Wrestlers Protest: కేంద్ర క్రీడల మంత్రితో రెజ్లర్ల భేటీ.. సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2023-01-20T17:57:25+05:30 IST

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌‌ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్‌తో సమావేశమయ్యారు.

Wrestlers Protest: కేంద్ర క్రీడల మంత్రితో రెజ్లర్ల భేటీ.. సంచలన ఆరోపణలు
wrestlers meets Union Sports Minister Anurag Thakur

చండీగఢ్: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌‌(Brijbhushan Sharan Singh)ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్‌ (Union Sports Minister Anurag Thakur)తో మరోసారి సమావేశమయ్యారు. వాస్తవానికి నిన్న రాత్రి నుంచి తెల్లవారేవరకూ రెజ్లర్లు అనురాగ్ ఠాకూర్‌తో చర్చలు జరిపారు. తమకు న్యాయం కావాలని, భారత రెజ్లింగ్‌ సమాఖ్యను రద్దు చేసే వరకూ తమ ఆందోళన విరమించబోమని వారు స్పష్టం చేశారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) ఉపాధ్యక్షుడు తమను లైంగికంగా వేధించాడని స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ ( Vinesh Phogat) సంచలన ఆరోపణలు చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఇది కేవలం మహిళా రెజ్లర్లకు మాత్రమే సంబంధించిన విషయం కాదని, రెజ్లందరికీ సంబంధించినదని వారంటున్నారు. రెజ్లర్లు అందరూ తమకు సంఘీభావం తెలిపారని చెప్పారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలో ఒలింపిక్‌ కాంస్య పతక విజేతలు సాక్షి మాలిక్‌, భజ్‌రంగ్‌ పూనియా, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతక విజేతలు సరితా మోర్‌, సంగీతా ఫొగట్‌, సత్యవర్త్‌ మాలిక్‌, జితేందర్‌, సుమిత్‌ మాలిక్‌ సహా 30 మంది టాప్‌ రెజ్లర్లు పాల్గొన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి, హోం మంత్రి కలుగజేసుకొని తక్షణమే బ్రిజ్‌ భూషణ్‌ను పదవి నుంచి తొలగించాలని వీరంతా కోరారు.

మరోవైపు జంతర్ మంతర్ వద్ద ఆందోళన విరమించకపోతే రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని భారత రెజ్లింగ్‌ సమాఖ్య యోచిస్తున్నట్లు సమాచారం.

బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌‌పై మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, సత్వరమే చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ నిన్న తెలిపారు.భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు నోటీసులు పంపామని, 72 గంటల్లోగా స్పందించాలని సూచించామన్నారు.

బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ లోక్‌సభ ఎంపీ అయిన 66 ఏళ్ల బ్రిజ్‌ భూషణ్‌.. 2011 నుంచి జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019 ఫిబ్రవరిలో వరుసగా మూడోసారి భారత రెజ్లింగ్‌ సమాఖ్య చీఫ్‌గా ఎన్నికయ్యారు.

మరోవైపు రెజ్లర్లు చేసిన ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ కొట్టిపారేశాడు. వినేశ్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాననడంలో కూడా వాస్తవం లేదన్నాడు. మహిళా రెజ్లర్లలో ఒక్కరినైనా లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకుంటానన్నాడు. ‘ఇదంతా కుట్ర. ఓ పెద్ద పారిశ్రామికవేత్త వెనకుండి ఇదంతా నడిపిస్తున్నాడని ఆరోపించారు. ఈసారి రెజ్లింగ్‌ సమాఖ్యలో కొత్త పాలసీ, నిబంధనలు ప్రవేశపెట్టామని, ఇవి రెజ్లర్లకు నచ్చకపోవడంతో ఇలా ఆందోళన బాట పట్టారని బ్రిజ్‌ భూషణ్‌ అన్నారు.

Updated Date - 2023-01-20T19:48:48+05:30 IST