వినోద రంగంలో వినూత్న మార్పులు

ABN , First Publish Date - 2022-01-26T06:50:00+05:30 IST

సరళీకృత ఆర్థిక విధానాల ఆలంబనతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం సమాచార, వినోద రంగాల రూపురేఖలను నిత్యనూతనంగా మార్చి వేస్తోంది...

వినోద రంగంలో వినూత్న మార్పులు

సరళీకృత ఆర్థిక విధానాల ఆలంబనతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం సమాచార, వినోద రంగాల రూపురేఖలను నిత్యనూతనంగా మార్చి వేస్తోంది. ఒకప్పుడు టెలివిజన్ అంటే సంపన్నులకు ఒక ప్రతిష్ఠా చిహ్నాం. అందులోనూ రంగుల టీవీ మరీ కొద్దిమందికి మాత్రమే పరిమితం. 1982లో ఢిల్లీలో ఆసియా క్రీడోత్సవాలు మొదలయ్యే వరకు భారతదేశంలో రంగుల టీవీ అనేది అత్యధికులకు తెలియదు. ఆసియాడ్ క్రీడోత్సవాలు దుబారా ఖర్చు అని జనతా ప్రభుత్వం వాటి నిర్వహణ నుంచి తప్పుకోవాలని యోచిస్తున్న సమయంలోఇందిరా గాంధీ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. దేశప్రతిష్ఠను ఇనుమడింపజేయడానికి ఆసియాడ్ క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆమె నిర్ణయించారు. ఇందిరా గాంధీ ఆసక్తిని ఎక్కడో దుబాయిలో ఉంటున్న మనూ (మనోహార్) ఛాబరియా అనే ప్రవాస భారతీయుడు గమనించి భారత్‌లో విదేశీ టీవీ సెట్ల బహుమతి పథకానికి శ్రీకారం చుట్టాడు. ప్రవాస భారతీయులు స్వదేశంలో ఎవరికైనా ఒక కలర్ టివి సెట్‌ను రాయితీతో కూడిన 190 శాతం కస్టమ్స్‌ సుంకం చెల్లించి బహుమతిగా ఇవ్వవచ్చనే ఇందిరా గాంధీ ప్రభుత్వ నిర్ణయం వెనుక మనూఛాబరియా ప్రేరణ, ప్రోత్సాహం ఉంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో సుప్రసిద్ధ జపనీస్‌ సంస్థ సోనీకి దుబాయిలో విక్రేతగా ఉన్న జుంబో ఎలక్ట్రానిక్స్ యాజమాని మనూ ఛాబరియా. దుబాయితో పాటు మొత్తం గల్ఫ్ దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వెళ్ళే ప్రతి భారతీయుడి వెంట ఒక టీవీ సెట్‌ పంపించిన వ్యాపారశ్రేష్ఠుడు మనూ ఛాబరియా. అంతేకాకుండా ఒక్క దుబాయి నుంచే ఏడు ప్రత్యేక కార్గో విమానాల ద్వారా కలర్ టెలివిజన్లను భారతదేశానికి పంపించగా వాటికి కస్టమ్స్‌ సుంకం చెల్లించడానికి జనాలు ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలో నిలబడేవారు! చెన్నై, ముంబైలలో క్యూల వద్ద తొక్కిసలాట జరిగి పోలీసు లాఠీ చార్జి వరకు పరిస్థితి చేయిదాటిపోయిన సందర్భాలూ ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని ప్రభుత్వం అంచనా వేసిన సందర్భం అది.


నలుపు, తెలుపు సాంకేతికత మాత్రమే తెలిసిన దూరదర్శన్, రంగుల సాంకేతికతల్లో శిక్షణ పొందడానికై తమ సిబ్బందిని విదేశాలకు పంపించింది. రంగుల టీవీలో ఆసియాడ్ క్రీడోత్సవాలను వీక్షించడం ఒక అద్భుతం. ఆ తరం వారికి ఒక అవిస్మరణీయమైన అనుభవం.పరుగుల రాణి పి.టి. ఉషాను,నాటి ప్రధాని ఇందిరా గాంధీనిరంగులలో చూడడం భారత ప్రజలకు అదేతొలిసారి. ఆసియాడ్ ప్రత్యక్ష ప్రసారం తర్వాత, హిందీ సీరియల్ హామ్ లోగ్ భారతదేశంలో ప్రథమ రంగుల ప్రసారం కాగా ఆ తర్వాత వచ్చిన రామానంద్ సాగర్ ‘రామాయణ్’ ఒక చరిత్రను సృష్టించి పరోక్షంగా బిజెపి బలం పుంజుకోవడానికి దోహదం చేసింది. 


గల్ఫ్ దేశాల నుంచి ఏరికోరి మరీ తీసుకువచ్చే కలర్ టీవీ సెట్లే ప్రధాన దిక్కుగా ఉన్న కాలం నుంచి థియేటర్‌కు వెళ్ళకుండానే చేతిలోని మొబైల్ ఫోన్‌పై సినిమాలు వీక్షించే నేటికాలం వరకు వినోద రంగంలోఅనేకానేక మలుపులు చోటు చేసుకున్నాయి. ఓటీటీ విధానానికి దేశ వ్యాప్తంగా హిందీ కంటే తెలుగు, తమిళభాషా సినిమాలకు ఆదరణ అధికంగా ఉంది. వకీల్ సాబ్, జై భీం, తాజాగా పుష్ప సినిమాలే ఇందుకు నిండు నిదర్శనాలు. 


ఇప్పుడు దేశంలో ఉన్న స్మార్ట్ టీవీసెట్లలో యూ ట్యూబ్ వీక్షణ సదుపాయం ఉండటమే కాకుండా టీవీ ఉత్పాదక సంస్థలే కొన్ని చానళ్ళను ప్రమోట్ చేస్తున్నాయి. వీటిలో అత్యధికం చైనాకు చెందినవి కావడం ఇక్కడ గమనార్హం. పది బిలియన్ డాలర్ల భారతీయ వినోద టీవీ మార్కెట్‌పై సోనీ టీవీ ఉత్పాదక సంస్ధకు అనుబంధంగా ఉన్న సోని ఎంటర్‌టైన్‌మెంట్, జీటీవీ రెండు కలిసి రానున్న కాలంలో ఒక నూతన ఒరవడి సృష్టించనున్నాయి. ఒక్క వార్తలే కాదు, ఏ రకమైన వినోదం ప్రజలకు అందించాలి, ప్రజలు ఏది చూసి నవ్వాలి, ఏడ్వాలి అనేది కూడ ప్రజలకు సంబంధం లేకుండా జరుగనుంది. ఇప్పుడు దేశంలోని వార్తాప్రసార రంగంలో ఉన్న సంకుచిత ధోరణి మున్ముందు వినోద రంగానికి కూడ వ్యాపించనుంది.


రంగుల టీవీని ఒక్క వినోద రంగానికే కాకుండా అధికార పీఠం పదిలపర్చుకోవడానికి ఏ విధంగా మలుచుకోవాలో పాలకవర్గాలపెద్దలు ఇప్పటికే చేసి చూపించారు. ఇక ముందు కూడ సామాజిక మాధ్యమాల ఆసరాతో వారు అదే వ్యూహాన్ని అనుసరిస్తారనడంలో సందేహం లేదు. 

మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2022-01-26T06:50:00+05:30 IST