Tihar CCTV videos: ఈడీపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను ఉపసంహరించుకున్న సత్యేంద్ర జైన్

ABN , First Publish Date - 2022-11-28T15:37:50+05:30 IST

తీహార్ జైలులో సీసీటీవీ వీడియోలు లీక్ చేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ని తప్పుపడుతూ కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్...

Tihar CCTV videos: ఈడీపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను ఉపసంహరించుకున్న సత్యేంద్ర జైన్

న్యూఢిల్లీ: తీహార్ జైలులో సీసీటీవీ వీడియోలు లీక్ చేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)ని తప్పుపడుతూ కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Jain) తన పిటిషన్‌ను సోమవారంనాడు ఉపసంహరించుకున్నారు. జైన్ ఉంటున్న జైలు గది సీసీటీవీ ఫుటేజ్‌ను లీక్ చేయడానికి సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో ఇటీవల వేసిన పిటిషన్‌ను సత్యేంద్ర జైన్ తరఫు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు.

కోర్టులో అండర్‌టేకింగ్ ఇచ్చినప్పటికీ సీసీటీవీ ఫుటేజ్‌ను ఈడీ లీక్ చేసిందంటూ సత్యేంద్ర జైన్ ఇంతకుముందు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. గత నవంబర్‌లో తీహార్ జైల్ సీసీటీవీ ఫుటేజ్, వివరాలు లీక్ చేయకుండా చూడాలని ప్రత్యేక కోర్టును జైన్ ఆశ్రయించారు. తీహార్ జైలులో జైన్ ఉన్న సెల్‌ ఫుటేజ్‌ను తమ వాదనకు బలం చేకూర్చే సాక్ష్యంగా ఈడీ గత అక్టోబర్‌లో కోర్టుకు సమర్పించింది. ఈ వీడియోలు ఈనెల మొదట్లో బయటకు లీక్ కావడంతో పాటు వివిధ మీడియా ఛానెల్స్‌కు షేర్ అయ్యాయి. దీనిని బీజేపీ ఒక అస్త్రంగా తీసుకుని ఆప్‌పై విమర్శనాస్త్రాలు సంధించింది. ఇది రాజకీయంగా తమను వెంటాడి వేధించడమేనంటూ బీజేపీని ఆప్ తప్పుపట్టింది. మనీలాండరింగ్ కేసులో జైన్‌ను గత మే 30న ఈడీ అరెస్టు చేసింది.

Updated Date - 2022-11-28T15:37:51+05:30 IST