Share News

South Korea Matchmaking: ప్రేమించుకోండి, పిల్లల్ని కనండి.. సౌత్ కొరియా ప్రభుత్వం కొత్త ప్రయోగం

ABN , First Publish Date - 2023-11-27T16:33:32+05:30 IST

ఓవైపు భారతదేశంలో జనాభా గణనీయంగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం జననాల రేటు విపరీతంగా పడిపోతుంది. అలాంటి దేశాల్లో చైనా, సౌత్ కొరియాలు ఉన్నాయి. ఆర్థిక భారం పెరగడం, పెళ్లిళ్లపై యువతకు ఆసక్తి తగ్గిపోవడమే అందుకు ప్రధాన కారణాలు.

South Korea Matchmaking: ప్రేమించుకోండి, పిల్లల్ని కనండి.. సౌత్ కొరియా ప్రభుత్వం కొత్త ప్రయోగం

Seongnam Blind Date Event: ఓవైపు భారతదేశంలో జనాభా గణనీయంగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం జననాల రేటు విపరీతంగా పడిపోతుంది. అలాంటి దేశాల్లో చైనా, సౌత్ కొరియాలు ఉన్నాయి. ఆర్థిక భారం పెరగడం, పెళ్లిళ్లపై యువతకు ఆసక్తి తగ్గిపోవడమే అందుకు ప్రధాన కారణాలు. ఈ నేపథ్యంలోనే.. అక్కడి ప్రభుత్వాలు జననాల రేటు పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పెళ్లిళ్లపై యువతకు ఆసక్తి కలిగి, పిల్లల్ని పుట్టించేలా చేసేందుకు.. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు మరెన్నో కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా సౌత్ కొరియాలోని సియాంగ్నమ్ సిటీ ‘బ్లైండ్ డేట్’ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. 20 నుంచి 30 ఏళ్ల మధ్య రిలేషన్‌షిప్ లేని సింగిల్స్ మధ్య ప్రేమ చిగురించడమే. ఎవరైతే ఒంటరిగా ఉంటూ ప్రేమ కోసం పరితపిస్తున్నారో.. వాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అప్లై చేసుకోవాలి. ఇలా దరఖాస్తులు చేసుకున్న వారిని ఒక హోటల్‌లో ప్రవేశపెడతారు. ప్రతి ఒక్కరికీ నేమ్ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. పురుషులు, మహిళల్ని పక్కపక్కనే నిల్చోబెడతారు. ఇంతలో రిలేషన్‌షిప్ కోచ్ అక్కడికి వచ్చి.. అందరినీ పలకరిస్తాడు. అనంతరం ‘రాక్-పేపర్-సిజర్’ ఆటని ప్రారంభిస్తాడు. ఈ ఆటలో భాగంగానే.. పరిచయాలు పెరగడం, జంటల మధ్య ప్రేమ చిగురించడం జరుగుతుంది. ఈ ఒక్క ఆట మాత్రమే కాదు.. మరెన్నో క్రీడలు నిర్వహిస్తారు. వారికి రెడ్ వైన్స్‌తో పాటు చాక్లెట్స్, ఉచిత మేకప్ సర్వీసులు కూడా అందజేస్తారు. వీలైతే.. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం తనిఖీ చేసి, ఫలానా వ్యక్తులు మంచివారా? కాదా? అనేది కూడా స్థానిక ప్రభుత్వమే నిర్ధారిస్తుంది.


ఈ సంవత్సరంలో మొత్తం ఐదు ఈవెంట్లు నిర్వహించగా.. 460 మంది పాల్గొన్నారు. అందులో 198 మంది ‘జంటలు’గా ఈవెంట్ నుండి నిష్క్రమించారు. సిటీ గవర్నమెంట్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల లీ యు-మి ఈ ఈవెంట్ గురించి మాట్లాడుతూ.. తాను ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి మూడు సార్లు దరఖాస్తు చేశానని, చివరికి తనకు మూడోసారి స్పాట్ కన్ఫమ్ అయ్యిందని తెలిపారు. సెప్టెంబర్‌లో ఈ ఈవెంట్‌లో పాల్గొన్న హ్వాంగ్ డా-బిన్ మాట్లాడుతూ.. ఇతర సామాజిక ఈవెంట్‌లలో చేరడానికి లేదా ప్రొఫెషనల్ డేటింగ్ ఏజెన్సీలకు సైన్ అప్ చేయడానికి అయ్యే ఖర్చును ఇది ఆదా చేసిందని చెప్పారు. తాము నిజమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం చేయగలిగినదంతా చేయాలని, ఇది కూడా ఒక మంచి కార్యక్రమమే అని కొనియాడారు. అయితే.. ఇదొక అర్థంలేని కార్యక్రమమని, దీని ద్వారా జననాల రేటు పెరుగుతుందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని కొందరు విమర్శిస్తున్నారు.

ఇదిలావుండగా.. దక్షిణ కొరియా సంతానోత్పత్తి రేటు గత సంవత్సరం రికార్డు స్థాయిలో 0.78కి పడిపోయింది. అంటే.. ఒక మహిళకు కనీసం ఒక పిల్ల కూడా లేదని అర్థం. దీంతో.. ప్రతి స్త్రీకి ప్రపంచంలోనే అతి తక్కువ సంఖ్యలో పిల్లలను కలిగి ఉన్న దేశంగా దక్షిణ కొరియా భయంకరమైన రికార్డ్‌ని నమోదు చేసింది. అందుకే.. జననాల రేటుని పెంచేందుకు ఈ రకమైన ‘మ్యాచ్-మేకింగ్’ కార్యక్రమాలకు దక్షిణ కొరియా శ్రీకారం చుట్టింది. ఇక అమెరికాలో జననాల రేటు 1.66 (2021), జపాన్‌లో 1.3గా ఉంది.

Updated Date - 2023-11-27T16:33:34+05:30 IST