Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన ఎఫెక్ట్... ఆగమేఘాలపై ఢిల్లీకి పయనమైన కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2023-01-19T21:00:07+05:30 IST

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ వచ్చిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది.

Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన ఎఫెక్ట్... ఆగమేఘాలపై ఢిల్లీకి పయనమైన కేంద్ర మంత్రి
Union Sports Minister Anurag Thakur sent a notice to WFI chief Brijbhushan Sharan Singh

చండీగఢ్: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ వచ్చిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌‌పై మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, సత్వరమే చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. తాను ప్రస్తుతం ఢిల్లీకి వెళ్తున్నానని, రెజ్లర్లతో మాట్లాడతానని చెప్పారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు నోటీసులు పంపామని, 72 గంటల్లోగా స్పందించాలని సూచించామన్నారు. అదే సమయంలో త్వరలో జరగాల్సిన కీలక సమావేశాన్ని కూడా వాయిదా వేశామని అనురాగ్ తెలిపారు.

అంతకు ముందు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ సంచలన ఆరోపణలు చేసింది. బ్రిజ్‌భూషణ్‌తో పాటు అనేకమంది కోచ్‌లు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతక విజేత, ఒలింపియన్‌ అయిన వినేశ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నాళ్లుగానో సాగుతున్న వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేస్తూ సహచర రెజ్లర్లతో కలిసి దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆమె ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో ఒలింపిక్‌ కాంస్య పతక విజేతలు సాక్షి మాలిక్‌, భజ్‌రంగ్‌ పూనియా, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతక విజేతలు సరితా మోర్‌, సంగీతా ఫొగట్‌, సత్యవర్త్‌ మాలిక్‌, జితేందర్‌, సుమిత్‌ మాలిక్‌ సహా 30 మంది టాప్‌ రెజ్లర్లు పాల్గొన్నారు.

ఈ విషయంలో ప్రధానమంత్రి, హోం మంత్రి కలుగజేసుకొని తక్షణమే బ్రిజ్‌ భూషణ్‌ను పదవి నుంచి తొలగించాలని వీరంతా కోరారు. గతంలో తానిచ్చిన ఫిర్యాదుల కారణంగా వేధింపులు మొదలవడంతో ఓ దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని వినేశ్‌ మీడియా ముందు కంటతడి పెట్టుకుంది. ‘బ్రిజ్‌ భూషణ్‌ను కలవాలంటూ జాతీయ శిబిరంలోని కొంతమంది మహిళలు రెజ్లర్లను సంప్రదిస్తుంటారు. అతడితో పాటు అనేక మంది కోచ్‌లు కూడా లైంగికంగా వేధిస్తుంటారు. ఈ విషయమై గతంలో ఓసారి ఫిర్యాదు చేసినందుకు నన్ను చంపేస్తానంటూ బెదిరించాడు. వేధింపులకు గురైన వారిలో కనీసం పదీ పన్నెండు మంది మహిళా రెజ్లర్లు ఉన్నారు. ఇదే విషయమై మూడు నెలల క్రితం బజ్‌రంగ్‌ పూనియా, నేను హోం మంత్రి అమిత్‌ షాను కలిసి సమస్యలను వివరించాం. మీకు న్యాయం జరుగుతుందని హోం మంత్రి హామీ ఇచ్చారు’ అని వినేశ్‌ తెలిపింది. బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ లోక్‌సభ ఎంపీ అయిన 66 ఏళ్ల బ్రిజ్‌ భూషణ్‌.. 2011 నుంచి జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019 ఫిబ్రవరిలో వరుసగా మూడోసారి భారత రెజ్లింగ్‌ సమాఖ్య చీఫ్‌గా ఎన్నికయ్యారు.

మరోవైపు రెజ్లర్లు చేసిన ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ కొట్టిపారేశాడు. వినేశ్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాననడంలో కూడా వాస్తవం లేదన్నాడు. మహిళా రెజ్లర్లలో ఒక్కరినైనా లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకుంటానన్నాడు. ‘ఇదంతా కుట్ర. ఓ పెద్ద పారిశ్రామికవేత్త వెనకుండి ఇదంతా నడిపిస్తున్నాడు. ఈసారి రెజ్లింగ్‌ సమాఖ్యలో కొత్త పాలసీ, నిబంధనలు ప్రవేశపెట్టాం. ఇవి వాళ్లకు నచ్చకపోవడంతో ఇలా ఆందోళన బాట పట్టారు’ అని బ్రిజ్‌ భూషణ్‌ అన్నారు.

Updated Date - 2023-01-19T21:00:31+05:30 IST