Share News

ఎక్కువ రేటే ముద్దు!

ABN , First Publish Date - 2023-11-29T04:45:17+05:30 IST

విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌ల టెండర్లలో ప్రభుత్వం అసలు ఉద్దేశం బయటపడుతోంది. టెండర్ల ప్రక్రియ ముగిసిపోయిన తర్వాత కాంట్రాక్టర్లకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌వోసీ) జారీచేసేలా నిబంధనలు మార్చేసిన ప్రభుత్వం...

ఎక్కువ రేటే ముద్దు!

ట్యాబ్‌ల్లో కంపెనీలకు దోచిపెట్టేందుకు సిద్ధం

బిడ్లు ముగిశాక ఎల్‌వోసీ ఇవ్వాలని నిర్ణయం

ముందే చెబితే 10,800కే ఇచ్చేవారమన్న ఓ కంపెనీ

మళ్లీ టెండర్‌ పిలిస్తే అదే ధరకు ఇస్తామని ఆఫర్‌

కానీ, సమయం లేదని తిరస్కరణ

మొత్తంగా రూ.50కోట్లకు పైగా వృథా

‘జగన్‌ బర్త్‌డే’తో ఖజానాకు నష్టం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌ల టెండర్లలో ప్రభుత్వం అసలు ఉద్దేశం బయటపడుతోంది. టెండర్ల ప్రక్రియ ముగిసిపోయిన తర్వాత కాంట్రాక్టర్లకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌వోసీ) జారీచేసేలా నిబంధనలు మార్చేసిన ప్రభుత్వం... ఎలాగైనా కొన్ని కంపెనీలకే ఇవ్వాలని కంకణం కట్టుకుంది. పెద్దగా ధర తగ్గించకపోయినా సరే ఎల్‌వోసీ ఇచ్చి మరీ ప్రజాధనాన్ని కొన్ని కంపెనీలకు దోచిపెట్టబోతోంది. తాజాగా జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ ఎల్‌వోసీ ఇచ్చేలా టెండరు నిబంధనలు మార్చేందుకు అంగీకారం తెలిపింది. ఎల్‌వోసీ జారీచేసిన నేపథ్యంలో తిరిగి టెండర్లు నిర్వహిస్తే రూ.10,800 తక్కువ ధరకే ట్యాబ్‌లు సరఫరా చేస్తామని ఓ కంపెనీ ముందుకు వచ్చింది. అయితే.. ‘సమయం లేదు’ అనే కారణంగా దాన్ని పరిగణనలోకి తీసుకోనివైనం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ జరిగింది..

ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు ఏపీటీఎస్‌ ద్వారా పాఠశాల విద్యాశాఖ టెండర్లు పిలిచింది. గతేడాది 64జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉన్న ట్యాబ్‌లు తీసుకోగా, ఈసారి 256జీబీ స్టోరేజీ ట్యాబ్‌లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రూ.15,800 చొప్పున ట్యాబ్‌లు సరఫరా చేసేందుకు ఓ కంపెనీ ఎల్‌1గా నిలిచింది. అయితే చివరకు వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వబోయే ముందు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇవ్వాలని ఎల్‌1తో పాటు టాప్‌లో ఉన్న కంపెనీలు కోరాయి. దాన్ని తిరస్కరించిన ప్రభుత్వం... ఎల్‌వోసీ ఇచ్చి, 30 రోజుల్లో బిల్లులు చెల్లించే గ్యారంటీ ఇచ్చేందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని పాఠశాల విద్య...జ్యుడీషియల్‌ ప్రివ్యూకు లేఖ రాయగా దానికి ఆమోదం లభించింది.

తక్కువకు మాకొద్దు

టెండర్ల ప్రక్రియ ముగిసిన దశలో ఎల్‌వోసీ ఇచ్చేలా పేమెంట్‌ నిబంధనలు మార్చేయడం తో అనేక అభ్యంతరాలు వచ్చాయి. ఇది సెంట్ర ల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలకు వ్యతిరేకమని ఓ కాంట్రాక్టరు అభ్యంతరం తెలిపారు. ఇది సీవీసీ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉందని దాన్ని తిరస్కరించారు. మొదట్లోనే ఎల్‌వోసీ ఇస్తామనే ఆప్షన్‌ పెట్టి ఉంటే రూ.10,800 కే ట్యాబ్‌లు ఇచ్చేవారమని ఎమిజో సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ అభ్యంత రం తెలిపింది. ఎల్‌వోసీ నిబంధనతో మళ్లీ టెండర్లు నిర్వహిస్తే తక్కువ ధరకు ట్యాబ్‌లు ఇస్తామని వివరించింది. పైగా టెండర్ల ప్రక్రియలో పారదర్శకత వస్తుందని వాదించిం ది. అయితే ఆ కంపెనీ గతంలోనూ అర్హత సాధించలేదని, పైగా ఇప్పుడు టెండర్లను మళ్లీ పిలిస్తే అసాధారణమైన జాప్యం జరుగుతుందనే కారణంతో జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ దానిని తిరస్కరించింది. ఇది విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపింది. అందువల్ల పరిగణనలోకి తీసుకోలేమని తెలిపింది. అయితే పాఠశాల విద్యాశాఖ అభిప్రాయం మేరకే టెండర్ల ప్రక్రియను తిరిగి చేపట్టకూడదని నిర్ణయించినట్లు అర్థమవుతోంది.

సీఎం పుట్టిన రోజు కోసం...

ట్యాబ్‌ల టెండర్లు తిరిగి పిలవకపోడానికి ప్రధాన కారణం జగన్‌ పుట్టిన రోజు. గతేడాది సీఎం బర్త్‌డే రోజు డిసెంబరు 21న విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ ఏడాది కూడా అదే రోజు ఇవ్వాలని నిర్ణయించారు. ఒకవేళ ప్రభుత్వం వాదిస్తున్నట్లుగా ఎల్‌1గా వచ్చిన కంపెనీపై ఎలాంటి ప్రేమ లేదనకుంటే కేవలం సీఎం బర్త్‌డే రోజు ట్యాబ్‌లు ఇవ్వడం కోసమే ముందుకెళ్తున్నట్లు అర్థమవుతోంది. ఆ రోజు ట్యాబ్‌లు ఇచ్చి జగన్‌ పుట్టిన రోజు ప్రచా రం చేసుకోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఇప్పుడు ఇదే ప్రభుత్వానికి పెద్ద నష్టం తెచ్చి పెట్టింది. ఆలస్యమైతే విద్యార్థులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. అదే నిజమైతే విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన ట్యాబ్‌లు సగానికిపైగా విద్యా సంవత్సరం పూర్తయ్యాక డిసెంబరులో ట్యాబ్‌లు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పటికే 7నెలలు విద్యా సంవత్సరంలో ట్యాబ్‌లు వాడలేదు. ఇంతకాలం రాని నష్టం ఇప్పుడు వస్తుందని చెప్పడం విడ్డూరంగా మారింది.

డిమాండ్‌ లేని ట్యాబ్‌లు

వాస్తవానికి మార్కెట్‌లో ట్యాబ్‌లకు ఎలాంటి డిమాండ్‌ లేదు. దీంతో తయారీ కంపెనీలు కూడా ట్యాబ్‌ల ఉత్పత్తిని చాలా వరకు తగ్గించేశాయి. స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి వస్తుండటంతో ట్యాబ్‌ల మాటే వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఒకేసారి ఐదు లక్షల ట్యాబ్‌లు అం టూ కంపెనీలకు వ్యాపారాన్ని సృష్టించింది. దీంతో డిమాం డ్‌ లేని ట్యాబ్‌లపై అధిక లాభాలు పొందవచ్చనే ఉద్దేశంతో చాలా కంపెనీలు ముందుకొచ్చాయి. కేవ లం ప్రభుత్వం సకాలం లో బిల్లులు ఇవ్వదనే ఏకైక కారణంతో తక్కువ ధరను కోట్‌ చేసే సాహసం మాత్రం చేయలేకపోయాయి. ముందుగానే బిల్లులు ఇస్తామని నిబంధన పెడితే చాలా తక్కువ ధరకే ట్యాబ్‌లు వచ్చే అవకాశం ఉంది. కానీ ముందు గా ఎల్‌వోసీ నిబంధన పెట్టకుండా, భారీగా ధర కోట్‌ చేశాక ఇప్పుడు ఎల్‌వోసీ నిబంధన పెట్టారు. దీంతో 30 రోజుల్లోనే నగదు చేతికొచ్చే అవకాశం ఉన్నా కాంట్రాక్టర్లు పెద్దగా ధర తగ్గించలేదు.

ఇదేనా తగ్గింపు?

గతేడాది రూ.12,843కు ఒక్కో ట్యాబ్‌ను సరఫరా చేశారు. ఈ ఏడాది తొలుత రూ.15,800 కోట్‌ చేశారు. అయితే ఎల్‌వోసీ జారీచేస్తే ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని, దాంతో దాదాపుగా గతేడాది ఇచ్చిన ధరకే ట్యాబ్‌లు వస్తామని పాఠశాల విద్యాశాఖ...జ్యుడీషియల్‌ ప్రివ్యూకు రాసిన లేఖలో తెలిపింది. దీంతో సుమారు రూ.13వేలకు ట్యాబ్‌లు వస్తాయని అంతా ఊహించారు. తీరా ఇప్పుడు రూ.14,200 ధరకే ట్యాబ్‌లు ఇస్తామని ఆ కంపెనీలు తెలిపాయి. ఇది గతేడాది ధర కంటే రూ.1,357 ఎక్కువ. అయినాసరే ప్రభుత్వం గుడ్డిగా ఎల్‌వోసీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇలా ఒక్కో ట్యాబ్‌పై రూ.1,300 నష్టం అంటే ఐదు లక్షల ట్యాబ్‌ల కొనుగోళ్లలో ప్రభుత్వానికి రూ.50కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. అదే ఎమిజో కంపెనీ ప్రతిపాదించినట్లుగా రూ.10,800కు ట్యాబ్‌ లభిస్తే ప్రభుత్వానికి రూ.120 కోట్లు మిగిలేవి. కానీ ఇటు ఆ కంపెనీ ప్రతిపాదనను తిరస్కరించి, మరోవైపు గతేడాది ధర కంటే ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తూ రెండు వైపులా ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతోంది.

Updated Date - 2023-11-29T04:45:20+05:30 IST