Share News

Uttarkashi Tunnel: కీలకంగా మారిన ఆ లెటర్.. ఉత్తర్‌కాశీ టన్నెల్‌ కార్మికుల్ని ఎలా కాపాడిందంటే?

ABN , First Publish Date - 2023-12-02T09:37:27+05:30 IST

ఉత్తర్‌కాశీ టన్నెల్ ఎపిసోడ్ సుఖాంతంగా ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్.. ఎట్టకేలకు 17 రోజుల తర్వాత సక్సెస్ అయ్యింది.

Uttarkashi Tunnel: కీలకంగా మారిన ఆ లెటర్.. ఉత్తర్‌కాశీ టన్నెల్‌ కార్మికుల్ని ఎలా కాపాడిందంటే?

Uttarkashi Tunnel Rescue Operation: ఉత్తర్‌కాశీ టన్నెల్ ఎపిసోడ్ సుఖాంతంగా ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్.. ఎట్టకేలకు 17 రోజుల తర్వాత సక్సెస్ అయ్యింది. ‘ర్యాట్ హోల్ మైనింగ్’ టెక్నిక్‌తో ఆ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇలా బయటకొచ్చిన కార్మికులు లోపల ఎదుర్కున్న తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఒక ఉత్తరం తమ ప్రాణాలు కాపాడటంలో ఎలా కీలక పాత్ర పోషించిందో వివరించాడు.


‘‘సొరంగంలో చిక్కుకున్న తమకు కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రాణాలతో బయటపడతామో లేదోనని ఎంతో ఆందోళన చెందాం. ఇంతలోనే సొరంగంలో రెండు పైపులు పడి ఉండటాన్ని గమనించాం. మొదట ఆ రెండు పైపుల్ని ఒకదానితో మరొకటి బిగించాం. అందులో ఒక ఉత్తరం రాసి పెట్టాం. ఆ తర్వాత పైపులను మోటర్‌కు అమర్చి స్టార్ట్ చేశాం. తద్వారా నీళ్లతో పాటు ఆ ఉత్తరం కూడా బయటకు వెళ్లింది. ఆ లెటర్ చూసిన తర్వాతే మేమంతా సొరంగం లోపల మేమంతా బతికి ఉన్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఫలితంగా.. అధికారులు మాకు ఆహార పదార్థాలు, ఆక్సిజన్‌ పంపించారు. అలా మేము సొరంగం లోపల ప్రాణాలతో ఉండగలిగాం’’ అని ఆ కార్మికుడు వివరించాడు. అలాగే.. సొరంగంలో కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? గుండె ధైర్యంతో ఎలా కలిసికట్టుగా ఉన్నారన్న మొదలైన విషయాలను సైతం ఆ వ్యక్తి వివరించాడు. సొరంగం లోపల ఉన్నప్పుడు అతడు ఈ వీడియో తీయగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదే సమయంలో.. విశాల్ కుమార్‌ అనే మరో కార్మికుడు సైతం తన అనుభవాన్ని వివరించాడు. మొదటి 24 గంటలు ఎంతో కష్టంగా, భయానకంగా గడిచాయని పేర్కొన్నాడు. అసలు సొరంగం లోపల తాము చిక్కుకుపోయామన్న విషయం ఎవరికైనా తెలుసా, లేదా? తమకు సహాయం చేయడానికి ఎవరైనా వస్తారా? లేదా? అనేది తమకు తెలియదన్నాడు. తమని బయటకు తీసుకురావడానికి 17 రోజుల సమయం పడుతుందని తాము అనుకోలేదని, నాలుగైదు రోజుల్లోనే బయటకొస్తామని అనుకున్నామని చెప్పాడు. చివరికి ఎలాగోలా ఆ నరకం నుంచి తాము బయటపడ్డామని.. ఇందుకు ప్రధాని మోదీకి, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామికి, రెస్క్యూ ఆపరేషన్ బృందాలకు ధన్యవాదాలని తెలిపాడు. కాగా.. 41 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇళ్లకు పంపించడం జరిగింది.

Updated Date - 2023-12-02T09:37:28+05:30 IST