Share News

సాగు.. సాగేనా..?

ABN , First Publish Date - 2023-11-27T22:35:08+05:30 IST

అధికారులు సాగు నీరు ఇవ్వలేమని తేల్చి చెప్పేసిన క్రమంలో ఈ రబీ సీజన్‌లో సాగు.. లేక పంట విరామం ఇవ్వాల్సిందేనా..?

సాగు.. సాగేనా..?
నారాయణరెడ్డిపేటలో సిద్ధమైన వరినారు, భూములు

కనుపూరు కాలువ ఆయకట్టు రైతుల ఆందోళన

డెల్టా కింద 12 వేల ఎకరాలకు సాగునీరు

నెల్లూరురూరల్‌, నవంబరు 27 : అధికారులు సాగు నీరు ఇవ్వలేమని తేల్చి చెప్పేసిన క్రమంలో ఈ రబీ సీజన్‌లో సాగు.. లేక పంట విరామం ఇవ్వాల్సిందేనా..? ప్రత్యామ్నాయ పంటలేసి నీరు అందకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి..? ప్రస్తుతం కనుపూరు కాలువ కింద ఆయకట్టు, లోతట్టు సాగుదారులను వెంటాడుతున్న ప్రశ్నలివి. నెల్లూరురూరల్‌ పరిధిలోని 22 చెరువుల కింద ఏటా 10 వేల ఎకరాలు కనుపూరు కాలువ ఆయకట్టు, మరో 10 వేల ఎకరాలు లోతట్టు ఆయకట్లు సాగవుతోంది. ఈ కాలువకు నీటిని ఇవ్వలేమన్న అధికారులు జాఫర్‌సాహెబ్‌, సర్వేపల్లి కాలువల కిందున్న డెల్టా ఆయకట్టు 12 వేల ఎకరాలకు సాగు నీరించ్చేందుకు ఐఏబీలో తీర్మానం చేశారు.

నెల్లూరురూరల్లో పడమర ప్రాంతంలో పొట్టేపాళెం నుంచి గొల్లకందుకూరు వరకు, అంబాపురం నుంచి మొగళ్లపాళెం వరకు 22 చెరువుల మీద ఆధారపడి పంటలు సాగు చేస్తారు. ఆ చెరువులకు కనుపూరు కాలువ ద్వారా సాగునీరు వస్తేనే పంటలు పండే పరిస్థితి. సోమశిలలో నీటి నిల్వలు తక్కువుగా ఉన్న కారణంతో డెల్టా వరకే నీరిచ్చిన అధికారులు కనుపూరు కాలువకు నీటి కేటాయింపులు మినహాయించారు. దీంతో కాలువ కిందున్న రైతాంగం ఆందోళనలో పడింది. ప్రత్యేకించి రబీ ప్రధాన వ్యవసాయ సీజన్‌ కావడం, దిగుబడులు కూడా ఇందులోనే ఎకరానికి 4 పుట్ల వరకు చేతికందే అవకాశం ఉండటంతో ప్రతి రైతు సేధ్యానికి సిద్ధమయ్యారు. తీరా కనుపూరు కాలువకు నీరు కేటాయింపు లేదంటూ ఐఏబీలో అధికారులు ప్రకటిచడంతో అన్నదాతల నెత్తిన పిడుగుపడినట్లైంది.

నారుమళ్లు సిద్ధం చేసుకుని...

కనుపూరు కాలువకు సాగునీరు ఇస్తారని విశ్వసించిన రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులతో నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. మోటార్ల కింద సేధ్యమున్న రైతులు మరో అడుగు ముందుకేసి నారేతలకు దిగారు. గొల్లకందుకూరు, సజ్జాపురం తదితర ప్రాంతాల్లో వెదజల్లే పద్ధతిని తెర పైకి తీసుకువచ్చి సేధ్యాన్ని షురూ చేశారు. తీరా కనుపూరు కాలువకు నీటి కేటాయింపులు ఆపేయడంతో ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులు వృథాగా మారాయి. దీంతో అన్నదాతులు ఏం చెయ్యాలో పాలుపోక అయోమయ దుస్థితిని ఎదుర్కొంటున్నారు.

ప్రత్యామ్నాయం ఏం వెయ్యాలి..?

రబీలో ప్రధానంగా వరిని పండించే రైతులు ప్రత్యామ్నాయం వైపు చూడరు. కానీ ప్రస్తుతమున్న ప్రతికూల పరిస్థితుల్లో అనివార్యం కావడంతో ప్రత్యామ్నాయం కింద ఏం పంటలు వెయ్యాలన్నది గందరగోళంగా మారింది. ఆరుతడి కింద 100 రోజుల్లో చేతికందే పెసర, నువ్వు పంటలను వ్యవసాయ శాఖ సిఫార్సు చేస్తోంది. కానీ వీటిని ఇప్పట్లో సాగు చేస్తే చేతికందే సమయానికి ధరలు లేకపోతే పెట్టుబడులు వృథా అని రైతులు ఆందోళన చేందుతున్నారు.

Updated Date - 2023-11-27T22:35:37+05:30 IST