Share News

Pakistan: పాకిస్తాన్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం.. కారణమిదే!

ABN , Publish Date - Dec 29 , 2023 | 02:16 PM

అనేక దేశాల్లో డిసెంబర్ 31తోపాటు న్యూఇయర్ వేడుకలు కూడా గ్రాండ్ గా జరుపుకోవాలని అనేక మంది ప్లాన్ చేస్తున్నారు. కానీ భారత్ పక్కదేశమైన పాకిస్థాన్ మాత్రం ఈ వేడుకల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

Pakistan: పాకిస్తాన్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం.. కారణమిదే!

అనేక దేశాల్లో ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31తోపాటు జనవరి 1 వేడుకల కోసం అనేక మంది వేచి చూస్తున్నారు. అంతేకాదు ఈ క్రమంలో కొంత మంది గోవాతోపాటు ఇతర దేశాలకు కూడా వెళ్లి ఎంజాయ్ చేయాలని టూర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్లో కూడా అనేక నగరాల్లో ఈ వేడుకలకు పెద్ద ఎత్తున జరుపుకునేందుకు యువత సిద్ధమవుతున్నారు. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా, లండన్, కెనడా వంటి దేశాల్లో కూడా ఈ వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంటారు. కానీ ఇండియా పక్కదేశమైన పాకిస్థాన్ మాత్రం న్యూఇయర్ వేడుకల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.


పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వరుల్ హక్ కాకర్ పాకిస్థాన్‌లో నూతన సంవత్సర వేడుకలను నిషేధించారు. ఆ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కాకర్ పాలస్తీనియన్లకు సంఘీభావం ప్రకటించారు. పాలస్తీనాలో తీవ్ర ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యా అక్కడి సోదర, సోదరిమణులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు పాలస్తీనాలో 21 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అంతేకాదు పాలస్తీనాకు పాకిస్థాన్ రెండు సహాయ ప్యాకేజీలను పంపిందన్నారు. మూడో ప్యాకేజీ సిద్ధమవుతోందని కాకర్ చెప్పారు. గ్లోబల్ ఫోరమ్‌లలో పాలస్తీనా ప్రజల దుస్థితి గురించి అవగాహన కల్పించడానికి పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను కాకర్ ప్రస్తావించారు. గాజాలో నిరంతర దాడులకు సంబంధించి పాకిస్థాన్ వెంటనే స్పందించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు దూరంగా ఉండాలని, సంయమనం పాటించాలని కోరారు.

మరోవైపు గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం అంతంత మాత్రంగానే ఉంది. నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరగడం సహా విద్యుత్ వినియోగాన్ని ప్రజలు తగ్గించాలని అక్కడి నేతలు చెప్పడం గతంలో చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో పాకిస్థాన్లో నూతన సంవత్సర వేడుకలను కొంత మంది జరుపుకోవాలని ప్రయత్నం చేయగా..ఇంకొంత మంది వారిని అడ్డుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ క్రమంలో ఎక్కువ మంది ఈ దేశంలో నూతన సంవత్సర వేడుకలను ఆర్భాటంగా జరుపుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Updated Date - Dec 29 , 2023 | 02:24 PM