Share News

చేపలపై ప్లాస్టిక్ పంజా

ABN , First Publish Date - 2023-11-29T04:48:06+05:30 IST

ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్ర జీవరాశుల మనుగడను దెబ్బతీస్తున్నాయి. మనం వినియోగించే ప్లాస్టిక్‌కు సంబంధించిన వ్యర్థాలు వివిధ మార్గాల్లో సముద్రంలో కలుస్తున్నాయి.

చేపలపై ప్లాస్టిక్ పంజా

సముద్ర చేపల శరీరాల్లో మైక్రో ప్లాస్టిక్‌ వ్యర్థాలు

ఎక్కువ భాగం కాలేయానికి చేరుతున్నట్టు నిర్ధారణ

కాలేయంలో 0.5 నుంచి 0.6 గ్రాముల ప్లాస్టిక్‌

ఏయూ మెరైన్‌ లివింగ్‌ రీసోర్స్‌ విభాగం పరిశోధనలో గుర్తింపు

రెండేళ్లుగా విశాఖ సముద్ర తీరం వెంబడి పరిశోధన

చేపల ఉత్పత్తిపై ప్రభావం.. సముద్ర జీవరాశులు తగ్గే చాన్స్‌

సీఫుడ్‌ను ఆహారంగా తీసుకునే వారిపైనా ప్రభావం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్ర జీవరాశుల మనుగడను దెబ్బతీస్తున్నాయి. మనం వినియోగించే ప్లాస్టిక్‌కు సంబంధించిన వ్యర్థాలు వివిధ మార్గాల్లో సముద్రంలో కలుస్తున్నాయి. అలా చేరిన వ్యర్థాల్లో తేలికగా ఉండేవి నాచుపైన, బరువుగా ఉండేవి సముద్రం అడుగు భాగానికి చేరుతుంటాయి. నాచు తిన్నప్పుడు, నీటిని తాగినప్పుడు... ఐదు మిల్లీమీటర్లు కంటే తక్కువగా ఉండే మైక్రో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేపల్లోకి వెళ్తున్నట్టు ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) మెరైన్‌ లివింగ్‌ రీసోర్స్‌ డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనల్లో తేలింది. ఒక్కో చేప శరీరంలో 0.5 నుంచి 0.9 మిల్లీ గ్రాముల వరకు మైక్రో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉంటున్నట్టు చెబుతున్నారు. ఇందులో అత్యధిక భాగం చేప లివర్‌లోనే ఉన్నట్టు గుర్తించారు.

ఎకో మెరైన్‌ పేరుతో ప్రాజెక్టు

సముద్రాన్ని పర్యావరణహితంగా ఉంచే ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఎకో మెరైన్‌ పేరుతో యూరోపియన్‌ యూనియన్‌ ఒక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనిలో ఆరు దేశాలు, రెండు యూనివర్సిటీలు పాలుపంచుకుంటున్నాయి. ఈస్ట్‌కో్‌స్టలో ఆంధ్ర యూనివర్సిటీని, వెస్ట్‌ కోస్ట్‌లో కేరళలోని యూనివర్సిటీని ఎంపిక చేశారు. 2021 నుంచి 2024 వరకు ఈ పరిశోధన సాగనుంది. దీనికోసం యూరోపియన్‌ యూనియన్‌ రూ.1.11 కోట్లు అందిస్తోంది.

పరిశోధనలో ఏం తేలిందంటే..

గత రెండేళ్లుగా సాగుతున్న పరిశోధనలో అనేక కీలక అంశాలు నిర్ధారణ అయ్యాయి. ప్రధానంగా పండుగప్ప, కవళ్లుపై పరిశోధన నిర్వహించగా, ఈ రెండు చేపల అవయవాల్లో ప్లాస్టిక్‌ అవశేషాలను గుర్తించారు. లివర్‌, కిడ్నీ, చర్మం వంటి శరీర భాగాల్లో ఎక్కువగా ప్లాస్టిక్‌ అవశేషాలు కనిపించాయి. అత్యధికంగా చేప లివర్‌లో ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతానికి చేపలపై మాత్రమే పరిశోధన చేస్తుండడం వల్ల ఈ విషయాలు తెలిశాయని, మిగిలిన జీవరాశుల్లో కూడా ఇదే విధమైన ప్రభావం ఉండవచ్చునని పరిశోధకులు తెలిపారు.

పునరుత్పత్తి సమస్యలు

ప్లాస్టిక్‌ వ్యర్థాలను తీసుకునే చేప ల్లో పునరుత్పత్తి రేటు భారీగా తగ్గుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. దీనివల్ల సముద్ర జీవరాశుల ఉత్పాదక సామర్థ్యం భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ అవశేషాలు ఉన్న చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనుషుల ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై పరిశోధన జరగాల్సి ఉందన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ పరిశోధన ప్రకారం 2050 నాటికి సముద్రంలో చేపల బరువు కంటే ప్లాస్టిక్‌ వ్యర్థాలు బరువు అధికంగా ఉండనుంది.

పరిష్కార మార్గాలు

ఈ పరిస్థితిలో మార్పులు తీసుకురావాలంటే ప్లాస్టిక్‌ వస్తువుల ఉత్పత్తిని, వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలి. ప్రజల్లో ఈ మేరకు అవగాహన కలిగించాలని ప్రాజెక్ట్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ ప్రొఫెసర్‌ పి.జానకీరామ్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పరిశోధనతోపాటు మైక్రో ప్లాస్టిక్స్‌ను గుర్తించడంపై శిక్షణ కూడా అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు రెండు బ్యాచ్‌లకు చెందిన స్కాలర్స్‌, అధ్యాపకులు 50 మందికి శిక్షణ ఇచ్చామన్నారు.

Updated Date - 2023-11-29T04:48:07+05:30 IST