Ajit Pawar: శరద్ పవార్ చేసిందంతా ఒక పెద్ద డ్రామా.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-12-01T17:58:49+05:30 IST
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారం తన మామ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేయడం ఓ డ్రామా అని కుండబద్దలు కొట్టారు.
Ajit Pawar Slams Sharad Pawar: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారం తన మామ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేయడం ఓ డ్రామా అని కుండబద్దలు కొట్టారు. పని కోసం ప్రభుత్వం వద్దకు వెళ్లాలని తామంతా శరద్ పవార్‌తో చెప్పామని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆయన రాజీనామా చేస్తానని చెప్పారని.. ఈ రాజీనామా విషయం తమకు ముందే తెలుసని బాంబ్ పేల్చారు. మీరు ప్రభుత్వంలో చేరండి, నేను రాజీనామా చేస్తున్నానని శరద్ పవార్ అన్నారని.. ఆ సమయంలో సుప్రియా సూలే కూడా ప్రభుత్వంలో చేరడానికి మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు.
శరద్ పవార్ రాజీనామాను ఒక స్క్రిప్టుగా అభివర్ణించిన అజిత్ పవార్ ఇంకా మాట్లాడుతూ.. పుస్తక ప్రచురణ సందర్భంగా శరద్ పవార్ రాజీనామా చేశారన్నారు. అయితే.. ఆ వెంటనే తనకు మద్దతు ప్రదర్శించిన రాజీనామాని వెనక్కు తీసుకోవాలని ప్రజలు ఒత్తిడి చేయాలని ఆయన కోరారన్నారు. ఆ విధంగా ఆయన తన రాజీనామాని ఉపసంహరించుకున్నారని అన్నారు. రాజీనామా చేయకూడదని అనుకుంటే.. ఇంత డ్రామా చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వంలో చేరిన తర్వాత శరద్ పవార్ మంత్రులందరినీ కలవాలని పిలిచారని, ఆ మరుసటి రోజు ఎమ్మెల్యేలను కూడా పిలిపించారని చెప్పారు. మీటింగ్‌లో అంతా విన్న తర్వాత ఓకే చెబుతామని శరద్ పవార్ అన్నారని.. ఆ తర్వాతే ‘రైలు’ పట్టాలెక్కిందనే వాదనలు వినిపించాయని స్పష్టం చేశారు.
తనపై కేసులు ఉండటం వల్లే బీజేపీతో కలిశారని, దాంతో పాటు అనేక ఆరోపణలు కూడా తనపై వచ్చాయని అజిత్ పవార్ అన్నారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్న ఆయన.. తాను గత 32 సంవత్సరాలుగా పని చేస్తున్నానని, తాను ఏదైతే చెప్తానో అది చేసి చూపిస్తానని పేర్కొన్నారు. తాను సంస్థకి అధ్యక్షుడిని కాకపోయినప్పటికీ.. ఆ సంస్థకు సంబంధించిన పనులు ఎవరు చేస్తారో అందరికీ తెలుసన్నారు. తాను చెప్పిందాట్లో అబద్ధం లేదని క్లారిటీ ఇచ్చారు.