NRI: రియాధ్‌లో అంబరాన్నంటిన తెలుగువారి క్రిస్మస్ వేడుకలు

ABN , First Publish Date - 2022-12-24T18:40:25+05:30 IST

రియాధ్‌లో అంబరాన్నంటిన క్రైస్తవ వేడుకలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు ప్రవాసీయులు.

NRI: రియాధ్‌లో అంబరాన్నంటిన తెలుగువారి క్రిస్మస్ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పండుగ పర్వదిన సంతోషం.. వర్ణణాతీతం. కానీ పండుగను కన్నవారికి, కట్టుకున్న వారికీ దూరంగా ఎక్కడో పరాయి గడ్డపై పూర్తి వైవిధ్య వాతావరణంలో నిర్వహించుకోవడం అంతగా రుచించదు. అందునా ఇస్లాం అధికారిక మతమైన ఎడారి దేశాలలో అయితే అన్యమత పండుగలను జరుపుకోవడం అంత సులభతరం కాదు.

క్రిస్మస్ .. సంవత్సరం పొడువునా క్రైస్తవులందరు వేచి చూసే పర్వదినం. దాన్ని తమ ఆత్మీయుల అనుబంధాల మధ్య కాకుండా పరాయి దేశంలో అయినప్పటికీ మాతృదేశంలో బంధుమిత్రుల మధ్య కంటే మిన్నగా తోటి ప్రవాసీయుల మధ్య నిర్వహించుకోవడం ఒక మరుపురాని మధుర అనుభూతి. ఇదే మధుర అనుభూతిని సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లోని తెలుగు క్రైస్తవులు పొందారు. పండుగ కంటే ముందుగా క్రైస్తవులు, క్రైస్తవేతరుల ఇళ్ళకు వెళ్ళి కారోల్ సంప్రదాయంతో క్రిస్మస్ పండుగ వేడుకలకు ఆహ్వానించడం, పెద్ద సంఖ్యలో అందరూ పండుగ ఉత్సవంలో పాల్గోనడం ఈసారి రియాధ్ క్రిస్మస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు చర్చిలన్నీ కలిసి సంయుక్తంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఆరాధన ఆకాశమెత్తగా సంతోషం పరవళ్ళు తొక్కింది. వాళ్ళు – వీళ్ళు అనే భేదం లేకుండా అందరు మనోళ్ళు అనే స్ఫూర్తితో జరిగిన వేడుకలలో తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు ఆసక్తితో పాల్గొన్నారు. ఖతర్‌లోని ఫిఫా ఫుట్ బాల్ కప్ పోటీలను చూడడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ బహుమానాలు ఇచ్చినట్లుగా రియాధ్ క్రిస్మస్ వేడుకలలో వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక కానుకలు ఇవ్వడం విశిష్ఠతగా నిలిచింది.

2.jpg

సౌదీ అరేబియాలో క్రిస్మస్ పండుగను ఇంత ఘనంగా జరుపుకోవడాన్ని తాను ఉహించలేదని, సౌదీలో మొదటిసారిగా క్రిస్మస్ పండుగ జరుపుకొన్న హైదరాబాద్ నగరానికి చెందిన ఐ.టి. నిపుణుడు వన్నియా సాగర్ వ్యాఖ్యానించారు. తన సంతోషానికి అవధులు లేవని మరో తెలుగు ప్రవాసీ జవహార్ పెర్కోన్నారు. తెలుగు సముహాల సందడిలో సంఘ కాపరుల సమక్షంలో ఏసు జన్మదినోత్సవం జరుపుకోవడం అమిత ఆనందాన్ని కలిగించిందని విశాఖపట్నానికి చెందిన ఉషా అన్నారు.

మొట్టమొదటిసారిగా రాజధాని నగరంలోని తెలుగు క్రైస్తవ సంఘాలు - ఆజిజీయా తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ (పాస్టర్ విల్సన్), బగ్లఫ్ (పాస్టర్ పౌల్ రాజ్) , ఆర్.సి.యల్ చర్చి (పాస్టర్ హోజ్ బాను), ఉజ్జ్విం (పాస్టర్ సతీష్) మినిస్ట్రీ, యల్శదాయి మినిస్ట్రీ( పాస్టర్ బొక్కా వరప్రసాద్) , ఆర్.టి.యఫ్ చర్చి (పాస్టర్ స్లాన్లీ), బేతెల్ చర్చి (పాస్టర్ డానియల్) - కలిసి సంయుక్తంగా ఈ క్రిస్మస్ వేడుకలను నిర్వహించాయి. మానవీయ విలువలు, మానవతను బోధించే ఏసుక్రీస్తు బోధనలను రాజమండ్రి నుండి ప్రత్యేకంగా వచ్చిన పాస్టర్ సైమన్ సుదర్శన్ వివరించగా అందరు ఆసక్తిగా ఆలకించారు. కార్యక్రమాన్ని ఎర్రన్న సహాయంతో విల్సన్ సమన్వయపర్చారు.

1.jpg

రియాధ్ నగరంలో సాధారణంగా క్రిస్మస్ పండుగను కేవలం ఖరీదయిన ప్రత్యేక నివాస కంపౌండ్‌లల్లో నివసించే పాశ్చత్య దేశాల ప్రవాసీయులు లేదా ఒకరినొకరితో అనుసంధానం చేయబడి ఉండే కేరళ ప్రవాసీయులు మాత్రమే జరుపుకొనే వారు. తెలుగు వారితో సహా ఇతరులు మాత్రం అంతంత మాత్రంగా లాంఛనంగా జరుపుకొని తృప్తి చెందే వారు కానీ ఈ సారి విల్సన్, ఎర్రన్న, వరప్రసాద్‌లు కలిసి అందర్నీ సమన్వయం చేసి పండుగ ఉత్తేజంలో సగటు తెలుగు క్రైస్తవునికి భాగస్వామ్యం కల్పించారు.

Updated Date - 2022-12-24T18:44:37+05:30 IST