Share News

ఆందోళన విరమించి విధుల్లో చేరండి

ABN , First Publish Date - 2023-11-29T04:49:43+05:30 IST

సహేతుకంగా లేని డిమాండ్లతో ఆందోళన చేస్తున్న సామాజిక ఆరోగ్యాధికారులు (సీహెచ్‌వో) వెంటనే ఆందోళన విరమించి, పూర్తిస్థాయి విధుల్లో కొనసాగాలని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు కోరారు.

ఆందోళన విరమించి విధుల్లో చేరండి

లేకుంటే విధుల నుంచి తొలగిస్తాం

సీహెచ్‌వోలను హెచ్చరించిన కృష్ణబాబు

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): సహేతుకంగా లేని డిమాండ్లతో ఆందోళన చేస్తున్న సామాజిక ఆరోగ్యాధికారులు (సీహెచ్‌వో) వెంటనే ఆందోళన విరమించి, పూర్తిస్థాయి విధుల్లో కొనసాగాలని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు కోరారు. ఎంఎల్‌హెచ్‌పి, సీహెచ్‌వోలు తమ వినతిపత్రంలో మూల వేతనాన్ని 25 నుంచి 35 వేలకు పెంచాలని, వారి వార్షిక ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని, ఏడాదికి 35 రోజులు సెలవులు, విధి నిర్వహణకు మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతోపాటు సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు దశలవారీ ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలపై కృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం 2019 నుంచి సీహెచ్‌వోల నియమించిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విలేజ్‌ క్లినిక్స్‌లో సీహెచ్‌వోలు ఏడాది కాంట్రాక్టుపై నియమితులయ్యారని, పనితీరు ఆధారంగా వారి కాంట్రాక్టును పునరుద్ధరిస్తామన్నారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అశక్తత కారణంగా విధులు నిర్వహించలేకపోయినా వేతనాలు నిలుపు చేయటంతోపాటు విధుల నుంచి తొలగించే అధికారం ఉందని తెలిపారు. సీహెచ్‌వోల డిమాండ్లపై ఆరోగ్యశాఖ కమిషనర్‌ చర్చలు జరిపి ఏటా 15 రోజుల సాధారణ సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అయినా దశలవారీ ఆందోళనల పేరుతో విధులను విస్మరిస్తున్నారని తెలిపారు. ఆందోళన విరమించి పూర్తిస్థాయి విధుల్లో కొనసాగాలని కృష్ణబాబు సూచించారు. విధుల్లో చేరని పక్షంలో కాంట్రాక్టులను రద్దు చేసి ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈమేరకు బుధవారం కృష్ణబాబు సీహెచ్‌వోలతో మరోసారి వెబినార్‌ నిర్వహిస్తారు.

Updated Date - 2023-11-29T04:49:55+05:30 IST