Share News

కొలెస్ట్రాల్‌ కచ్చిత కొలతల్లో...

ABN , First Publish Date - 2023-11-28T04:13:11+05:30 IST

గుండెపోటుకు గురైన వాళ్లకు పరోక్షంగా, ప్రత్యక్షంగా రెండు విధాలా కొలెస్ట్రాల్‌ దోహదపుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది.

కొలెస్ట్రాల్‌ కచ్చిత కొలతల్లో...

కొలెస్ట్రాల్‌ గుండెకు కచ్చితంగా శత్రువే!

అయితే ఏ కొలెస్ట్రాల్‌ హానికరమో, ఏది సురక్షితమో తెలుసుకుంటూ రక్తంలోని కొలెస్ట్రాల్‌ మోతాదుల మీద ఓ కన్నేసి ఉంచాలంటున్నారు వైద్యులు.

గుండెపోటుకు గురైన వాళ్లకు పరోక్షంగా, ప్రత్యక్షంగా రెండు విధాలా కొలెస్ట్రాల్‌ దోహదపుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. వీళ్లలో మంచి కొలెస్ట్రాల్‌ తక్కువ ఉండవచ్చు. చెడు కొలెస్ర్టాల్‌, దాంతో పాటు ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువ ఉండవచ్చు. ఈ మూడు అంశాలూ గుండెకు చేటు చేసేవే. వీటిలో అవతవకలన్నీ గుండె మీద ప్రభావాన్ని చూపించేవే! నిజానికి కొలెస్ట్రాల్‌ను ఒక అంశంగా పరిగణించకూడదు. మంచి, చెడు కొలెస్ట్రాల్‌లతో పాటు ట్రైగ్లిజరైడ్స్‌... ఈ మూడింటి సమ్మేళనాన్ని కొలెస్ట్రాల్‌ మోతాదుగా పరిగణించాలి.

కొలెస్ట్రాల్‌ కొలమానం ఇలా...

సాధారణంగా ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది. టోటల్‌ కొలెస్ట్రాల్‌ రిపోర్టులో పక్కన కనిపించే సాధారణ మోతాదులతో సరిపోల్చుకుని నా కొలెస్ట్రాల్‌ మోతాదు నార్మల్‌గానే ఉందనుకుంటారు. కానీ నిజానికి అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఆ నార్మల్‌ మోతాదులతో తమ ఫలితాలను సరిపోల్చుకోవచ్చు. కానీ గుండె జబ్బు ఉన్నవాళ్లకు ఆ మోతాదులు మరింత తక్కువగా ఉండాలి. గుండె జబ్బు లేని వాళ్లకు టోటల్‌ కొలెస్ట్రాల్‌ మోతాదులు 250 వరకూ ఉండవచ్చు. కానీ సమస్య ఉన్నవాళ్లకూ, గుండెపోటు గురైన వాళ్లు, స్టెంట్లు వేయించుకున్నవాళ్లు, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించుకున్నవాళ్లకు ఒక డెసిలీటరుకు 130 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి. అప్పుడే వేయించుకున్న స్టెంట్లు తిరిగి పూడుకుపోకుండా ఉంటాయి. అలాగే గుండెపోటుకు కూడా గురవకుండా ఉంటారు.

టోటల్‌ కొలెస్ట్రాల్‌ అంటే?

ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌, హెచ్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ అనే మూడు రకాల కాంపొనెంట్స్‌ను కలిపి కొలెస్ట్రాల్‌గా పరిగణించాలి. హై డెన్సిటీ లైపోప్రొటీన్ల సాంద్రత ఎక్కువ కాబట్టి రక్తంలోని ఆ లిపిడ్స్‌ కాలేయానికి సరఫరా అవుతాయి. ఇది మంచి కొలెస్ట్రాల్‌. లో డెన్సిటీ లైపో ప్రొటీన్‌కు క్లాట్స్‌ను ఏర్పరిచే తత్వం ఉంటుంది. కాబట్టి దీన్ని చెడు కొలెస్ట్రాల్‌గా పరిగణించాలి. షుగర్లు ట్రైగ్లిజరైడ్లుగా మారి కాలేయంలా కొలెస్ట్రాల్‌గా మారతాయి. వీటి మోతాదులు ఒక డెసిలీటరుకు 250 మిల్లీ లీటర్లకంటే ఎక్కువ ఉంటే అసాధారణంగా భావించాలి. గుండె సమస్యలు ఉన్నవాళ్లకు దీని మోతాదు 150 కంటే తక్కువ ఉండాలి. మధుమేహంలో అవకతవకలు ఏర్పడినా, హైపో థైరాయిడ్‌ లాంటి ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నా, కొలెస్ట్రాల్‌ కుటుంబ చరిత్ర కలిగి ఉన్నా, ట్రైగ్లిజరైడ్స్‌ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇక హెడిఎల్‌ కొలెస్ట్రాల్‌ సాధారణ మోతాదు 30 నుంచి 50. 50 కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటే గుండెకు రక్షణ దక్కుతుంది. సాధారణంగా ఎక్కువ శాతం మందిలో ఎల్‌డిఎల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువ ఉండడంతో పాటు, హెచ్‌డిఎల్‌ అనే మంచి కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఇంకొంతమందిలో ఎల్‌డిఎల్‌, టోటల్‌ కొలెస్ట్రాల్‌ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్లలో టోటల్‌ కొలెస్ట్రాల్‌ 170 లేదా 180 ఉండొచ్చు కానీ, ఎల్‌డిఎల్‌ ఎక్కువగా ఉండడం, అదే సమయంలో హెచ్‌డిఎల్‌ తక్కువగా ఉండడం కనిపిస్తూ ఉంటుంది. మన దేశంలో ఇది సర్వసాధారణ సమస్య. ప్రత్యేకించి మధుమేహుల్లో ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువగా ఉండి, ‘డయాబెటిక్‌ డిస్‌లిపిడిమియా’కు గురవుతూ ఉంటారు. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ట్రైగ్లిజరైడ్స్‌ 130 దరిదాపుల్లో ఉంటే ఫర్వాలేదు. కానీ సమస్య ఉన్నవాళ్లలో సగం మోతాదే ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉంటే మరింత శ్రేయస్కరం.

ఆల్కహాల్‌తో చేటే!

ఆల్కహాల్‌తో హెచ్‌డిఎల్‌ పెరుగుతుందనీ గుండెకు మేలు కలుగుతుందనీ అనుకుంటే అది పొరపాటు. మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. నిజానికి ఆల్కహాల్‌తో ట్రైగ్లిజరైడ్స్‌ మోతాదులు పెరిగిపోతాయి. గోరువెచ్చని వాతావరణం ఉండే యూరోపియన్‌, మధ్యధరా దేశాల్లో ఒక పెగ్‌ ఆల్కహాల్‌ను మూడు నాలుగు గంటలపాటు నెమ్మదిగా తీసుకోవడం, అలాగే ప్రతి రోజూ క్రమం తప్పక వ్యాయామం చేయడం వల్ల హెచ్‌డిఎల్‌ పెరిగి, గుండెకు ప్రయోజనం చేకూరుతుందని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఆల్కహాల్‌ ఏ విధంగానూ గుండెకు మేలు చేయదు. మరీ ముఖ్యంగా మహిళల్లో ఆల్కహాల్‌ రొమ్ము కేన్సర్‌కు గురయ్యే అవకాశాలను పెంచుతుంది.

మంచి మందులున్నాయి

కణాల గోడల తయారీకి కొలెస్ట్రాల్‌ అవసరం. కాలేయంలో కూడా కొలెస్ట్రాల్‌ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అయితే కొలెస్ట్రాల్‌ కుటుంబ చరిత్ర కలిగిన వాళ్లు, జన్యుపరమైన లోపాల కారణంగా, సరైన మోతాదుల్లో ఎంజైమ్స్‌ ఉత్పత్తి కాని వాళ్లలో కొలెస్ట్రాల్‌ మెతాదులు విపరీతంగా పెరిగిపోతాయి. ఇలాంటి వాళ్లు కొలెస్ర్టాల్‌ మోతాదును మందులతో తగ్గించుకోవడంతో పాటు, ఆరోగ్య నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తూ ఉండాలి. అయితే మాత్రలు తీసుకున్నప్పుడు తగ్గిపోయే కొలెస్ట్రాల్‌ వాటిని తీసుకోవడం మానేస్తే తిరిగి పెరిగిపోతుంది. కాబట్టి ఎవరికి వారు రిపోర్టుల్లో ఫలితాలను చూసుకుని, మాత్రలను మానేయకుండా వైద్యుల సూచన మేరకు మందుల మోతాదును తగ్గించుకోవచ్చు.

స్టాటిన్ల అపోహలు వీడాలి

స్టాటిన్లు ఆరోగ్యానికి హానికరమనే ఒక అపోహ కూడా ప్రచారంలో ఉంది. కానీ నిజానికి ఎంతో అరుదుగా కొంతమందిలో మాత్రమే స్టాటిన్ల వాడకం వల్ల చక్కెర మోతాదులు పెరుగుతాయు. అయినప్పటికీ వాళ్లలో గుండెపోటు ముప్పు మూడింతలు తగ్గుతోంది. కాబట్టి పొందే అధిక ఆరోగ్య ప్రయోజనాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. కొందరికి స్టాటిన్లతో కండరాల నొప్పులు రావచ్చు. అలాంటప్పుడు డాక్టర్లకు చెప్పి, ఆ దుష్ప్రభావాలు లేని ప్రత్యామ్నాయ మందులను వాడుకోవాలి. నోటి మాత్రలతో ప్రభావం కనిపించని సందర్భాల్లో వారానికి ఒకటి లేదా రెండుసార్లు లేదా నెలకోసారి తీసుకునే ఇంజెక్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఆరు నెలలకు ఒకసారి తీసుకునే షాట్స్‌ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే ఈ మందులన్నీ తీసుకున్నంత కాలమే ప్రయోజనం దక్కుతుంది. కుటంబ చరిత్రలో కొలెస్ట్రాల్‌ ఉన్నవాళ్లు, నోటి మాత్రలతో పాటు కొలెస్ట్రాల్‌ తగ్గించే ఇంజెక్షన్లు తీసుకోవడం అవసరం. కొలెస్ట్రాల్‌ సాధారణ మోతాదులో ఉండి, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు కొలెస్ట్రాల్‌ మందులను అదనంగా తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటుంది. వీళ్లు గుండెపోటు, పక్షవాతాలకు గురయ్యే అవకాశాలు తగ్గు తాయి.

ఏ వయసు నుంచి?

కొలెస్ట్రాల్‌ కుటుంబ చరిత్ర ఉన్న వాళ్లు 30 ఏళ్ల కంటే ముందు, కుటుంబ చరిత్ర లేని వాళ్లు 30 ఏళ్ల తర్వాతి నుంచి పరీక్షలు చేయించుకుంటూ, అవసరాన్ని బట్టి మందులు వాడుకుంటూ ఉండాలి. ఎన్నేళ్ల పాటు శరీరంలో కొలెస్ట్రాల్‌ మోతాదులు ఎక్కువగా కొనసాగితే, అంత ఎక్కువగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది కాబట్టి సాఽధ్యమైనంత ప్రారంభంలోనే కొలెస్ర్టాల్‌ హెచ్చుతగ్గులను కనిపెట్టడం అవసరం. కొలెస్ట్రాల్‌ మోతాదులను పరీక్షించాలనుకునేవాళ్లు లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్ష చేయించుకోవాలి. 12 గంటల ఓవర్‌నైట్‌ ఉపవాసంతో ఈ పరీక్ష చేయించుకుంటే సరైన ఫలితాలొస్తాయి. ఉపవాసం చేయకుండా చేయించుకునే పరీక్షల్లో ట్రైగ్లిజరైడ్స్‌ ఫలితాలు కాస్త అటూఇటూగా ఉంటాయి. ఫలితాల్లో కొలెస్ట్రాల్‌ మోతాదులను బట్టి లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలను ఎంత తరచుగా చేయించుకోవాలనేది వైద్యులు నిర్ణయిస్తారు.

అతి సర్వత్ర వర్జయేత్‌

రెడ్‌ మీట్‌, కొవ్వుతో కూడిన పదార్థాలలో చెడు కొలెస్ర్టాల్‌ ఎక్కువగా ఉంటుంది. స్వీట్లు, పిండిపదార్ధాలు (బియ్యం, చపాతీ) ఎక్కువగా తీసుకుంటే ట్రైగ్లిజరైడ్స్‌ పెరిగిపోతాయి. ఆల్కహాల్‌తో ట్రైగ్లిజరైడ్స్‌ విపరీతంగా పెరిగిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండే చేపలు తీసుకుంటే కొంత మేరకు ప్రయోజనమే కానీ ఏదైనా పరిమితంగానే తీసుకోవాలి. వాల్‌నట్స్‌, బాదం గుండెకు మేలు చేసేవే అయినా, వాటిని కూడా మితంగానే తీసుకోవాలి. పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా, వాటి ద్వారా అందే క్యాలరీలను దృష్టిలో పెట్టుకోవాలి. మఽధుమేహులు చక్కెర ఎక్కువగా ఉండే అరటిపండ్లకు బదులుగా యాపిల్‌, బొప్పాయి, జామ లాంటి పండ్లను తినడం అరోగ్యకరం. అలాగే నూనెలను తరుచూ మార్చడం లేదా కలిపి వాడడం చేస్తూ ఉండాలి. నెయ్యిని అరుదుగానే వాడుకోవాలి.

Updated Date - 2023-11-28T04:13:12+05:30 IST