YCP MPTC Attack on Dalit: వైసీపీ సర్కారు వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనమా?

ABN , First Publish Date - 2023-01-04T21:58:01+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది అణగారిన వర్గాల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ వర్గాలకే రక్షణ కరువైందా?..

YCP MPTC Attack on Dalit:  వైసీపీ సర్కారు వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనమా?

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది అణగారిన వర్గాల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ వర్గాలకే రక్షణ కరువైందా?.. రాష్ట్రంలో వెలుగుచూసిన పలు అమానవీయ ఘటనలే ఇందుకు నిదర్శనమా?. ముఖ్యంగా దళితులపై జరుగుతున్న దాడులు వైసీపీ సర్కార్ వైఫల్యానికి నిలువుటద్దమా?... నెల్లూరు జిల్లాలో పెట్రోల్ బంకులో పని చేస్తున్న ఓ దళిత యువకుడిపై వైసీపీ ఎంపీటీసీ విచక్షిణారహిత దాడి ఘటన నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న ఆందోళనకర ప్రశ్నలివి. దగదర్తి మండలం ఉలవపాళ్ల పెట్రోల్ బంకులో పని చేస్తున్న తేజ అనే దళిత యువకుడిపై బొడిగుడిపాడు వైసీపీ ఎంపీటీసీ మహేష్ నాయుడు ఇటివల అత్యంత అమానవీయంగా దాడి చేశాడు. మహేష్ నాయుడు ఇంధనం కోసమని కారులో బంకుకి వచ్చాడు. అయితే అప్పటికే సర్వర్ పనిచేయని కారణంగా పెట్రోల్ కొట్టడం సాధ్యపడదని ఉన్న విషయాన్ని తేజ చెప్పాడు. పాపం.. ఇలా చెప్పడమే తేజ పాలిట నేరమైంది. మహేష్ నాయుడు తీవ్ర కోపోద్రిక్తుడై అమాయకుడిపై రెచ్చిపోయాడు. అన్యాయంగా, అత్యంత అమానవీయంగా తేజపై దాడి చేశాడు. అనుచరులతో కలిసి దారుణాతి దారుణంగా కొట్టారు. ఎంత బతిమాలినా పట్టించుకోకుండా చావబాదారు.

పెట్రోల్ బంకులో అమర్చిన సీసీ కెమెరాల్లో ఈ దాడి దృశ్యాలన్నీ రికార్డవ్వడంతో వ్యవహారం బయటపడింది. దాడికి సంబంధించిన దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారాయి. సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నారు. దాడికి పాల్పడ్డ వైసీపీ ఎంపీటీసీపై మండిపడుతున్నారు. అకారణంగా ఒక దళిత యువకుడిపై ఇంత దారుణంగా దాడి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం పక్కనున్న ఒక్కరు కూడా ఆపకుండా చోద్యం చూశారని, అధికార దుహంకారం తలకెక్కిందని విమర్శిస్తున్నారు. దళిత యువకుడిపై దాడికి కారణమైన వైసీపీ ఎంపీటీసీ, అతడి అనుచరులపై కఠిన చర్యలు మండిపడుతున్నారు.

కాగా వైసీపీ ఎంపీటీసీ చేసిన ఈ అమానవీయ దాడి ఘటనను టీడీపీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ కీలక నేత నారా లోకేష్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘దళితులపై వైసీపీ నేతల దమనకాండ కొనసాగుతూనే ఉంది. కావలి నియోజకవర్గం దగదర్తి మండలం ఉలవపాళ్ళ పెట్రోల్ బంక్‌లో సర్వర్ పనిచేయని కారణంగా పెట్రోల్ కొట్టడం కుదరదున్నందుకు దళిత యువకుడు తేజపై అత్యంత దారుణంగా అనుచరులతో కలిసి బొడిగుడిపాడు వైసిపి ఎంపీటీసీ మహేష్ నాయుడు దాడి చేశాడు. కాళ్లతో తన్ని, ఇనుప రాడ్డుతో తేజని తీవ్రంగా గాయపరిచారు. దళిత యువకుడుపై దాడి చేసిన ఎంపీటీసీ మహేష్ నాయుడు, అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చెయ్యాలి. గాయపడిన తేజకి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి’’ అని నారా లోకేష్ డిమాండ్ చేశారు. అయితే అణగారిన వర్గాల ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసీపీ పాలనలో వెలుగుచూస్తున్న ఈ ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ తరహా దాడుల నివారణకు ప్రభుత్వం ఇకనైనా చర్యలు తీసుకుంటుందేమో వేచిచూడాలి.

Updated Date - 2023-01-04T22:01:42+05:30 IST