పౌర సమాజ భీతిలో పాలక శ్రేణులు
ABN , First Publish Date - 2023-04-22T01:29:54+05:30 IST
కర్ణాటక శాసనసభా ఎన్నికలలో పోటీ చేస్తున్న వివిధ రాజకీయపక్షాలకు ఒక మానిఫెస్టోను ఆ రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా రూపొందించాయి.
కర్ణాటక శాసనసభా ఎన్నికలలో పోటీ చేస్తున్న వివిధ రాజకీయపక్షాలకు ఒక మానిఫెస్టోను ఆ రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా రూపొందించాయి. ఈ ‘పౌర సమాజ వేదిక’ (సివిల్ సొసైటీ ఫోరం)లో దళితుల, మహిళల, మురికివాడ వాసుల హక్కుల కోసం పని చేస్తున్న బృందాలు; విద్య, ఆరోగ్య భద్రత, పారిశుధ్యం రంగాలలో కృషి చేస్తున్న సంఘాలు, 73, 74వ రాజ్యాంగ సవరణలను పూర్తిగా అమలుపరచడం ద్వారా రాజకీయ వికేంద్రీకరణను విస్తృతపరచాలని కోరుతున్న బృందాలు భాగస్వాములుగా ఉన్నాయి. అవి ఉమ్మడిగా రూపొందించిన ఇరవై పేజీల మానిఫెస్టో (కన్నడ, ఆంగ్ల భాషల్లో అది ప్రజలకు అందుబాటులో ఉన్నది) ఆయా సంఘాల, బృందాల విభిన్న ప్రాధాన్యాలను ప్రతిబింబిస్తున్న సమస్యలతో పాటు రాష్ట్ర ప్రజలకు ఎదురవుతోన్న అనేకానేక సవాళ్లను పేర్కొన్నది. ఈ సమస్యలు, సవాళ్లను తమ సొంత మానిఫెస్టోలలో తప్పక ప్రస్తావించాలని అన్ని రాజకీయ పక్షాలకూ సివిల్ సొసైటీ ఫోరమ్ విజ్ఞప్తి చేసింది. శాసనసభకు ఎన్నికైన ప్రతి ఒక్కరూ ఆ సమస్యల పరిష్కారానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరింది.
మానిఫెస్టోను విడుదల చేసిన కొద్ది రోజుల అనంతరం సివిల్ సొసైటీ ఫోరం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆ సమావేశానికి ఆహ్వానించారు. నేను కూడా ఆ సమావేశానికి హాజరయ్యాను. తొలుత పాలన, ఆరోగ్య భద్రత, విద్య, వ్యవసాయం, సామాజిక న్యాయం మొదలైన రంగాలలో కృషి చేస్తున్నవారు సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి ప్రతిపాదనలు చేశారు. ఆ తరువాత రాజకీయ పార్టీల ప్రతినిధులు వాటికి ప్రతిస్పందించడంతోపాటు సభికులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చర్చలు ఓర్పుగా, అవగాహనతో నిర్మాణాత్మకంగా జరిగాయి. అయితే ఈ ప్రయోజనకర సమావేశంలో కర్ణాటకలోని మూడు ప్రధాన రాజకీయపక్షాలలో రెండు పార్టీల ప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదు. ఆ రెండు పార్టీలు జనతాదళ్ (సెక్యులర్), భారతీయ జనతా పార్టీ. మూడో ప్రధాన రాజకీయ పక్షమైన కాంగ్రెస్‌తో పాటు, కర్ణాటకలో తన ఉనికిని చాటుకునేందుకు ఆరాటపడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం కూడా తమ ప్రతినిధులను పంపాయి.
సమావేశ నిర్వాహకులు తమ ప్రతినిధిని పంపాలని జనతాదళ్ (ఎస్), బీజేపీలకు పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎందుకు అలా జరిగింది? జనతాదళ్ (ఎస్) విషయంలో దాని నాయకత్వ ఉదాసీనత అని నేను భావిస్తున్నాను. అసలు పౌర సమాజం గురించి ఆ పార్టీకి పట్టనే పట్టదు. మరి బీజేపీ విషయమేమిటి? తమతో ఎటువంటి నిమిత్తం లేకుండా స్వతంత్రంగా పని చేసే పౌర సమాజ సంఘాలను ఆ పార్టీ పూర్తిగా అయిష్ట పడుతుంది. పౌర సమాజం పట్ల బీజేపీ వ్యతిరేకత మూలాలు పాక్షికంగా రాష్ట్రీయ స్వయం సేవక్ భావజాలంలోనే ఉన్నాయి. ఆ భావజాలం నిర్దేశాలతో పౌరసమాజ సంస్థలు ఏకీభవించడం లేదు. భారత ప్రజల సామాజిక సాంస్కృతిక రంగాలపై ఆరెస్సెస్ తన పూర్తి నియంత్రణను సాధించేందుకు ఆరెస్సెస్ ఆరాటపడుతోంది. రైతులు, మహిళలు ఆదివాసీలు, విద్యార్థులు, ఇరుగు పొరుగు సంక్షేమ సంఘాలు... ఇలా ఎక్కడ పని చేసినా తనకు పోటీ ఉండకూడదదని ఆ సంస్థ ఆశిస్తుంది.
పౌర సమాజం పట్ల బీజేపీ అయిష్టతకు మరో కారణం కూడా ఉన్నది. అది ప్రస్తుత ప్రధానమంత్రి వ్యక్తిత్వం. స్వతహాగా నిరంకుశ వాది అయిన మోదీ అధికారంలో ఉన్నప్పుడు పాలనా వ్యవహారాలను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలోని పౌర సమాజ బృందాల పట్ల చాలా కఠినంగా వ్యవహరించారు. అసలు ఆరెస్సెస్ గుజరాత్ విభాగాన్ని తన అధికారానికి ఒక ఆటంకంగా మోదీ పరిగణించారని కూడా అంటారు. ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాతనే ఆరెస్సెస్‌తో ఆయన సంబంధాలు మెరుగుపడ్డాయి.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఆయన ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల పట్ల చాలా నిర్దయగా, సంపూర్ణ వైర భావంతో వ్యవహరించింది. ఏ రాజకీయ పార్టీ, మత సంస్థతోనూ ఎటువంటి సంబంధం లేకుండా విద్య, ఆరోగ్య భద్రత, విధాన పరిశోధన, సాంఘిక సంక్షేమ రంగాలలో పనిచేస్తున్న బృందాలను ఆదాయ పన్ను శాఖ దాడులు, ‘విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం’ (ఎఫ్సిఆర్ఎ) కింద విరాళాల స్వీకరణకు అనుమతి నిరాకరణ మొదలైన చర్యల ద్వారా నానా వేధింపులకు గురి చేసింది. ఆక్స్‌ఫామ్, సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్ మొదలైన సంస్థలు ఈ విధంగా తీవ్ర కష్టనష్టాలకు లోనయ్యాయి. అదే సమయంలో మోదీ సర్కార్‌కు అనుకూలంగా ఉన్న హిందూత్వ బృందాలు విదేశాల నుంచి నిధులు పొందేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పోయాయి!
నిష్పాక్షికంగా చెప్పాలంటే 2004–14 సంవత్సరాల మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఎఫ్సిఆర్ఎ చట్టాన్ని దుర్వినియోగపరిచింది. ఎన్జీఓలను, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల రంగంలో పనిచేస్తున్న సంస్థలను వేధింపులకు గురి చేసింది. అదే సమయంలో గ్రామీణ ఉపాధి హామీ మొదలైన సంక్షేమ విధానాలకు సంబంధించి పౌర సమాజ బృందాల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నది. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మెజారిటీ వాద హిందూత్వ ఎజెండాకు అనుకూలంగా వ్యవహరించని, ప్రధానమంత్రి వ్యక్తిపూజకు సహకరించని పౌర సమాజ బృందాలు, సంఘాలు వేటినీ ఏ మాత్రం విశ్వసించడం లేదు. పౌర సమాజం పట్ల మోదీ ప్రభుత్వ భీతికి కారణమేమిటి? తన పాలన తీరుతెన్నుల స్వతంత్ర, నిశిత పరిశీలనల పట్ల ఉన్న భయ సంకోచాలలో భాగమే ఆ భీతి అని చెప్పక తప్పదు. తత్కారణంగానే ప్రధానమంత్రి తాను అధికారంలోకి వచ్చింది మొదలు ఇంతవరకు ఒక్కసారి కూడా విలేఖర్ల సమావేశంలో పాల్గొనలేదు. ఇప్పటికీ సాపేక్షంగా స్వేచ్ఛాయుతంగా ఉన్న పత్రికారంగ సంస్థలపై ఆయన ప్రభుత్వం పలు విధాల దాడులు చేస్తోంది. గర్హనీయమైన ఉపా చట్టం కింద విద్యార్థి ఉద్యమాల క్రియాశీలురను, పాత్రికేయులను జైళ్లలో నిర్బంధిస్తోంది.
బీజేపీ యేతర పార్టీల నేతృత్వంలో ఉన్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయన్న సత్యాన్ని కూడా ఒప్పుకుని తీరాలి. తమ పాలన తీరుతెన్నులపై స్వతంత్ర అంచనాలను సహించడం లేదు. అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న పౌర సమాజ సంఘాలను, ముఖ్యంగా తమ పార్టీ ఛత్రం కింద లేని వాటిని ఏ మాత్రం ప్రోత్సహించడం లేదు. బెంగాలలో సిపిఎం, టిఎమ్సి ప్రభుత్వాలు, తమిళనాడులో అన్నా డిఎంకె, డిఎంకె ప్రభుత్వాలు, ఆంధ్రలో వైఆర్ఎస్, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వాలలో ఏ ఒక్కటీ అందుకు మినహాయింపు కాదు.
స్వచ్ఛంద సంఘాలు సమాజానికి ప్రశస్త సేవలు అందిస్తున్న కారణంగానే అమెరికన్ ప్రజాస్వామ్యం బహుముఖంగా పురోగమిస్తున్నదని 1830లలో ఫ్రెంచ్ మేధావి అలెక్సి డి టాక్వెల్లి (1805–59) వాదించారు. ఆ కాలంలో స్వచ్ఛంద సేవా సంఘాల విషయంలో ఐరోపా బాగా వెనుకబడి ఉంది. అయితే 19వ శతాబ్ది ముగిసే నాటికి అక్కడ కూడా అవి పెద్ద సంఖ్యలో ఆవిర్భవించి యూరోపియన్ సమాజాల అభివృద్ధికి విశేషంగా తోడ్పడ్డాయి. విమర్శనాత్మక, నిర్మాణాత్మక అనే రెండు రకాల సంఘాలు వాటిలో ఉన్నాయి. వీటిలో మొదటివి పౌరుల జీవనావసరాలు తీర్చడంలోనూ, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు రక్షణ కల్పించడంలోనూ రాజ్య వ్యవస్థల వైఫల్యాలపై తమ దృష్టిని కేంద్రీకరించగా రెండోవి ఆ వైఫల్యాలను సరిదిద్దేందుకు తామే స్వయంగా పాఠశాలలు, ఆసుపత్రులు మొదలైనవి ఏర్పాటు చేసి సేవలు అందించేవి.
ఒక దేశ పౌర సమాజ వికాసం ఆ దేశ రాజకీయ వ్యవస్థ ఆరోగ్యానికి సూచిక అన్న టాక్వెల్లి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. బహుశా, భారత్‌లో అత్యవసర పరిస్థితి ముగిసిన అనంతర దశాబ్దాలలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని చెప్పవచ్చు. అప్పట్లో విమర్శనాత్మక, నిర్మాణాత్మక స్వచ్ఛంద సేవా సంఘాలు రెండూ మన రాజకీయ వ్యవస్థ, సమాజాన్ని ప్రయోజనకరంగా ప్రభావితం చేసి సామాన్యుల శ్రేయస్సునకు తోడ్పడ్డాయి.
స్వతంత్రంగా పనిచేస్తున్న పౌర సమాజ బృందాలు, సంస్థలకు వ్యతిరేకంగా భారత రాజ్యవ్యవస్థ 2014 నుంచీ తన అధికారాలను మరింత ఎక్కువగా ప్రయోగిస్తున్నది. గతంలో అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా పౌర సమాజ సంస్థలు సంపూర్ణ స్వాతంత్ర్యంతో వ్యవహరించడాన్ని ఇష్టపడని మాట నిజమే అయినప్పటికీ నరేంద్ర మోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వాటిని ఉపేక్షించడం, శంకించడం మాత్రమే కాకుండా క్రియాశీలంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో సివిల్ సొసైటీ ఫోరం నిర్వహించిన సమావేశానికి బీజేపీ తన ప్రతినిధిని పంపకపోవడమనేది ఉద్దేశపూర్వక నిర్ణయమనడంలో సందేహం లేదు. తన భావజాల వ్యాప్తికి, తన పాలన నిరంతరాయంగా కొనసాగేందుకు స్వతంత్ర పత్రికారంగం, క్రియాశీల పౌరసమాజం తీవ్ర అవరోధాలుగా ఉన్నాయని బీజేపీ గట్టిగా భావిస్తోంది.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)