Dhamaka Movie: తెలుగు సినిమాల్లో ఈ పదాల వాడుకకు ముగింపు ఎప్పుడు..? రవితేజ సినిమాలోనూ..

ABN , First Publish Date - 2022-12-21T20:36:22+05:30 IST

రవితేజ హీరోగా రానున్న 'ధమాకా' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ (Dhamaka Movie Pre Release Event) సందర్భంగా దర్శకుడు త్రినాధరావు నక్కిన (Trinadha Rao Nakkina) ‘ఉప్పర సోది’ అని అనడాన్ని..

Dhamaka Movie: తెలుగు సినిమాల్లో ఈ పదాల వాడుకకు ముగింపు ఎప్పుడు..? రవితేజ సినిమాలోనూ..

రవితేజ హీరోగా రానున్న 'ధమాకా' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ (Dhamaka Movie Pre Release Event) సందర్భంగా దర్శకుడు త్రినాధరావు నక్కిన (Trinadha Rao Nakkina) ‘ఉప్పర సోది’ అని అనడాన్ని వ్యతిరేకిస్తూ ఉప్పర కుల సంఘ సభ్యులు నిరసన తెలియజేయడంతో తెలుగు సినిమా దర్శకుల, రచయితల సామాజిక అవగాహన మరో సారి చర్చకు వచ్చింది. తెలుగు సమాజంలో కులాల్ని కించపరుస్తూ అనేకానేక సామెతలు ఉన్నాయి, పలుకుబడులు ఉన్నాయి. సామాజిక చైతన్యం పెరిగే కొద్దీ ఆ సామెతల, నానుడుల, పలుకబడుల పుట్టుక ప్రశ్నించబడింది. అసమానతల వల్ల, ఆధిపత్యాల వల్ల కొన్ని కులాల వారిని హీనంగా చూసిన కారణంగా అటువంటివి పుట్టాయని అర్థంచేసుకున్నారు. కులం అనే ఓ పెద్ద సమూహానికి ఈ సామెతలు.. నానుడులు అంటగట్టే సామాన్య లక్షణాల పరిధిలో మాత్రమే మనుషులని చూసే ప్రయత్నం చాలా కురచన అని, బహు దుర్మార్గమని తీర్మానించారు.

ఉప్పర సోది, ఉప్పర మీటింగ్ - అనే మాటల్నే తీసుకుంటే, వ్యర్థమైన, పనికిరాని, నిరుపయోగమైన సమావేశం - అనే అర్థంలో వాడేవారు. వ్యవహార్తలు కారని, తెలివితక్కువ వారనీ ఉప్పర కులాస్థులని హేళన చేస్తూ నిందగా పుట్టిన మాటలు అవి. సామాజిక అవగాహన పెరిగాక, చైతన్యం కలిగిన తర్వాత, ఉప్పరులు గొప్ప శ్రామికశక్తి అని, ఆ కుల వృత్తి సమాజంలోని నిర్మాణ రంగానికి ఎంతో కీలకమని, వారి శ్రమ దోపిడికి గురవుతుందనీ తెలుసుకుంది సమాజం.

ఆ కనీస అవగాహన లేకుండా అర్థమయ్యక కూడా ఉప్పర సోది, ఉప్పర మీటింగ్ - అని పదే పదే సినిమాలలో వాడటం ఆ కులస్థులనే కాకుండా, సామాజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరినీ బాధపెడుతోంది.

2002లో విడుదలైన ‘మన్మథుడు’ సినిమాలో అసిస్టెంట్ మేనేజర్ గా జాయిన్ అవ్వడానికి వచ్చిన హారిక (సోనాలి బింద్రె) కలీగ్స్ తో మాట్లాడుతుంటే వచ్చిన అభిరామ్ (నాగార్జున) అంటాడు: "ఏమిటీ ఉప్పర మీటింగ్" అని.

nagarjuna1.jpg

2022లో విడుదలైన ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ (రవితేజ హీరో) సినిమాలో కూడా ‘ఉప్పర మీటింగ్’ అని అనడాన్ని వ్యతిరేకిస్తూ ఉప్పర కులస్థులు నిరసనలు తెలిపారు.

సినిమాలలో, సీరియ‌ల్స్‌లో, జబర్దస్ వంటి కామెడీ షో లలో ఉప్పర మీటింగ్ అని తరచూ వాడటాన్ని నిరోధిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని 2018లో హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలయ్యింది. ప్రతి మాధ్యమంలో ఉప్పర మీటింగ్ అంటూ తమ కులాన్ని హేళన చేయడం అమానుషమని పశ్చమగోదావరి జిల్లాకు చెందిన కర్నాటి కన్నయ్య అనే పిటీషన్ దారుడు హైకోర్టు బెంచ్ కి మొరపెట్టుకున్నారు. అప్పటి ఛీఫ్ జస్టిస్ టిబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ రమేష్ రంగనాథన్ లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఆ పిల్‌ను తోసిపుచ్చుతూ, ఇటువంటి వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేమంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (Central Board of Film Certification- CBFC)ని ఆశ్రయించమని బెంచ్ సూచించింది.

న్యాయస్థానాలు, అధికార వ్యవస్థలూ జారీ చేసే ఉత్తర్వులతో కాదు, దర్శకులు, రచయితలు, నటీనటులు, కళాకారులలో అవగాహన కలిగితేనే మార్పు వస్తుందని బాధితులు వాపోతున్నారు. "మగాడివైతే..." "చేతులకి గాజులు తొడుక్కొని లేము..." "ఒక అమ్మకీ... అబ్బకీ పుడితే..." - వంటి లింగ వివక్షతో కూడిన డైలాగులు, పంచ్ డైలాగులు ఇప్పటికీ విరివిగా రాస్తున్న తెలుగు సినిమా నుంచి పరివర్తన ఆశించలేమని, న్యాయస్థానాలే జోక్యం చేసుకోవాలని వారు కోరుకుంటున్నారు.

Updated Date - 2022-12-21T20:44:14+05:30 IST