయి.

సెల్‌ఫోన్‌ తయారీలో బ్రాండ్‌ ఇమేజీ

సెల్‌ఫోన్‌ తయారీలో ఏపీ.. భారత్‌లోనే ఒక గుర్తింపు తెచ్చుకుంది. తిరుపతి చుట్టుపక్కల ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ తయారీ పరిశ్రమలకు పునాది పడడమే కాకుండా... పలు కంపెనీలు కూడా అక్కడికి తరలివచ్చాయి. ఫాక్స్‌కాన్‌, సెల్‌కాన్‌, డిక్సన్‌, కార్బన్‌ లాంటి కంపెనీలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు, సంస్థలకు ప్రోత్సాహకాలను నిలిపివేయడంతో అవి మనుగడ సాఽగించలేక ఒక్కొక్కటిగా రాష్ట్రం విడి చి తరలిపోయా యి. ప్రైవేటు ఐటీ కాంప్లెక్స్‌లన్నీ మొత్తం మూతపడ్డాయి. ఐటీ అనుబంధ సంస్థలు మూతబడ్డాయి.

గత మూడేళ్లలో ఎస్టీపీఐ, సెజ్‌ల కింద నమోదైన

యూనిట్ల ద్వారా సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు (రూ. కోట్లలో)

రాష్ట్రం 2019-20 2020-21 2021-22 మొత్తం

కర్ణాటక 3,00,310 3,23,221 3,95,904 10,19,435

మహారాష్ట్ర 1,83,728 2,01,116 2,36,808 6,21,652

తెలంగాణ 1,31,260 1,44,343 1,80,617 4,56,220

తమిళనాడు 1,30,739 1,35,645 1,57,925 4,24,309

కేరళ 14,917 16,418 20,186 51,521

ఒడిసా 4,214 4,565 5,169 13,948

ఆంధ్రప్రదేశ్‌ 1,031 1,203 1,290 3,524

ఛత్తీస్‌గఢ్‌ 86 124 642 852

Updated Date - 2022-12-17T04:02:21+05:30 IST