Share News

కరువుపై బీజేపీ కిసాన్‌ మోర్చా ఆందోళన

ABN , First Publish Date - 2023-11-29T04:51:28+05:30 IST

కరువు మండలాలను ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ కిసాన్‌ మోర్చా నేతలు మంగళవారం గుంటూరు నగరంలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను ముట్టడించారు.

కరువుపై బీజేపీ కిసాన్‌ మోర్చా ఆందోళన

గుంటూరు వ్యవసాయ కమిషనరేట్‌ ముట్టడి

గృహనిర్బంధాలు.. నేతల అరెస్టు

గుంటూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కరువు మండలాలను ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ కిసాన్‌ మోర్చా నేతలు మంగళవారం గుంటూరు నగరంలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను ముట్టడించారు. కమిషనరేట్‌ కార్యాలయానికి అడ్డు గా ఏర్పాటు చేసిన బారికేడ్‌లను తోసుకొంటూ ముందుకు వెళ్లగా పోలీసులు నేతలందరినీ వ్యాన్‌లోకి ఎక్కించి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వాస్తవానికి ముట్టడి కార్యక్రమానికి అనుమతి లేదంటూ సోమవారం రాత్రి నుంచే పలువురు నేతలను హౌస్‌ అరెస్టు చేశారు. అయితే కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని గుంటూరుకు చేరుకొని స్థానిక నాయకులతో కలిసి కమిషనరేట్‌కు వచ్చారు. దాంతో పోలీసులు వారిని మొరటుగా ముట్టడికి అడ్డుకొన్నారు. అంతకంటే ముందు వచ్చిన ముగ్గురు మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ కార్యాలయం వద్ద 100మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్యోగులను మాత్రమే లోనికి అనుమతించారు. ఈ సందర్భంగా కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ కరవు మండలాలను ప్రకటించడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ఇరిగేషన్‌, వ్యవసాయ మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యమేలాలని ముఖ్యమంత్రి జగన్‌ భావిస్తున్నా, వైసీపీని గద్దె దించేవరకూ అరాచక పాలనపై పోరాటం ఆపబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వనమా నరేంద్రకుమార్‌, శ్రీనివాస రాజు, సురేంద్రనాథ రెడ్డి, పాకాలపాటి రవిరాజు, పాండురంగ విఠల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T04:51:29+05:30 IST