Uttarakhand UCC: ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలుకు డ్రాఫ్ట్ కాపీ రెడీ.. ముసాయిదాలోని అంశాలు ఏమిటంటే..?

ABN , First Publish Date - 2023-06-30T20:56:19+05:30 IST

ఉమ్మడి పౌర స్మృతిపై ఓ వైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, మరోవైపు త్వరలోనే ఉత్తరాఖండ్‌లో యూసీసీని అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి శుక్రవారం ప్రకటించారు. యూసీసీపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తన పనిని ఈరోజుతో పూర్తి చేసిందని, డ్రాఫ్ట్ కాపీ సిద్ధం చేసిందని చెప్పారు.

Uttarakhand UCC: ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలుకు డ్రాఫ్ట్ కాపీ రెడీ.. ముసాయిదాలోని అంశాలు ఏమిటంటే..?

డెహ్రూడూన్: ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Cod - UCC)పై ఓ వైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, మరోవైపు త్వరలోనే ఉత్తరాఖండ్‌లో (Uttarkhand) యూసీసీని అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి (Pushkar Singh Dhami) శుక్రవారంనాడు ప్రకటించారు. యూసీసీపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తన పనిని ఈరోజుతో పూర్తి చేసిందని, డ్రాఫ్ట్ కాపీ సిద్ధం చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు త్వరలోనే ఉత్తరాఖండ్‌లో యూసీసీని అమలు చేస్తామని ఓ ట్వీ్ట్‌లో ఆయన తెలిపారు. ఈ ఏడాది మేలో ఒక నోటిఫికేషన్ అనంతరం జూన్ 2022న కమిటీని ఉత్తరాఖండ్ సర్కార్ ఏర్పాటు చేసింది. జూలై 4న తొలి సమావేశం జరిగింది. ఏడాదిలో 63 సార్లు కమిటీ సమావేశమైంది.

ఉత్తరాఖండ్ యూసీసీ ప్యానల్‌కు సారథ్యం వహించిన జస్టిస్ (రిటైర్డ్) రంజనా ప్రకాష్ దేశాయ్ మీడియాతో ఈ విషయమై మాట్లాడుతూ, ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలు కోసం తుది ముసాయిదా పని పూర్తి చేసామని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. పలు చట్టాలు, శాసననాలను పరిశీలించి, భిన్నవర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముసాయిదా ప్రతిని రూపొందించినట్టు వివరించారు. ముసాయిదాలోని అంశాలు ఇంకా బయటకు రానప్పటికీ విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, యూసీసీ అమల్లో భాగంగా బాలికల వయస్సు 18 నుంచి 21కి పెంచారని, వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని, లివింగ్ రిలేషన్‌లో ఉన్న జంటలు ఆ విషయాలను తప్పనిసరిగా తల్లిదండ్రులకు తెలియజేయాలని, బహుభార్యాత్వంపై నిషేధం, దత్తతు ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేయడం, విడాకులు అందరికీ ఒకేలా వర్తించేలా చేయడం వంటివి ముసాయిదాలో సూచించినట్టు తెలుస్తోంది.

కాగా, తుది ముసాయిదాను చదివిన అనంతరం కేంద్ర ప్రభుత్వాన్ని పుష్కర్ సింగ్ ధామి సంప్రదిస్తారని, అనంతరం జూలై మూడో వారంలో అసెంబ్లీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, సభ ఆమోదం పొందుతారని తెలుస్తోంది.

Updated Date - 2023-06-30T20:56:19+05:30 IST