Share News

Nawaz Sharif: భారత్‌పై పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారంటే?

ABN , Publish Date - Dec 21 , 2023 | 04:42 PM

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. చుట్టుపక్కలున్న దేశాలు చంద్రుడ్ని చేరుకున్నాయని, కానీ పాకిస్తాన్ ఇంకా నేలపై నిలబడలేకపోయిందని అన్నారు. బుధవారం ఇస్లామాబాద్‌లో...

Nawaz Sharif: భారత్‌పై పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారంటే?

Nawaz Sharif On India: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. చుట్టుపక్కలున్న దేశాలు చంద్రుడ్ని చేరుకున్నాయని, కానీ పాకిస్తాన్ ఇంకా నేలపై నిలబడలేకపోయిందని అన్నారు. బుధవారం ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ క్యాడర్‌ను ఉద్దేశించి.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మన పొరుగున్న ఉన్నవారు చంద్రుడిపైకి చేరుకున్నారు. కానీ మనం ఇంకా సరిగ్గా నేలపై నిలబడలేని పరిస్థితిలో ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగకూడదు’’ అని నవాజ్ షరీఫ్ అన్నారు. ‘‘మన పతనానికి మనమే బాధ్యులం, లేకపోతే ఈ దేశం మరో స్థాయిలో ఉండేది’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు కూడా.. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడంలో భారత్ పాత్ర లేదన్నారు.

నాలుగోసారి ప్రధాని పదవి కోసం పోటీ చేస్తున్న నవాజ్ షరీఫ్ ఇంకా మాట్లాడుతూ.. 2013లో పాకిస్తాన్ కరెంట్ కోతలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుందని, తాము అధికారంలోకి వచ్చాక ఆ సమస్యని పరిష్కరించామని చెప్పారు. దేశం నలుమూలల ఉన్న ఉగ్రవాదాన్ని అంతం చేసి, శాంతిని పునరుద్ధరించామని గుర్తు చేసుకున్నారు. కరాచీలో హైవేలు నిర్మించామని, తమ ప్రభుత్వంలో పాకిస్తాన్ ప్రగతి పథంలో నడిచిందని అన్నారు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) వచ్చిందని.. దాంతో కొత్త శకం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఎంతో చేసినప్పటికీ.. తనని టార్గెట్ చేసుకొని మరీ మూడు సార్లు (1993, 1997, 2017) అధికారం నుంచి తొలగించారని ఆయన పేర్కొన్నారు.


ప్రస్తుతం పాకిస్థాన్‌లో నెలకొన్న సంక్షోభాలకు ఇప్పుడు ఎవరిని నిందించాలని నవాజ్ షరీఫ్ ప్రశ్నించారు. తన ప్రభుత్వ హయాంలో 2014లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండేదరని.. ఇస్లామాబాద్‌లోని అబ్బారాలో కేవలం రెండు రూపాయలకే (పాకిస్తాన్ రూపాయలు) అందుబాటులో ఉండేదని, ఇప్పుడదని 30 రూపాయలకు చేరుకుందని ఎత్తిచూపారు. తనతో పాటు మరియమ్, ఇతర పీఎంఎల్ఎన్ నేతలపై తప్పుడు కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇస్లామాబాద్ హైకోర్టు కేవలం మూడు విచారణల్లోనే రెండు కేసుల్లో శిక్షను కొట్టివేసిందని చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలని ఆశిస్తే.. మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పాకిస్తాన్‌కు పిలుపునిచ్చారు.

అభివృద్ధి చెందిన ప్రతి దేశం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందని, ఆయా దేశాలు మహిళలను అభివృద్ధి కోసం ముందుకు తీసుకొచ్చారని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అభివృద్ధిలో మహిళలు కూడా సమాన భాగస్వాములుగా ఉండాలని తాను భావిస్తున్నానని.. పురుషులతో పాటు మహిళలు కూడా ఈ దేశ సేవలో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. తనకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆసక్తి తనకు లేదని.. అయితే తన బహిష్కరణకు కారణమైన బాధ్యులు బాధ్యత వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రజలకు శత్రువులుగా ఉన్న వారిని క్షమించే హక్కు తనకు లేదని, కుట్రదారుల పేర్లను ముందుకు తీసుకురావాలని నవాజ్ షరీఫ్ చెప్పారు.

Updated Date - Dec 21 , 2023 | 04:42 PM