Share News

క్షార ఆహారంతో కేన్సర్‌ దూరం

ABN , First Publish Date - 2023-11-28T04:10:40+05:30 IST

పిహెచ్‌ బ్యాలెన్స్‌ స్థిరంగా ఉండడం కోసం క్షారత్వం కలిగి ఉండే పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన పదార్థాలను తీసకుంటూ ఆమ్లత్వాన్ని పెంచే మాంసం, పాల పదార్థాల వాడకాన్ని తగ్గించాలి.

క్షార ఆహారంతో కేన్సర్‌ దూరం

కేన్సర్‌ కణాల పెరుగుదలకు వీలు లేని వాతావరణాన్ని శరీరంలో సృష్టించడానికి క్షార గుణం కలిగిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అందుకు ఎలాంటి పదార్థాలలను ఆహారంలో చేర్చుకోవాలో తెలుసుకుందాం!

శరీరంలోని అంతర్గత వాతావరణంలోని పిహెచ్‌ బ్యాలెన్సే క్షారత్వం. రోజువారీ జీవితంలోని శారీరక జీవక్రియలు సక్రమంగా కొనసాగడంలో శరీరంలోని పిహెచ్‌ బ్యాలెన్స్‌ కీలక పాత్ర పోషిస్తుంది. పిహెచ్‌ అంటే పొటెన్షియల్‌ ఆఫ్‌ హైడ్రోజన్‌ అని అర్థం.

ఆమ్లత్వం లేదా క్షారత్వాలు సాధారణంగా 0- 14 వరకూ ఉంటాయి. పిహెచ్‌ 7ను న్యూట్రల్‌గా భావించాలి. అంతకంటే తగ్గితే ఆమ్లత్వంగా, పెరిగితే క్షారత్వంగా పరిగణించాలి. శరీరంలోని ఎంజైమ్స్‌ కార్యకలాపాలు,

కణ కార్యకలాపాలు, పోషక రవాణా, వ్యర్థాల విసర్జన, శక్తి ఉత్పత్తి... వీటన్నిటినీ పిహెచ్‌ బ్యాలెన్స్‌ ప్రభావితం చేస్తుంది. కాబట్టి దాన్ని 7.35 నుంచి 7.45 మధ్య స్థిరంగా ఉంచుకోవాలి. రక్తం, అధిక ఆమ్లత్వం లేదా క్షారత్వం కలిగి ఉంటే ఎంజైమ్‌ల కార్యకలాపాలన్నీ దెబ్బతింటాయి. స్థిరంగా ఉంటే, ఇమ్యూనిటీ పెరిగి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ దక్కుతుంది.

క్షారత్వ డైట్‌ అంటే?

పిహెచ్‌ బ్యాలెన్స్‌ స్థిరంగా ఉండడం కోసం క్షారత్వం కలిగి ఉండే పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన పదార్థాలను తీసకుంటూ ఆమ్లత్వాన్ని పెంచే మాంసం, పాల పదార్థాల వాడకాన్ని తగ్గించాలి. ఆల్కలైన్‌ డైట్‌ శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, సంబంధిత ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. సిట్రస్‌ పండ్లు, మెలన్స్‌, బెర్రీస్‌, యాపిల్స్‌తో పాటు కేల్‌, స్పినాచ్‌, బ్రొకొలి, కాలీఫ్లవర్‌, దోసకాయలను ఎక్కువగా తీసుకోవాలి. బాదం, చెస్ట్‌నట్స్‌, అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, పప్పుదినుసులు, ఆలివ్‌ నూనె, కొబ్బరి నూనె, తులసి, పసుపు కూడా క్షారగుణాన్ని పెంచుతాయి. క్యామోమైల్‌, పెప్పర్‌మింట్‌ టీలు కూడా ఉపయోగపడతాయి. పాలు, పెరుగు, జున్ను మొదలైన పాల ఉత్పత్తులు ఆమ్ల గుణాన్ని పెంచుతాయి. కాబట్టి వీటికి బదులుగా ఆకుకూరలు, ఫోర్టిఫెడ్‌ ప్లాంట్‌ బేస్‌డ్‌ పాల ప్రత్యామ్నాయలను ఎంచుకోవాలి. ఎక్కువగా ప్రాసెస్‌ చేసిన, రిఫైన్‌ చేసిన తీపి ఉత్పత్తులు, శీతల పానీయాలు ఆమ్లత్వాన్ని పెంచుతాయి. అయితే అలాగని ఆమ్లత్వ ఆహార పదార్థాలకు పూర్తిగా దూరమైనా పోషక లోపం తలెత్తే అవకాశం ఉంటుంది. ఆ లోపం తలెత్తకుండా పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ ఆహార నియమాలతో పాటు సరిపడా నిద్ర, వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం లాంటి నియమాలు కూడా పాటించాలి. ఆహారంతో శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రించాలనుకునేవాళ్లు ఆరోగ్యకరమైన కొవ్వులు, కూరగాయలు, పండ్లతో కూడిన సమతులాహారాన్ని ఎంచుకోవాలి. అదే సమయంలో ఆమ్లత్వాన్ని పెంచే పదార్థాలను గుర్తించి, వాటిని తగ్గించడంతో పాటు సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.

క్షారత్వ నీటితో ప్రయోజనం?

అయొనైజ్‌ చేసి, పిహెచ్‌ విలువ పెంచిన నీరే ఆల్కలైన్‌ వాటర్‌. ఈ నీటి పిహెచ్‌ విలువు 7 కంటే ఎక్కువ ఉంటుంది. కొన్ని వాటర్‌ ఫిల్టర్లు క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలను జోడించి నీటి పిహెచ్‌ను పెంచేలా డిజైన్‌ చేసి ఉంటాయి. నీటి పిహెచ్‌ విలువను పెంచే ఆల్కలైన్‌ వాటర్‌ డ్రాప్స్‌, లేదా పౌడర్లను కూడా తాగునీటికి జోడించుకోవచ్చు.

డాక్టర్‌ నాగేంద్ర పర్వతనేని

సీనియర్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సర్జికల్‌ ఆంకాలజీ,

కిమ్స్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-11-28T04:10:41+05:30 IST