Share News

రూ.331 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2023-11-29T01:59:27+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మంగళవారం సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.331.05 లక్షల కోట్లకు చేరుకుంది...

రూ.331 లక్షల కోట్లు

సరికొత్త రికార్డు స్థాయికి స్టాక్‌ మార్కెట్‌ సంపద

4 ట్రిలియన్‌ డాలర్ల మైలురాయికి చేరువలో..

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మంగళవారం సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.331.05 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం అమెరికా కరెన్సీలో ఇది 3.97 లక్షల కోట్ల డాలర్లకు సమానం. అంటే, మార్కెట్‌ సంపద 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి అత్యంత చేరువలో ఉంది. 2021 మే 24న బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌ 3 లక్షల కోట్ల డాలర్ల క్లబ్‌లో చేరింది. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌ రూ.48.67 లక్షల కోట్లు పెరగగా.. ఎక్స్ఛేంజీ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 5,333 పాయింట్లు (8.76 శాతం) పుంజుకుంది.

సెన్సెక్స్‌ 204 పాయింట్లు అప్‌: రెండ్రోజుల తర్వాత ప్రామాణిక సూచీలు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఆఖరి గంటలో మదుపర్లు వాహన, విద్యుత్‌, లోహ రంగ షేర్లలో కొనుగోళ్లు జరపడంతో మంగళవారం సెన్సెక్స్‌ 204.16 పాయింట్లు పెరిగి 66,174.20 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 95 పాయింట్ల వృద్ధితో 19,889.70 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 22 లాభపడగా.. టాటా మోటార్స్‌ షేరు 3.56 శాతం పెరిగి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అలా్ట్రటెక్‌ సిమెంట్‌ రెండు శాతానికి పైగా పెరిగాయి. కాగా, బీఎ్‌సఈలోని స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.

  • ఫారెక్స్‌ మార్కెట్‌ విషయానికొస్తే, డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లు లాభపడటంతో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులు రూపాయికి దన్నుగా నిలిచాయి.

  • అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడిచమురు పీపా ధర 80 డాలర్ల ఎగువన ట్రేడవగా.. ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒక దశ లో 2,018 డాలర్లు పలికింది.

Updated Date - 2023-11-29T01:59:28+05:30 IST