Share News

Chandrababu : 17ఏ తీర్పు తర్వాతే విచారణ

ABN , First Publish Date - 2023-11-29T03:39:56+05:30 IST

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్‌ వర్తింపుపై తీర్పు వచ్చిన తర్వాతే.. ఆయన బెయిల్‌ను రద్దుచేయాలంటూ సీఐడీ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Chandrababu : 17ఏ తీర్పు తర్వాతే విచారణ

బాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీం స్పష్టీకరణ

సభలు, ర్యాలీల నిర్వహణకు టీడీపీ అధినేతకు అనుమతి

స్కిల్‌ కేసుపై బహిరంగంగా మాట్లాడొద్దని ఆదేశం

ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని వ్యాఖ్య

సీఐడీ పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని బాబుకు నోటీసు

విచారణ 8కి వాయిదా

న్యూఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్‌ వర్తింపుపై తీర్పు వచ్చిన తర్వాతే.. ఆయన బెయిల్‌ను రద్దుచేయాలంటూ సీఐడీ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టీడీపీ అధినేతకు ఉపశమనం కలిగించేలా.. రాజకీయ బహిరంగ సభలు, ర్యాలీల్లో ఆయన పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. స్కిల్‌ కేసు గురించి చంద్రబాబు మీడియా ఎదుట బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దన్న షరతు కొనసాగుతుందని తెలిపింది. ఈ వ్యవహారంలో ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని సూచించింది. చంద్రబాబు బెయిల్‌ రద్దు కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సత్వర విచారణకు నిరాకరించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 8కి వాయిదా వేసింది. స్కిల్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్‌ బెయిల్‌ వ్యవహారంలో కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని.. కేసు మూలాల్లోకి వెళ్లి క్లీన్‌చిట్‌ ఇచ్చే ప్రయత్నం చేసిందని, ఆయనకిచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ సీఐడీ గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాదులు రంజిత్‌కుమార్‌, ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

కేసుల విచారణను వాయిదా వేసే బదులు చంద్రబాబుకు నోటీసులివ్వాలని రోహత్గీ కోరారు. స్కిల్‌ కేసు రూ.300 కోట్ల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన కేసని తెలిపారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇస్తూ హైకోర్టు విధించిన బెయిల్‌ షరతులను పొడిగించాలని రంజిత్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. కేసు గురించి చంద్రబాబు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకుండా ఉండేలా ఆదేశాలివ్వాలని కోరారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు జోక్యం చేసుకుని.. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న అంశాల గురించి సంబంధిత అధికారులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని.. ఒకవేళ అలాంటి ఆదేశాలు ఇస్తే ఇరుపక్షాలకూ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాలూ సంయమనం పాటించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే రోహత్గీ స్పందిస్తూ.. నిందితులకు తప్ప ప్రభుత్వానికి అలాంటి ఆదేశాలు వర్తించవని.. నిందితులు, ప్రభుత్వం సమానం కాదని పేర్కొన్నారు. అయితే రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనరాదన్న షరతు విధించాలని సీఐడీ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. స్కిల్‌ కేసు గురించి మాత్రం ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని పేర్కొంది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది.

Updated Date - 2023-11-29T04:53:17+05:30 IST