ప్రజా ఉద్యమాల చరిత్ర సీపీఐది

ABN , First Publish Date - 2022-12-27T00:00:59+05:30 IST

భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నాయకులు వరంగల్‌ జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రజా ఉద్యమాల చరిత్ర సీపీఐది
వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మేకల రవి, నాయకులు

ఘనంగా 98వ ఆవిర్భావ దినోత్సవం

జిల్లా కేంద్రంలో 98 మీటర్ల ఎర్రజెండాతో ర్యాలీ

భారీగా పాల్గొన్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు

గిర్మాజిపేట, డిసెంబరు 26: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నాయకులు వరంగల్‌ జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌ ఆవరణలో ముందుగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి కేక్‌ కట్‌ చేసి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం రాక ముందు 1925 డిసెంబరు 26న కాన్పూర్‌లో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీకి ప్రజా ఉద్యమాలు, వీరోచిత పోరాటాలు, లక్షలాది పార్టీ అమరుల త్యాగాలతో దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఘనత ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4వేల మంది అమరుల త్యాగాలతో లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసిన చరిత్ర సీపీఐ పార్టీకి ఉందని గుర్తుచేశారు. పాలకవర్గాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నదని చాడా వెంకటరెడ్డి అన్నారు. పేదలకు న్యాయం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయాలని డిమాండ్‌ చేశారు. పేదల హక్కుల సాధనలో కృషి చేద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ మహిళా కళాకారుల కోలాటాలు, కళాకారుల డప్పుచప్పుళ్లతో 98 మీటర్ల ఎర్ర జెండా పట్టుకుని నాయకులు, కార్యకర్తలతో వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరిన భారీ ర్యాలీ రైల్వేస్టేషన్‌ రోడ్డు, హెడ్‌పోస్టాఫీసు సెంటర్‌ మీదుగా వరంగల్‌ చౌరస్తా వరకు సాగింది.

ఈ ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శి షేక్‌ భాషుమియా, పార్టీ నాయకులు దండు లక్ష్మణ్‌, బుస్స రవిందర్‌, గన్నారపు రమేష్‌, భద్రి, శరత్‌, అక్బర్‌ పాషా, రమేష్‌, జన్ను రవి, బూజుగుండ్ల రమేష్‌, సండ్ర కుమార్‌, తాళ్లపల్లి రహేలా, జాన్‌పాల్‌, భారీగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-27T00:01:03+05:30 IST