Share News

అబ్బబ్బా... ఆ పనులు మాకొద్దు !

ABN , First Publish Date - 2023-11-27T23:38:22+05:30 IST

నెల్లూరు ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) పరిధిలోని ఉడ్‌కాంప్లెక్స్‌, ఇండస్ట్రీయల్‌ పార్కు(ఐపీ) (ఏకేనగర్‌) ప్రాంతాలు గత ఇరవైఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. కనీస సదుపాయాల కల్పనలో ఏపీఐఐసీ విఫలమయింది.

అబ్బబ్బా... ఆ పనులు మాకొద్దు !
అధ్వానంగా ఉడ్‌కాంప్లెక్స్‌లోని ప్రధాన రహదారి, ఉడ్‌ కాంప్లెక్స్‌లో వ్యర్థాలతో పూడుకుపోయిన మురుగు కాలువ

రెండుసార్లు టెండర్లు పిలిచినా స్పందన శూన్యం

అధ్వానంగా ఉడ్‌కాంప్లెక్స్‌, ఇండస్ట్రీయల్‌ పార్కు

రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేక ఇబ్బందులు

పరిశ్రమల నుంచి రూ. కోట్లలో పన్నుల వసూలు

నెల్లూరు (వెంకటేశ్వరపురం) నవంబరు 27 : నెల్లూరు ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) పరిధిలోని ఉడ్‌కాంప్లెక్స్‌, ఇండస్ట్రీయల్‌ పార్కు(ఐపీ) (ఏకేనగర్‌) ప్రాంతాలు గత ఇరవైఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. కనీస సదుపాయాల కల్పనలో ఏపీఐఐసీ విఫలమయింది.ఆటోనగర్‌ ప్రాంతంలో మాత్రం ఇటీవల ప్రధాన రొడ్లు,డ్రైన్‌లు నిర్మించారు. కానీ చాలా ప్రాంతాలు అధ్వానంగా ఉన్నాయి. ప్రధానంగా ఉడ్‌కాంప్లెక్స్‌, ఐపీ ప్రాంతాల్లో దాదాపు 757 ఫ్లాట్‌లను పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపన కోసం విక్రయించారు. వీరంతా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏపీఐఐసీకి పన్నులు చెల్లిస్తారు. ఇలా వీరు చెల్లించిన పన్నులు ఏడాదికి దాదాపు రూ.2కోట్లు వరకు ఉంటాయి. ఇందులో 35 శాతం నగర కార్పొరేష న్‌కు చెల్లిస్తారు.5 శాతం గ్రంఽథాలయ సంస్థకు చెల్లిస్తారు.మిగతా 60 శాతం పన్నులతో ఈ ప్రాంతాల్లో శానిటేషన్‌తోపాటు మౌలిక సదుపాయల కల్పనను ఏపీఐఐసీ చేపట్టాల్సి ఉంది. అయితే ఏళ్ల తరబడి ఆటోనగర్‌,ఉడ్‌కాంప్లెక్స్‌, ఐపీ ప్రాంతాల్లో రోడ్లు,మురుగు కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేయడం లేదు.

టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

ఉడ్‌కాంప్లెక్స్‌, ఐపీ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు రూ.92 లక్షలతో ఏపీఐఐసీ అక్టోబరు 5న టెండర్లు ఆహ్వానించింది. అయితే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. దీంతో ఈనెల మొదటి వారంలో మరోసారి టెండర్లు ఆహ్వానించారు. అయినా ఇప్పటి వరకు ఒక్కరు కూడా టెండర్‌ వేయలేదని సమాచారం. త్వరలోనే ఎన్నికలు రానున్న నేపధ్యంలో కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పేరుకున్న వ్యర్థాలు

నెల్లూరు పారిశ్రామిక వాడలైన ఆటోనగర్‌, ఉడ్‌కాంప్లెక్స్‌ , ఐపీ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చెత్త,వ్యర్ధాలు,డ్రైనేజీ పేరుకుపోయాయి. ఈ మూడు ప్రాంతాల్లో శానిటేషన్‌ పనులను ప్రైవేటు కాంట్రాక్ట్‌లకు అప్పగించారు. ఇక నుంచి నిత్యం పారిశ్రామిక వాడల్లో శానిటేషన్‌ సక్రమంగా ఉండేలా వీరు చూడాల్సి ఉంది. ఇందుకోసం వీరికి సంవత్సరానికి ఆటోనగర్‌కు రూ.15లక్షలు, ఐపీ నెల్లూరుకు రూ.9లక్షలు, ఉడ్‌కాంప్లెక్స్‌కు రూ. 4.50 లక్షలు చెల్లించనున్నారు.

రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచాం

నెల్లూరులోని ఉడ్‌కాంప్లెక్స్‌, ఐపీ ప్రాంతాల్లో రోడ్లు ,డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్లు పిలిచాం. మొదటిసారి ఎవరూ రాలేదు. రెండోసారి పిలిచాం. ఇంకా సమయం ఉంది. ఓ కాంట్రాక్టర్‌ టెండర్‌ చేశారు. మరికొంతమంది వేస్తారని ఆశిస్తున్నాం.

-విజయరత్నం, ఏపీఐఐసీ జెడ్‌ఎం

==============

Updated Date - 2023-11-27T23:38:23+05:30 IST