Sudha Murty: 1981 నాటి విషయాన్ని బయటపెట్టిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి

ABN , First Publish Date - 2022-12-27T16:27:40+05:30 IST

ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూయేషన్ దాదాపు 80 బిలియన్ డాలర్లకు సమానం. భారతీయ కరెన్సీలో సుమారు రూ.6.6 లక్షల కోట్లకు పైమాటే.

Sudha Murty: 1981 నాటి విషయాన్ని బయటపెట్టిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి

బెంగళూరు: ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూయేషన్ దాదాపు 80 బిలియన్ డాలర్లకు సమానం. భారతీయ కరెన్సీలో సుమారు రూ.6.6 లక్షల కోట్లకు పైమాటే. ఇన్ఫోసిస్ ఈ స్థాయి దిగ్గజ కంపెనీగా రూపాంతరం చెందడానికి ముందు 1981లో ఒక చిన్న స్టార్టప్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం మెజారిటీ వాటాదారైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి (NR Narayana Murthy) కంపెనీ సహ-వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. రూ.10 వేల పెట్టుబడితో సహ-వ్యవస్థాపకుడు కాగలిగారు. ఆ పదివేలు కూడా తన భార్య సుధా మూర్తి (Sudha Murty) నుంచి అప్పుగా తీసుకుని ఇన్వెస్ట్ చేశారు. ఆ పదివేలే ప్రస్తుతం సుసంపన్నులను చేసింది. అయితే ఆనాడు భర్తకు రూ.10 వేలు ఇవ్వడానికి సంబంధించిన ఆసక్తికర కారణాలను సుధా మూర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

భర్త నారాయణ మూర్తికి తెలియకుండా కొన్నేళ్లపాటు దాచిపెట్టిన వ్యక్తిగత అత్యవసర నిధి నుంచి రూ.10 వేలు అప్పుగా ఇచ్చానని ఆమె గుర్తుచేసుకున్నారు. భర్తకు తెలియకుండా ఈ డబ్బును కూడబెడుతూ వచ్చానని ఆమె చెప్పారు. ‘‘ నీ దగ్గర ఎల్లప్పుడూ ఎంతోకొంత డబ్బు ఉండాలని పెళ్లైనప్పుడు మా అమ్మ చెప్పింది. అత్యవసరాల్లో మాత్రమే ఈ డబ్బును ఉపయోగించాలని సూచించింది. చీరలు, బంగారం లేదా ఇతర వస్తువుల కోసం ఖర్చు చేయొద్దని తెలియజెప్పింది. అమ్మ చెప్పిన సలహాను పాటించాను. ప్రతి నెలా నా జీతం, భర్త శాలరీ నుంచి కొంత మొత్తం దాయడం మొదలుపెట్టాను. ఈ విషయం నారాయణమూర్తికి తెలియదు. 1981లో ఈ ఎమర్జెన్సీ ఫండ్ రూ.10,250 అయ్యింది. ఈ డబ్బే నారాయణ మూర్తి ఎంజెల్ ఇన్వెస్టర్‌‌గా అవకాశాన్నిచ్చింది. రూ.10 వేలు అప్పుగా ఇచ్చాను. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉంది’’ అని సుధామూర్తి చెప్పారు.

‘‘ ఒక యువకుడిగా ఆయనకు(నారాయణమూర్తి) కలలు ఉన్నాయి. అవి జరుగుతాయో లేదో నాకు తెలియదు. కానీ కష్టపడి పనిచేసే వ్యక్తి అని మాత్రం నాకు తెలుసు. ఏదో ఒకటి చేయాలని ఆయన తపన పడేవారు. అందుకే దీనిని ఎమర్జెన్సీగా భావించాను. డబ్బు ఇవ్వలేదని జీవితాంతం పశ్చాత్తాపం పడడం కంటే విఫలమైనా ఫర్వాలేదని నాకు అనిపించింది. అందుకే ఇన్ఫోసిస్ ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి రూ.10 వేలు భర్తకు ఇచ్చాను’’ అని కారణాన్ని ఆమె వెల్లడించారు. మనీకంట్రోల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. సాఫ్ట్‌వేర్ విప్లవం అవశ్యకతను ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా 1981లో ఒక బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో నారాయణ మూర్తి సహా ఆరుగురు సాఫ్ట్‌వేర్ నిపుణులు ఇన్ఫోసిస్‌కు అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-27T16:40:26+05:30 IST