Cheetah Deaths: భారత్‌లో చీతాల మరణంపై దక్షిణాఫ్రికా కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-28T16:02:13+05:30 IST

దేశంలో అంతరించిపోయిన చీతా(Cheetah)లను తిరిగి ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో

Cheetah Deaths: భారత్‌లో చీతాల మరణంపై దక్షిణాఫ్రికా కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశంలో అంతరించిపోయిన చీతా(Cheetah)లను తిరిగి ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం నమీబియా(Namibia), దక్షిణాఫ్రికా(South Africa) నుంచి చీతాలను తీసుకొచ్చింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌(Kuno National Park)లో ప్రధానిమంత్రి నరేంద్రమోదీ వాటిని విడిచిపెట్టారు. అలా తీసుకొచ్చిన వాటిలో రెండు చీతాలు రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేసింది.

దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఆరేళ్ల చీతా ఉదయ్ ఈ నెల 23న మరణించింది. అంతకుముందు మార్చి 27న నమీబియా నుంచి తీసుకొచ్చిన ఐదేళ్ల చీతా సాషా మృతి చెందింది. అది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు జనవరిలోనే గుర్తించారు. చీతాల మరణాలపై తాజాగా దక్షిణాఫ్రికా ప్రభుత్వం స్పందించింది. ఇలాంటి ప్రాజెక్టుల్లో మరణాలు ఊహించిందేనని, నిజానికి అనుకున్న దానికంటే మరణాల రేటు తక్కువగానే ఉందని దక్షిణాఫ్రికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ, ఫిషరీస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (DFFE) పేర్కొంది. చీతాల మరణాలకు వాతావరణ మార్పులు కూడా ఓ కారణమని తెలిపింది.

‘చీతా మెటా పాప్యులేషన్ ప్రాజెక్టు’లో భాగంగా నమీబియా, సౌతాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలను కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టారు. అయితే, నిజానికి ఇలాంటి ఆపరేషన్లు చాలా సంక్షిష్టమైనవని డీఎఫ్ఎఫ్ఈ పేర్కొంది. ఇప్పుడీ ప్రాజెక్టు చాలా క్లిష్ట దశలో ఉందని తెలిపింది. చీతాలను విశాలమైన వాతావరణంలో విడిచిపెట్టడం వల్ల వాటిపై నియంత్రణ తక్కువగా ఉంటుందని, వాటి బాగోగులను ప్రతి రోజూ చూడడం కష్టసాధ్యం అవుతుందని వివరించింది. అంతేకాకుండా గాయాలు, మరణాల ముప్పు కూడా ఉంటుందని పేర్కొంది. చీతాల అటాప్సీ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్టు డీఎఫ్ఎఫ్ఈ తెలిపింది.

Updated Date - 2023-04-28T16:15:46+05:30 IST