Share News

Sara Tendulkar: డీప్‌ఫేక్ ఫోటోలు, ఫేక్ ‘ఎక్స్’ అకౌంట్‌పై సారా టెండూల్కర్ ఫైర్.. వాటిని తొలగించాలంటూ డిమాండ్

ABN , First Publish Date - 2023-11-22T17:27:10+05:30 IST

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చాలామంది మంచి పనులకు, తమ ఎదుగుదలకు వినియోగిస్తుంటే.. మరికొందరు మాత్రం తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. సెలెబ్రిటీలను టార్గెట్ చేసుకొని..

Sara Tendulkar: డీప్‌ఫేక్ ఫోటోలు, ఫేక్ ‘ఎక్స్’ అకౌంట్‌పై సారా టెండూల్కర్ ఫైర్.. వాటిని తొలగించాలంటూ డిమాండ్

Sara Tendulkar Deepfake: ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చాలామంది మంచి పనులకు, తమ ఎదుగుదలకు వినియోగిస్తుంటే.. మరికొందరు మాత్రం తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. సెలెబ్రిటీలను టార్గెట్ చేసుకొని.. డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోలను సృష్టించి.. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతేకాదు.. ఫేక్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేసి, సెలెబ్రిటీల ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నారు. చివరికి ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ని సైతం విడిచిపెట్టలేదు. ఆమెను కూడా ఈ డీప్‌ఫేక్, ఫేక్ అకౌంట్‌ల రొంపిలోకి లాగారు. ఇది తన దృష్టికి రావడంతో.. ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా సారా తారాస్థాయిలో మండిపడింది. వాటిని తొలగించాలని డిమాండ్ చేసింది.


‘‘మన సంతోషాలు, బాధలు, రోజువారీ కార్యకలాపాలను అందరితో పంచుకోవడానికి సోషల్ మీడియా ఒక అద్భుతమైన ప్రదేశం. కానీ.. కొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేయడం విస్తుగొలుపుతోంది. నాకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ ఫోటోలను చూశాను. అవి వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. అలాగే.. ఎక్స్‌లో నా పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించారు. ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఉద్దేశపూర్వకంగా వాటిని క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. నాకు ఎక్స్‌లో ఖాతా లేదు. నా పేరుపై ఉన్న నకిలీ ఖాతాలను పరిశీలించి, వాటిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆశిస్తున్నాను’’ అంటూ ఇన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సారా టెండూల్కర్ రాసుకొచ్చింది. వినోదం అనేది సత్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని.. నమ్మకం, వాస్తవికతపై ఆధారపడిన కమ్యూనికేషన్‌ను ప్రోత్సాహిద్దామని చివర్లో ఆమె సూచించింది.

ఇదిలావుండగా.. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో సారా టెండూల్కర్ ప్రేమలో ఉందని గతకొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. దీనిపై వీళ్లిద్దరు ఇంతవరకూ స్పందించలేదు కానీ.. పలు మ్యాచ్‌లు సారా హాజరవ్వడం, శుభ్‌మన్‌ని మద్దతు తెలపడం.. ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలోనే.. సారా పేరుతో ఎక్స్‌లో ఎవరో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. అందులో శుభ్‌మన్ ప్రస్తావన తరచూ చేస్తూ.. తాను అతనితో ప్రేమలో ఉన్నానంటూ పోస్టులు కూడా పెట్టారు. ఈ ఎక్స్ ఖాతాకి బ్లూ టిక్ ఉండటంతో.. అది నిజమేనని అందరూ నమ్మారు. కానీ.. తనకు ఎక్స్‌లో ఎలాంటి ఖాతా లేదని సారా క్లారిటీ ఇచ్చింది కాబట్టి, అదొక ఫేక్ అకౌంట్ అని తేలిపోయింది.

Updated Date - 2023-11-22T17:27:12+05:30 IST