Allahabad University: అలహాబాద్ యూనివర్సిటీలో బాంబు పేలుడు.. విద్యార్థికి గాయాలు
ABN , Publish Date - Dec 14 , 2023 | 08:33 PM
అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం పీసీ బెనర్జీ హాస్టల్‌లోని రూమ్ నంబర్ 68లో ఒక బాంబు పేలింది. ప్రభాత్ యాదవ్ అనే విద్యార్థి తన హాస్టల్ రూమ్‌లో బాంబు తయారు చేస్తున్నప్పుడు...
Allahabad University Bomb Blast: అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం పీసీ బెనర్జీ హాస్టల్‌లోని రూమ్ నంబర్ 68లో ఒక బాంబు పేలింది. ప్రభాత్ యాదవ్ అనే విద్యార్థి తన హాస్టల్ రూమ్‌లో బాంబు తయారు చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విద్యార్థి చేతికి తీవ్ర గాయాలవ్వగా, ఛాతీపై కూడా ఈ పేలుడు ప్రభావం చూపినట్టు తెలిసింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హాస్టల్‌కు చేరుకున్నారు. గాయపడిన విద్యార్థిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. ప్రభాత్ ఆ హాస్టల్‌లో అక్రమంగా ఉంటున్నట్లు తెలిసింది. అతడు ఆ బాంబుని ఎందుకు తయారు చేస్తున్నాడో కూడా వెలుగులోకి రాలేదు.
ఈ వ్యవహారంపై పోలీసులు స్పందిస్తూ.. అలహాబాద్ యూనివర్శిటీలో ఎంఏ చదువుతున్న ప్రభాత్ యాదవ్ అనే విద్యార్థి పీసీ బెనర్జీ హాస్టల్‌లో నివసిస్తున్నాడని, అతడు బాంబు తయారు చేస్తున్న క్రమంలో బుధవారం సాయంత్రం అది అకస్మాత్తుగా పేలిందని అన్నారు. ఈ పేలుడులో ప్రభాత్ తీవ్రంగా గాయపడ్డాడని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రభాత్‌ని తాము ఆసుపత్రిలో చేర్పించామని, ఈ ఘటనలో మరో విద్యార్థికి కూడా స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా.. ప్రభాత్ యాదవ్‌పై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. అలహాబాద్ యూనివర్సిటీలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. హాస్టల్‌లో చాలామంది విద్యార్థి సంఘాలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.