2024: ఒక ప్రజాస్వామ్యవాది ఆకాంక్ష
ABN , First Publish Date - 2023-07-01T01:09:02+05:30 IST
భారత్‌లో ప్రజాస్వామిక ప్రక్రియ కొత్త చైతన్యంతో ద్విగుణీకృతమవడం ఎలా? 2009 సార్వత్రక ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఢిల్లీ మ్యాగజైన్ నొకదానికి రాసిన వ్యాసంలో నేను నాలుగు ప్రతిపాదనలు చేశాను.
భారత్‌లో ప్రజాస్వామిక ప్రక్రియ కొత్త చైతన్యంతో ద్విగుణీకృతమవడం ఎలా? 2009 సార్వత్రక ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఢిల్లీ మ్యాగజైన్ నొకదానికి రాసిన వ్యాసంలో నేను నాలుగు ప్రతిపాదనలు చేశాను. అవి: ‘గాంధీ–నెహ్రూ కుటుంబానికి గుడ్డిగా విధేయం కాని పార్టీగా కాంగ్రెస్ ప్రభవించాలి; రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు, దాని హిందూరాష్ట్ర స్థాపన లక్ష్యానికి భారతీయ జనతా పార్టీ తనకుతానుగా దూరమవ్వాలి; సమైక్య, సంస్కరణల ఆధారిత వామపక్షం ఆవిర్భవించాలి (హింసాత్మక పద్ధతులను పూర్తిగా త్యజించడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ తప్పనిసరి అనే విశ్వాసాన్ని అది వదులుకోవాలి); విస్తరిస్తున్న మధ్యతరగతి వర్గ ఆకాంక్షల ప్రాతిపదికన పూర్తిగా ఒక కొత్త రాజకీయ పక్షం ఉనికిలోకి రావాలి (ఇది, సకల కుల, మతాలకు సమ ప్రాధాన్యమిస్తూ, నిర్దిష్ట. సామాజిక వర్గాల ప్రయోజనాలకు మాత్రమే అనుకూలంగా ఉండే విధానాలను ప్రోత్సహించకూడదు).
పదిహేను సంవత్సరాల నాటి నా ఆకాంక్షల జాబితా అది. మూడు సార్వత్రక ఎన్నికల అనంతరం, అవి మన అనుభవంలోకి ఏ మేరకు వచ్చాయో నిశితంగా చూద్దాం. గాంధీ–నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి ఒకరు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయ్యారు. అయినా ఆ పార్టీ ఇప్పటికీ ఆ కుటుంబ నియంత్రణలోనే ఉన్నది. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన వెన్వెంటనే రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను సందర్శించారు భారత్ తదుపరి ప్రధానమంత్రి రాహుల్ గాంధీయే అని ఖర్గే ప్రకటించారు. ఈ విషయమై పార్టీ శ్రేణుల్లో కొంత మందికి భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యామ్నాయ అభ్యర్థిగా రాహుల్ సోదరి ప్రియాంక గాంధీని వారు సూచిస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే ఆరెస్సెస్‌కు దూరం జరగలేదు. హిందూత్వ భావజాలాన్ని త్యజించలేదు పైగా మరింతగా సంఘ్ ప్రభావంలోకి వెళ్లింది. లోక్‌సభలో బీజేపీకి చెందిన 300మందికి పైగా ఎంపీలలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడం గమనార్హం. మైనారిటీల పట్ల, ముఖ్యంగా ముస్లింల పట్ల బీజేపీ విధానమేమిటో అది స్పష్టం చేసింది. హిందువుల వలే ముస్లింలను సమాన భారత పౌరులుగా బీజేపీ పరిగణించడం లేదన్నది స్పష్టం. పాఠ్య గ్రంథాలలో ముస్లింలకు సంబంధించిన కొన్ని పాఠాలను తీసివేయడం, జాతీయ విద్యా విధానం మొదలైనవన్నీ అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ వాద దృక్పథాన్ని స్పష్టం చేస్తున్నాయి.
భారతీయ వామపక్షాలు, ఈ వ్యాసకర్త ఆశించిన విధంగా తమనుతాము సంస్కరించుకోలేదు. నక్సలైట్లు తమ అజ్ఞాతవాసాన్ని వీడి ప్రధాన స్రవంతిలోకి ప్రవేశించి, బహుళ పార్టీ వ్యవస్థలో భాగమవడానికి బదులు విచక్షణారహితంగా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. పార్లమెంటరీ వామపక్షాలు ఇప్పుడు కేవలం ఒకే ఒక్క రాష్ట్రం అధికారంలో ఉన్నాయి. అక్కడ కూడా అవి పాలన పట్ల తమ దృక్పథాన్ని చెప్పుకోదగిన రీతిలో మార్చుకోనేలేదు. పదిహేనేళ్ల క్రితం నా ఆకాంక్షల జాబితాలో చివరిది కొత్త రాజకీయ పార్టీ సృష్టి. 2012లో భారత రాజకీయ రంగంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశించడంతో ఆ నా కోరిక సైద్ధాంతికంగా నెరవేరింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ తన మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ఆశించిన విధంగా ఒక నవ పథగామి కాలేదు. దేశ రాజకీయాలను మౌలికంగా నవీకరించడంలో ఆ పార్టీ విఫలమయింది. ఢిల్లీ ప్రజలకు ఉచిత విద్యా వైద్య సదుపాయాలు కల్పించడంలో ఆ పార్టీ ప్రభుత్వం ఒక ప్రశస్త రికార్డును నెలకొల్పినా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంగా వ్యక్తి పూజను ప్రోత్సహిస్తున్నది. వివిధ వివక్షాపూరిత చట్టాలకు బాధితులు అయిన మైనారిటీల పక్షాన నిలబడేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరిస్తోంది.
భారతీయ పార్టీల వ్యవస్థను నాలుగు రీతుల్లో పునర్నిర్మించేందుకు పదిహేనేళ్ళ క్రితం నేను ఆ ప్రణాళికను ప్రతిపాదించాను. దరిమిలా మూడు సార్వత్రక ఎన్నికలు జరిగాయి 2009 నాటి నా ప్రణాళిక పూర్తిగా నెరవేరలేదు. కాలం కొన్ని పాఠాలు నేర్పింది. గాంధీ–నెహ్రూల నాయకత్వాన్ని వదిలివేయాలని కాంగ్రెస్‌ను కోరాలని నేను ఇప్పుడు అనుకోవడం లేదు. అలాగే బీజేపీ తనను తాను ఆరెస్సెస్ నుంచి వేరుపరచుకోవాలని, భారతీయ వామపక్షాలు మావో, లెనిన్ పంథాలను విడనాడాలని, దేశీయ గ్రీన్ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ రూపొందాలని నేను కోరదలుచుకోలేదు. అవి అలా పరిణమించగలవనే ఆశాభావమూ నాకు లేదు. సరే, ఏడాదిలోగా తదుపరి సార్వత్రక ఎన్నికలు జరగనున్నాయి. దేశ రాజకీయాలలో నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపే ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఒక కొత్త కోరికల జాబితాను ప్రతిపాదిస్తున్నాను. ఇది, గత జాబితా కంటే తక్కువ అంచనాలతో రూపొందించినది. కొత్త లోక్‌సభలో ఏ ఒక్క పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోకూడదని నేను ఆశిస్తున్నాను. ఆ మాటకొస్తే ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించిన పార్టీ కూడా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అర్హమైన మెజారిటీ కంటే తక్కువ సీట్లు మాత్రమే సాధించుకోవాలని నేను భావిస్తున్నాను. మన ప్రధానమంత్రి స్వాభావికంగా నిరంకుశుడు. ఆయన వ్యక్తిత్వంలోని ఈ అనారోగ్యకర లక్షణం, గత రెండు సార్వత్రక ఎన్నికలలో బీజేపీ వరుసగా సాధించిన ఘన విజయాలతో, మరింతగా బలపడింది. మోదీకి ముందు ఇందిరాగాంధీ కూడా నిరంకుశంగా పరిపాలించారు. 1971 సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మహా విజయంతో ఆమె నిర్భయంగా నియంతృత్వ బాటలో ముందుకు సాగారు. మోదీ, ఇందిర మధ్య కాలంలో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 1984 సార్వత్రక ఎన్నికలలో చరిత్రాత్మక విజయాన్ని పొందింది. ఓటర్లు తమ వివేకంతో, లేదా అది కొరవడడం వల్లో, రాజీవ్ కాంగ్రెస్‌కు 400కి పైగా సీట్లు కట్టబెట్టారు. ఆ తీర్పు, రాజకీయాలలోనూ దేశ పాలనా వ్యవస్థలోనూ దురదృష్టకర పర్యవసానాలకు కారణమయింది.
భౌగోళికంగా భారత్ ఒక సువిశాల దేశం. సమస్త జీవన రంగాలలో అపార వైవిధ్యమున్న జాతి. మరి ఈ పురా నవ దేశాన్ని విస్తృత సహకారం, సంప్రదింపులతో కాకుండా ఇతరేతర పద్ధతులలో పాలించడం ప్రజల శ్రేయస్సుకు, జాతి అభ్యున్నతికి కచ్చితంగా దోహదం చేయదు. అయితే పార్లమెంటులో అత్యధిక సంఖ్యాబలం కలిగివుండడం పాలక పక్షంలో దురహంకారాన్ని ప్రోత్సహిస్తుంది. అత్యధిక ఎంపీలను నియంత్రించగలిగే ప్రధాన మంత్రి తన కేబినెట్ సహచరులపై మొరటుగా పెత్తనం చెలాయించగలుగుతాడు; ప్రతిపక్షాలను గౌరవించడు; మీడియాను నయానో భయానో లొంగదీసుకుంటాడు రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని బలహీనపరుస్తాడు; రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాలను ఉపేక్షిస్తాడు–మరీ ముఖ్యంగా ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలను అనాదరిస్తాడు.
మొత్తం మీద ఇందిర, రాజీవ్, మోదీల కంటే పీవీ, వాజపేయి, మన్మోహన్ సింగ్లే మెరుగైన ప్రధానమంత్రులుగా భావి చరిత్రకారులు భావించే అవకాశమున్నది. అయితే రెండో త్రయం కంటే మొదటి ముగ్గురు వివేకశీలురు, మరింత సమర్థులు అని తప్పనిసరిగా భావించనవసరం లేదు. పీవీ, వాజపేయి, మన్మోహన్లు అధికారానికి వచ్చిన పరిస్థితులే, బహుశా, వారు తమ కేబినెట్ సహచరులకు ఎక్కువ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇచ్చేందుకు; అలాగే వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలు, ప్రజా ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మాటను మన్నించేందుకు; ప్రతిపక్షాలతో తరచు సంప్రదింపులు జరిపేందుకు; మీడియా స్వేచ్ఛకు ఆటంకాలు కలిగించకుండా ఉండేందుకు; న్యాయవ్యవస్థను ఒత్తిళ్లకు గురిచేయకుండా ఉండేందుకు, ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు; రాష్ట్రాల హక్కులను గౌరవించేందుకు పురిగొలిపి ఉంటాయి. పీవీ, వాజపేయి, మన్మోహన్‌ల హయాంలో ఆర్థిక వ్యవస్థ గణనీయమైన పురోగతి సాధించింది, సమాఖ్య పాలనా విధానం వర్ధిల్లింది. మైనారిటీల హక్కులకు రక్షణ భించింది. స్వతంత్ర సంస్థలు విశేషంగా లబ్ధి పొందాయి. ఒక ఆధిపత్య పార్టీ లేకపోవడం, ప్రధానమంత్రులు గర్వాతిశయాలతో వ్యవహరించేవారు కాకపోవడం ఆ అభ్యున్నతికి కారణాలు అని మరి చెప్పనవసరం లేదు.
2024 సార్వత్రక ఎన్నికలలో నరేంద్ర మోదీ, బీజేపీ వరుసగా మూడోసారి మెజారిటీ సీట్లతో అధికారానికి రావడం సంభవిస్తే ప్రజాస్వామ్యం, బహుతా వాదం, సమాఖ్య పాలనా విధానానికి ఎనలేని హాని జరగవచ్చు. ప్రతిపక్షాలు అలక్ష్యానికి, పత్రికా స్వాతంత్ర్యం అణచివేతకు, మైనారిటీ వర్గాలు అభద్రతకు మరింతగా లోనవుతాయి. రాష్ట్రాలు మునుపెన్నడూ లేని రీతిలో కేంద్రం ముందు దైన్యంగా మోకరిల్లవలసివస్తుంది అటువంటి పరిణామాలు అంతిమంగా ఆర్థిక వ్యవస్థ పురోగతినీ దెబ్బ తీస్తాయి. ఈ భయాలతో, వచ్చే ఏడాది సార్వత్రక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండాలని అభిలషిస్తున్నానో చెప్పుతాను. 18వ లోక్‌సభలో ఏ ఒక్క పార్టీ 250కి మించి సీట్లు గెలుచుకోకూడదు. అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించే పార్టీ సైతం కైవసం చేసుకునే సీట్లు 200 కంటే తక్కువగా ఉంటే మరీ మంచిది. ఇదే జరిగితే మన అధికార వ్యవస్థలో ఒకే ఒక పార్టీ ఆధిపత్యముండదు. ఏకైక వ్యక్తి ప్రాబల్యం అంతకన్నా ఉండదు. భారత్, మరింత వివేకవంతంగా కానప్పటికీ, కచ్చితంగా తక్కువ దురహంకారపూరిత పాలనకు నోచుకుంటుంది.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)