Air India Pee Gate: దుమారం రేపిన ఘటనపై ఎట్టకేలకు స్పందించిన టాటా సన్స్ చైర్మన్
ABN , First Publish Date - 2023-01-08T19:12:36+05:30 IST
దుమారం రేపిన ఘటనపై ఎట్టకేలకు స్పందించిన టాటా సన్స్ చైర్మన్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో మూత్ర విసర్జన ఘటనపై టాటాసన్స్(Tata Sons) చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్(N Chandrasekaran) ఎట్టకేలకు స్పందించారు. న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా(Air India) విమానంలో ఓ ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా(Shanka Mishra) అనే మద్యం మత్తులో ఓ వృద్ధ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. గతేడాది నవంబరు 26న ఈ ఘటన జరగ్గా ఇటీవల ఈ విషయం వెలుగులోకి వచ్చి దుమారం రేపింది. ఈ ఘటనపై విమానంలో వృద్ధురాలి విషయంలో సిబ్బంది ప్రవర్తించిన తీరు, చంద్రశేఖరన్‌కు బాధిత వృద్ధురాలు లేఖ రాసినా స్పందన లేకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన (Air India Pee Gate) ప్రపంచవ్యాప్తంగా సంచలనం కావడంతో తాజాగా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందించారు. ఈ విషయం వ్యక్తిగతంగా తనకు, సంస్థలోని తన సహచరులకు తీవ్ర వేదన కలిగించిందని అన్నారు. ఈ విషయంలో ఎయిర్ లైన్ స్పందన మరింత వేగంగా ఉండాల్సిందన్నారు. తాము ఈ సమస్యను పరిష్కరించాల్సిన రీతిలో పరిష్కరించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సుకు టాటా గ్రూప్, ఎయిర్ ఇండియా పూర్తి నమ్మకం ఇస్తాయని అన్నారు. ఇలాంటి వికృత స్వభావం కలిగిన ఏదైనా ఘటనను నివారించేందుకు, పరిష్కరించేందుకు ఇకపై ప్రతి దానిని సమీక్షించి, దిద్దుబాటు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
14 రోజుల జుడీషియల్ కస్టడీ
మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాను బెంగళూరులో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా 30 రోజుల ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ విషయంలో సిబ్బంది స్పందించిన తీరులో లోపాలున్నాయా? అన్న విషయంపై అంతర్గత విచారణ కూడా చేపట్టింది.
విచారం వ్యక్తం చేసిన ఎయిర్ ఇండియా
విమానంలో శంకర్ మిశ్రా మూత్ర విసర్జన ఘటనలో తాము మరింత మెరుగ్గా వ్యవహరించి ఉండాల్సిందని ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) విచారం వ్యక్తం చేశారు. సహచర ప్రయాణికుల చర్యల వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న ఘటనలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తాము చింతిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో తాము మరింత మెరుగ్గా వ్యవహరించి ఉండాల్సిందని క్యాంప్‌బెల్ అంగీకరించారు.