Share News

Baryl Vanneihsangi: ఎవరీ బేరిల్ వన్నెహసాంగి.. టీవీ యాంకర్ నుంచి ఎమ్మెల్యేగా ఎలా ఎదిగింది?

ABN , First Publish Date - 2023-12-05T22:52:55+05:30 IST

అప్పుడప్పుడు రాజకీయాల్లో ఎవ్వరూ ఊహించని చమత్కారాలు చోటు చేసుకుంటుంటాయి. వాటిల్లో బేరిల్ వన్నెహసాంగి అనే మహిళా ఎమ్మెల్యే ఒకరు. టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన ఆమె.. అంచలంచెలుగా ఎదుగుతూ అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా...

Baryl Vanneihsangi: ఎవరీ బేరిల్ వన్నెహసాంగి.. టీవీ యాంకర్ నుంచి ఎమ్మెల్యేగా ఎలా ఎదిగింది?

Baryl Vanneihsangi: అప్పుడప్పుడు రాజకీయాల్లో ఎవ్వరూ ఊహించని చమత్కారాలు చోటు చేసుకుంటుంటాయి. వాటిల్లో బేరిల్ వన్నెహసాంగి అనే మహిళా ఎమ్మెల్యే ఒకరు. టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన ఆమె.. అంచలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా అవతరించింది. మిజోరాం ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) పార్టీ తరఫున ఐజ్వాల్ సౌత్-III స్థానం నుంచి పోటీ చేసిన బేరిల్.. తన ప్రత్యర్థి అయిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) అభ్యర్థి ఎఫ్ లాల్నున్మావియాపై ఘనవిజయం సాధించింది. తన ప్రత్యర్థికి 7,956 ఓట్లు రాగా.. బేరిల్‌కి 9,370 ఓట్లు సంపాదించి, 1,414 ఓట్ల మెజారితో గెలుపొందింది. దీంతో.. అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలోనే.. బేరిల్ గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు.


అసలు ఎవరీ బేరిల్ వన్నెహసాంగి?

1991లో బేరిల్ మిజోరాంలో జన్మించింది. ఇప్పుడు ఆమె వయసు 32 సంవత్సరాలు. మేఘాలయలోని షిల్లాంగ్‌లో నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేసింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక బేరిల్ ఒక యాంకర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించింది. క్రమంగా పాపులారిటీ గడించిన ఆమె.. రాజకీయాలపై ఆసక్తితో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె గతంలో ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC)లో కౌన్సిలర్‌గా కూడా పని చేసింది. నివేదికల ప్రకారం.. బేరిల్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు 2 లక్షల 51 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలో తనదైన ముద్ర వేసి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి, అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా సరికొత్త సంచలనానికి పునాది వేసింది.

ఇక మిజోరాం ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుకుంటే.. మిజోరాంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ZPM 27 సీట్లు, MNF 10 సీట్లు, బీజేపీ 2 సీట్లు, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకున్నాయి. ZPMకు 37.86 శాతం, ఎంఎన్‌ఎఫ్‌కు 35.10 శాతం, బీజేపీకి 5.06 శాతం, కాంగ్రెస్‌కు 2.82 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో ఇతరుల ఖాతాలో 0.68 శాతం ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో బేరిల్‌తో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా గెలుపొందారు. లుంగ్లీ ఈస్ట్ స్థానం నుండి ZPM లాల్రిన్‌పుయ్, వెస్ట్ టుయిపుయ్ స్థానం నుండి ప్రోవా చక్మా గెలిచారు.

Updated Date - 2023-12-05T22:52:57+05:30 IST