Odisha Train Accident: రైలు ప్రమాదంపై ఖరగ్‌పూర్‌లో విచారణ

ABN , First Publish Date - 2023-06-04T19:39:49+05:30 IST

ఒడిశా (Odisha)లోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై ఆగ్నేయ రైల్వేకు చెందిన సేఫ్టీ కమిషనర్‌ సోమ, మంగళవారాల్లో ఖరగ్‌పూర్‌ (Kharagpur)లోని సౌత్‌ ఇనిస్టిట్యూట్‌లో బహిరంగ విచారణ చేపట్టనున్నారు.

Odisha Train Accident: రైలు ప్రమాదంపై ఖరగ్‌పూర్‌లో విచారణ

విశాఖపట్నం: ఒడిశా (Odisha)లోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై ఆగ్నేయ రైల్వేకు చెందిన సేఫ్టీ కమిషనర్‌ సోమ, మంగళవారాల్లో ఖరగ్‌పూర్‌ (Kharagpur)లోని సౌత్‌ ఇనిస్టిట్యూట్‌లో బహిరంగ విచారణ చేపట్టనున్నారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (Coromandel Express), యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ ప్రమాదంలో సుమారు 290 మంది మృతిచెందగా, 900 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై చట్టబద్ధంగా విచారణ చేపట్టాలని రైల్వే మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలోని ఆగ్నేయ రైల్వేకు చెందిన కమిషనర్‌ ఆఫ్‌ సేఫ్టీ పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. ఖరగ్‌పూర్‌లో నిర్వహించనున్న బహిరంగ విచారణకు ప్రయాణికులు, మృతులు, గాయపడినవారి కుటుంబ సభ్యులు, క్షతగాత్రులు, స్థానిక ప్రజలు హాజరు కావాలని రైల్వే శాఖ కోరింది.

సీబీఐ విచారణ

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ (CBI) విచారణకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదం వెనక ఉగ్రకుట్ర ఉందని ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. మరోవైపు మానవతప్పిదమనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అంతేకాకుండా దీనిపై ఇద్దరు రైల్వే అధికారుల ఫోన్‌కాల్ సంభాషణ కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఆదివారం రాత్రి భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ విచారణను సీబీఐకి అప్పగించాలని ఇండియన్ రైల్వే బోర్డు నిర్ణయించినట్లు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు.

Updated Date - 2023-06-04T19:41:28+05:30 IST