‘కారు’ మబ్బులు!

ABN , First Publish Date - 2022-11-20T01:00:43+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రస్తుతం నేతలంతా ఐక్యతా రాగం వినిపిస్తున్నా ఐది శృతి తప్పుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ కీలకనేతగా ఉన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీ లో ఒంటరి ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

‘కారు’ మబ్బులు!

‘గులాబీ’ తోటలో తుమ్మల ఒంటరేనా ?

ఆహ్వానం అందలేదని సత్తుపల్లి సభకు మాజీ మంత్రి దూరం

భవిష్యత పరిణామాలపై రాజకీయకూడళ్లలో చర్చోపచర్చలు

ఖమ్మం, నవంబరు19 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రస్తుతం నేతలంతా ఐక్యతా రాగం వినిపిస్తున్నా ఐది శృతి తప్పుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ కీలకనేతగా ఉన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీ లో ఒంటరి ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సత్తుపల్లిలో జరిగిన టీఆర్‌ఎస్‌ ఇద్దరు రాజ్యసభ సభ్యులు అభినందన సభకు జిల్లాలో ముఖ్యనేతలంతా హాజరైనా తమ్మల మాత్రం వెళ్లలేదు. అయితే ఈ సభ నిర్వాహకులనుంచి ఆహ్వానం అందకపోవడంతోనే సత్తుపల్లి సభకు తుమ్మల దూరంగా ఉన్నారు. సభకు రావాలని సన్మాన గ్రహీత రాజ్యసభ సభ్యుడు బండి పార్ధసారధిరెడ్డి తుమ్మలను కోరినా సభ నిర్వాహకుల నుంచి మాత్రం తుమ్మలకు ఆహ్వానం లేకపోవడంతో ఆయన సత్తుపల్లి సభకు దూరంగా ఉండి, శనివారం బండి పార్ధసారధిరెడ్డిని స్వయంగా కలిసి శాలువాతో సత్కరించారు. కొత్తగా ఎన్నికైన ఇద్దరు రాజ్యసభ సభ్యులు బండి పార్ధసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర అభినందనసభకు మంత్రి పువ్వాడ, ఎంపీ నామ నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉమ్మడిజిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరై ఐక్యతారాగం వినిపించారు. అయితే ఇదంతా వైదికవరకే పరిమితమని, అంతర్గతంగా మాత్రం విబేధాలు కొనసాగుతున్నట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పదికి పది సీట్ల గెలుపే లక్ష్యంగా సత్తుపల్లిలో సభ నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి సత్తుపల్లి సభ నాంది అని చెప్పినప్పటికీ కీలకమైన సభకు మాజీమంత్రి తుమ్మలను ఆహ్వానించకపోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే టీఆర్‌ఎస్‌ వర్గాలు మాత్రం అందరినీ సన్మానగ్రహితలే ఆహ్వానించారు తప్ప తాము ఎవరిని ప్రత్యేకంగా ఆహ్వానించలేదని చెబుతున్నారు. అభినందనసభ నిర్వాహక కమిటీ నుంచి తుమ్మలకు ఆహ్వానం లేకపోవడంతో తుమ్మల వర్గీయులు సభకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే సత్తుపల్లి పరిణామాల్లో జిల్లాలో మిగిలిన నేతలంతా ఐక్యత చూపించారు. కానీ మంత్రి పువ్వాడ, ఎంపీ నామ, మాజీ ఎంపీ పొంగులేటి అంతా ఒకే వేదికపైకి రావడం, జిల్లాలో కీలకనేతగా ఉన్న తుమ్మల అభినందనసభకు దూరంగా ఉండడం జిల్లా రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. ఇక సత్తుపల్లి సభ మాదిరిగానే జిల్లలోని ఇతర నియోజకవర్గాల్లో సభలు, సమాశాలు నిర్వహించి నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే తుమ్మల నాగేశ్వరరావు మాత్రం అధికారికంగా సభల నిర్వాహకులనుంచి ఆహ్వానం ఉంటేనే వెళ్లాలని ఉద్దేశంతో ఉన్నారు. తుమ్మల ఇటీవల ఆత్మీయ సమావేశాలతో గతం నుంచి తాను మంత్రిగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ టీఆర్‌ఎ్‌సలో తన ఒంటరి ప్రయాణం సాగిస్తున్నారు. తనవర్గాన్ని తిరిగి బలోపేతం చేస్తున్నారు. ఇటీవల వాజేడులో ‘సింహవలోకనం’ పేరుతో నిర్వహించిన ఆత్మీయసభకు ఉమ్మడిజిల్లానుంచి ఆయన కేడర్‌ భారీగానే తరలి వెళ్లింది. ఈ క్రమంలో గతంనుంచీ తనతో ఉన్న నాయకులతో అనుబంధాన్ని పెంచుకునేందుకు తమ్మల ఉమ్మడి జిల్లాలో మరికొన్ని ఆత్మీయ సభలు, సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లోలో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో బలహీనంగా టీఆర్‌ఎస్‌ పార్టీ తుమ్మల చేరికతో బలపడింది. తుమ్మలతోపాటు టీడీపీ బలమైన ఓటుబ్యాంకు మొత్తం టీఆర్‌ఎస్‌ ఓటుబ్యాంకుగా మారిపోయింది. నాటి టీడీపీ నేడు టీఆర్‌ఎ్‌సగా రూపాంతరం చెందిందా అన్నట్లు ఓటుబ్యాంకులో గులాబీ పార్టీ ప్రఽథమస్థానం సాధించింది. 2018ఎన్నికల్టో టీఆర్‌ఎస్‌ ఒక్కస్థానమే గెలిచినా కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీల కూటమికి టీఆర్‌ఎస్‌ గట్టిపోటీ ఇచ్చి పలు నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లతో ఓటమిచెందింది. అనంతరం కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ కూటమి విడిపోవడంతో లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పదికి పది స్థానాలు గెలిపించే లక్ష్యంతో జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతలంతా దృష్టిసారించారు. అయితే పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, తుమ్మల వంటి కీలక నాయకుల ఒంటరి ప్రయాణం ఆ పార్టీకి ఆశలకు గండికొట్టే ప్రమాదం ఉంది.

Updated Date - 2022-11-20T01:00:44+05:30 IST