Britain: బ్రిటన్ ప్రజలకు ప్రధాని రిషి సునాక్ సందేశం..
ABN , First Publish Date - 2022-12-31T21:34:38+05:30 IST
నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న తరుణంలో బ్రిటన్ ప్రజలను ఉద్దేశించి రిషి సునాక్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
లండన్: నూతన సంవత్సరానికి(New Year 2023) ఆహ్వానం పలుకుతున్న తరుణంలో బ్రిటన్(UK) ప్రజలను ఉద్దేశించి రిషి సునాక్(Rishi Sunak) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది క్లిష్టంగా గడిచిందన్న రిషి..ఈ ఏడాదిలో బ్రిటన్ శక్తిసామర్థ్యాల గురించి ప్రపంచానికి తెలుస్తుందని వ్యాఖ్యానించారు. మే నెలలో జరగబోయే కింగ్ ఛార్ల్స్ పట్టాభిషేకం దేశ ప్రజలను మరింత దగ్గర చేస్తుందని తెలిపారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగిస్తామని కూడా ఆయన వాగ్దానం చేశారు.
‘‘2022 చాలా క్లిష్టంగా గడిచింది. కరోనా సంక్షోభం నుంచి బయటపడుతున్న తరుణంలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన క్రూర దాడితో ప్రపంచం ఆర్థిక ఒడిదుడుకుల పాలైంది. ఈ పరిస్థితులకు బ్రిటన్ అతీతమేమీ కాదు. మనలో ఎంతో మంది ఆర్థిక ఇబ్బందుల పాలయ్యార్న విషయం నాకు తెలుసు. అందుకే.. ప్రభుత్వం అనేక కఠినమైన నిర్ణయాలతో బ్రిటన్ అప్పుల పాలు కాకుండా నిరోధించింది. ఆ నిర్ణయాల కారణంగానే దేశంలోని అత్యంత బలహీనవర్గాలను ఆదుకోగలిగాము. ప్రజల ప్రయోజనం కోసం నిరంతరంగా కష్టపడతానని నేను మూడు నెలల క్రితం ప్రధాని కార్యాలయం వద్ద నిలబడి మాటిచ్చాను. నాటి నుంచి ప్రభుత్వం పలు నిర్ణయాత్మక చర్యలకు పూనుకుంది. వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించడం, వైద్యులు, నర్సుల కొరత తీర్చేందుకు ప్రయత్నించింది. ఇక.. కొత్త ఏడాదిలో మన సమస్యలన్నీ సమసిపోతాయని నేను భ్రమపడట్లేదు. అయితే..బ్రిటన్ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించేందుకు 2023 రూపంలో మరో అవకాశం వచ్చింది.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.