Share News

Uttarakhand: టన్నెల్‌లో యోగా, ధ్యానం.. ప్రశంసలు పొందుతున్న గబ్బర్ సింగ్ నేగి

ABN , First Publish Date - 2023-11-29T13:18:41+05:30 IST

"మీరు ధైర్యంగా ఉండండి. ఏం కాదు. యోగా చేయండి. ధ్యానం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది"... ఇవే ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న ఓ కార్మికుడు మిగతావారికి నూరిపోసిన ధైర్యం. ఆయనే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన గబ్బర్ సింగ్ నేగి.

Uttarakhand: టన్నెల్‌లో యోగా, ధ్యానం.. ప్రశంసలు పొందుతున్న గబ్బర్ సింగ్ నేగి

డెహ్రడూన్: "మీరు ధైర్యంగా ఉండండి. ఏం కాదు. యోగా చేయండి. ధ్యానం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది"... ఇవే ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న ఓ కార్మికుడు మిగతావారికి నూరిపోసిన ధైర్యం. ఆయనే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన గబ్బర్ సింగ్ నేగి(Gabbar Singh Negi). నేగి పౌరీ గర్వాల్ జిల్లాలో జన్మించారు. 17 రోజుల క్రితం సొరంగం కూలిపోయిన ఘటనలో చిక్కుకున్నారు. అంధకారంలో సైతం తోటి సభ్యులకు ధైర్యం చెబుతూ.. ప్రాణాలపై ఆశలు చిగురించేలా చేశారు గబ్బర్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) సైతం ఆయన్ని ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో ఎలా ఉండాలన్నది గబ్బర్ ను చూసి నేర్చుకున్నామని తోటి కార్మికులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్(Uttarakhand)లో సొరంగం కుప్పకూలి 41మంది అందులో చిక్కుకున్న విషయం విదితమే. అధికారులు రేయింబవళ్లు కష్టపడి చివరికి వారిని బయటకి తీసుకొచ్చారు.

అయితే కార్మికులు ఆ 17 రోజులు ఏం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా తమలో ధైర్యాన్ని పెంపొందించిన వ్యక్తి ఎవరో చెబుతూ గబ్బర్ సింగ్ నేగి పేరును ప్రస్తావిస్తున్నారు. ఆయన సొరంగంలో యోగ, ధ్యానం చేయడం నేర్పించారని, శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించారని కార్మికులు తెలిపారు. గబ్బర్ మాట్లాడుతూ.. తానే అందరికంటే సీనియర్ నని చివరికి బయటకి వచ్చేది తానేనంటూ నవ్వుతూ చెప్పారు.

సొరంగంలో ఉన్నంత వరకు కార్మికుల్లో ధైర్యం సన్నగిల్లకుండా చూశానని.. అది వారి గొప్పతనమని పేర్కొన్నారు. "నేను చాలా సంతోషంగా ఉన్నా. మా కుటుంబమే కాదు యావత్ దేశం మేమంతా క్షేమంగా బయటకి రావాలని ప్రార్థించింది. మేం లోపల ఉన్నప్పుడు చెస్, లూడో వంటి ఆటలు ఆడాం" అని అన్నారు. ఈ సందర్భంగా గబ్బర్ నాయకత్వ లక్షణాలను కొనియాడారు ఆయన సోదరుడు జయమల్ నేగి.


ఫోన్లో పరామర్శించిన మోదీ..

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీలోని సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులు ఎట్టకేలకు బయటకి రావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులను ఆయన ఫోన్లో పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఆపరేషన్ లో ముఖ్య పాత్ర పోషించిన ఆర్మీ(రిటైర్డ్) అధికారి వీకే సింగ్(VK Singh) సేవల్ని కొనియాడారు.

పక్షం రోజులకు పైగా మొక్కవోని ధైర్యంతో ఆశలు కోల్పోకుండా నిరీక్షించి కార్మికుల తెగువను ప్రశంసించారు. కార్మికులందరికీ కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆశీస్సులు ఉన్నాయని.. అందుకే క్షేమంగా బయటపడినట్లు వ్యాఖ్యానించారు. కూలీల అసాధారణ ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

ఈ విషయంలో తాను భావోద్వేగానికి లోనవుతున్నట్లు.. కార్మికుల ధైర్యం, సహనం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. సొరంగంలో ఒక్క క్షణం కూడా తాము భయపడలేదని ఓ కార్మికుడు ప్రధానికి చెప్పాడు.

Updated Date - 2023-11-29T13:40:50+05:30 IST