Odisha Train Tragedy: ఒడిశా రైలు ఘటనపై కీలక పరిణామం.. వారిపై సీబీఐ ఛార్జ్‌షీటు దాఖలు

ABN , First Publish Date - 2023-09-02T20:00:54+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటన వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. శనివారం ముగ్గురు రైల్వే ఉద్యోగులపై...

Odisha Train Tragedy: ఒడిశా రైలు ఘటనపై కీలక పరిణామం.. వారిపై సీబీఐ ఛార్జ్‌షీటు దాఖలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటన వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. శనివారం ముగ్గురు రైల్వే ఉద్యోగులపై భువనేశ్వర్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీటులో సీబీఐ ఆ ముగ్గురిపై.. రైల్టే చట్టం 153, సెక్షన్ 34 రీడ్ విత్ 21 (సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించడం), సెక్షన్ 304 పార్ట్ II (హత్యకు సమానమైన నేరాభియోగాలు)లను మోపింది.


కాగా.. జూన్‌ 2వ తేదీన బాలేశ్వర్‌ జిల్లాలోని బాహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత లూప్‌లైన్‌లో ఆగి ఉన్న గూడ్సు రైలును షాలీమార్‌-చెన్నై కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ దెబ్బకు కోరమాండల్‌లోని కొన్ని బోగీలు ఎగిరి, పక్కనున్న ట్రాకుపై పడ్డాయి. అదే సమయంలో.. ఆ మార్గంలో బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 296 మంది ప్రాణాలు కోల్పోగా.. 1200 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు వెల్లువెత్తడంతో.. రంగంలోకి సీబీఐ దిగింది. అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడం వల్లే ఈ ఘటనకు దారితీసిందని సీబీఐ తన దర్యాప్తులో తేల్చింది.

ఈ నేపథ్యంలోనే జులై 7వ తేదీన సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగ్నల్స్‌) అరుణ్‌కుమార్‌ మహంత, సెక్షన్‌ ఇంజినీర్‌ అమీర్‌ ఖాన్‌, టెక్నిషియన్‌ పప్పు కుమార్‌లను అరెస్టు చేసింది. ఈ ముగ్గురిలో మహంత బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. అతనికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ ఇటీవల వాదనలు వినిపించింది. ప్రమాదం జరిగిన 94వ లెవెల్ క్రాసింగ్ వద్ద చేసిన మరమ్మత్తులు పనులు మహంత సమక్షంలోనే జరిగాయని, ఈ పనులకు 79వ లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌కు సంబంధించిన సర్క్యూట్ రేఖాచిత్రాన్నే ఉపయోగించారని తెలిపింది. ఆమోదిత ప్రణాళిక, సూచనలకు అనుగుణంగా మరమ్మతులు చేపట్టాల్సిన బాధ్యత మహంతది అని.. కానీ.. ఆయన దీన్ని విస్మరించారని సీబీఐ పేర్కొంది. దీంతో.. కోర్టు అతని బెయిల్‌ నిరాకరించింది.

Updated Date - 2023-09-02T20:00:54+05:30 IST