Turkey Earthquake ఆయన ముందుగానే చెప్పారు.. కానీ ఆయన్ను..
ABN , First Publish Date - 2023-02-07T11:01:17+05:30 IST
వేల మందిని పొట్టనబెట్టుకున్న టర్కీ, సిరియా భూకంపం గురించి ముందుగానే ఎవరికైనా తెలుసా? అంటే తెలుసనే చెప్పాలి. అయితే దీనిని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు.
Turkey Earthquake : వేల మందిని పొట్టనబెట్టుకున్న టర్కీ (Turkey), సిరియా (Syria) భూకంపం (Earthquake) గురించి ముందుగానే ఎవరికైనా తెలుసా? అంటే తెలుసనే చెప్పాలి. అయితే దీనిని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. పైగా దీని గురించి ముందుగానే వెల్లడించిన సైంటిస్ట్ (Scientist)పై ఫేక్ సైంటిస్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. ఫలితంగా కొన్ని వేల మంది సజీవ సమాధి అయ్యారు.
నెదర్లాండ్స్ (Netherlands)కు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ టర్కీ భూకంపాన్ని ముందుగానే ఊహించారు. అంతే కాదు.. ఆయన ఫిబ్రవరి 3న ట్విటర్ (Twitter) వేదికగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. భూకంపం ఎంత తీవ్రతతో సంభవిస్తుందనే విషయం కూడా ఆయన ముందుగానే తన ట్వీట్లో వెల్లడించారు. 7.5 తీవ్రతతో భూకంపం ఈ ప్రాంతాన్ని తాకబోతుందని అంచనా వేశారు. అది సోమవారం అక్షరాలా నిజమైంది. వేలమందిని పొట్టనబెట్టుకుంది. అంతే కాదు.. ఫ్రాంక్ హూగర్బీట్స్.. మొదటి భూకంపం తర్వాత మరొక పెద్ద భూకంపం వస్తుందని కూడా అంచనా వేశారు. అది కూడా నిజమైంది.
తన అంచనా అక్షరాలా నిజమయ్యాక హూగర్బీట్స్ చాలా బాధ పడ్డారు. తన ఆవేదనను ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు. ‘‘సెంట్రల్ టర్కీలో సంభవించిన భారీ భూకంపం వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరినీ చూస్తుంటే నా హృదయం ద్రవిస్తోంది. తాను ముందుగానే చెప్పినట్టు కొన్నేళ్ల క్రితం కూడా ఇలాగే జరిగింది’’ అని హూగర్బీట్స్ ట్వీట్ చేశారు. ఆయన తను ఈ నెల 3న పెట్టిన పోస్టును రీ పోస్ట్ చేశారు. త్వరలోఈ ప్రాంతం(దక్షిణ-మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్) లో 7.5 తీవ్రతతో భూకంపం వస్తుంది’’ అని ఫ్రాంక్ హూగర్బీట్స్ ఫిబ్రవరి 3న ట్వీట్ చేశారు.