Share News

C. Jayaprabha : ఆమె కల వైకల్యాన్ని గెలిచింది

ABN , First Publish Date - 2023-11-29T00:00:21+05:30 IST

పుట్టుకతో వచ్చిన వైకల్యం, భర్త మరణంతో మీద పడిన బాధ్యతలు... జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్నీ ఆత్మవిశ్వాసంతో ఎదిరించారు కోయంబత్తూరుకు చెందిన

C. Jayaprabha : ఆమె కల వైకల్యాన్ని గెలిచింది

పుట్టుకతో వచ్చిన వైకల్యం, భర్త మరణంతో మీద పడిన బాధ్యతలు... జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్నీ ఆత్మవిశ్వాసంతో ఎదిరించారు కోయంబత్తూరుకు చెందిన సి.జయప్రభ. పదేళ్ళ క్రితం తను స్థాపించిన సంస్థను మరింత విస్తరించి... వికలాంగ బాలలకు ఉచిత విద్యతో పాటు వారి తల్లులకు ఉపాధి కల్పిస్తున్నారు.

‘‘నాకు మూడు నెలల వయసున్నప్పుడే నా తుంటి ఎముకలో లోపం ఉందని నిర్ధారణ అయింది. ఆ సమస్య తీవ్రత నాతో పాటే పెరిగింది. నిలబడడం కష్టమయ్యేది. నడవడానికి సాయం అవసరమయ్యేది. వికలాంగ సర్టిఫికెట్‌ కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. బడికి వెళ్ళేముందు, తరగతులు పూర్తయ్యాక కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రి వరండాల్లో పడిగాపులు పడేదాన్ని. కాలేజీలో చేరే వరకూ చిన్న చిన్న దూరాలు నడిచేదాన్ని. ఆ తరువాత అదీ కష్టమైపోయింది. అడుగు వేస్తే ఒక వైపు ఒరిగిపోయేదాన్ని. ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. రోజూ ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు... వివిధ వైకల్యాలతో దుర్భరంగా బతుకుతున్న ఎందరో కనిపించారు. వారిపట్ల వైద్యుల్లో, సిబ్బందిలో చులకనభావాన్ని నేను స్పష్టంగా గమనించాను. ఇలాంటి సంఘటనలు అనేకం చూశాక... నాలాంటి వారి కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచన బలపడింది. నేను, నాలాంటి మరికొందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డాం. శారీరక, మానసిక వైకల్యాలు కలిగిన వారి కోసం పలు కార్యక్రమాలు చేపట్టాం.

తీరని విషాదం...

నాకు వివాహం అయిన తరువాత... నేను, నా భర్త ‘జిజె అకాడమీ’ పేరుతో ఒక ట్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. అందులోనే ఒక గదిని మా సంఘం కార్యక్రమాల కోసం కేటాయించాం. కుటుంబ బాధ్యతలు, సంఘం కార్యకలాపాలతో తీరికలేకుండా నాలుగేళ్ళపాటు గడిచింది. ఇంతలో తీరని విషాదం చోటుచేసుకుంది. నా భర్త హటాత్తుగా బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మరణించారు. అప్పటికి మాకు ఇద్దరు అమ్మాయిలు. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి. జీవితంలో నేను అత్యంత నైరాశ్యంలో ఉన్న రోజులవి. కానీ క్రమంగా కోలుకున్నాను. నా పిల్లల భవిష్యత్తు కోసమైనా బతకాలని నిశ్చయించుకున్నాను. దివ్యాంగ మహిళల కోసం మరిన్ని కార్యకలాపాలు చేపట్టాలనే ఆలోచనతో... పదేళ్ళ క్రితం ‘కోయంబత్తూర్‌ డిస్ట్రిక్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఫర్‌ డిఫరెంట్లీ ఏబుల్డ్‌ ఉమెన్‌’ అనే సంస్థను ఏర్పాటు చేశాను.

ప్రస్తుతం మా సంస్థలో సుమారు 700 మంది సభ్యులున్నారు. వీరందరూ వైకల్యాలు కలిగినవారు లేదా వికలాంగులైన పిల్లలతో జీవిస్తున్న ఒంటరితల్లులే. మా బృందంలో సభ్యులైన ఉపాధ్యాయలు, ఉద్యోగినులు, విద్యార్థినులు వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శారీరక, మానసిక వైకల్యాలున్న వారికి, వితంతువులకు, విడాకులు తీసుకున్నవారికి, యాసిడ్‌, అగ్ని ప్రమాద బాధితులకు, వయోధికులకు, మాజీ మహిళా ఖైదీలకు... ఇలా పలు వర్గాలవారికి కౌన్సెలింగ్‌, న్యాయసహాయం, వైద్య సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడడం లాంటి కార్యక్రమాలు మేము ప్రధానంగా చేపడుతున్నాం. లైంగిక వేధింపులు, గృహ హింస, బాలికలపై అఘాయిత్యాలు తదితర అంశాలపై వీధి నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. మరోవైపు మా సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వొకేషనల్‌ ట్రైనింగ్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ తరగతులను నిర్వహిస్తున్నాం. చాలామంది వీటి ద్వారా ప్రయోజనం పొందారు. కరోనా సమయంలో... సుమారు మూడువేల కుటుంబాలకు అయిదునెలల పాటు నిత్యావసరాలను మా సంస్థ ద్వారా అందించాం. మానసిక ఒత్తిడులకు లోనుకాకుండా... జ్యూమ్‌ కాల్స్‌ ద్వారా వారికి ధైర్యం చెప్పాం.

అదే పెద్ద సవాల్‌...

వైకల్యాలు కలిగిన పిల్లలను ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించడానికి ఇన్నేళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ప్రభుత్వ బడుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, ప్రైవేటు పాఠశాలలు కొన్ని అనుమతించినా విపరీతంగా ఫీజులు వసూలు చేయడం చూసి ఎంతో బాధగా అనిపించేది. మేమే స్వయంగా ఒక పాఠశాల ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. చిన్న స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టాం. మూడు నెలల క్రితం పూర్తి స్థాయిలో పాఠశాలగా మార్చాం. అదే ‘డాక్టర్‌ ఎపిజే అబ్దుల్‌ కలామ్‌ డ్రీమ్‌ స్పెషల్‌ స్కూల్‌’ (డిఎడిఎ్‌సఎస్‌). ఇది నా కలల బడి. వైకల్యాలున్న పిల్లల కలలను సాకారం చేసే బడిగా దీన్ని తీర్పిదిద్దాలన్నది నా ఆశయం.

మా స్కూల్లో చదువుతోపాటు ఫిజియోథెరపీ లాంటివన్నీ ఉచితం. బోధనతో సహా అన్ని పనులూ వైకల్యాలున్న మహిళలు, ఒంటరి తల్లులే నిర్వహిస్తారు. ఫిజికల్‌, స్పీచ్‌, ఆర్ట్‌-క్రాఫ్ట్‌, ఆక్యుపేషనల్‌ థెరపీల ద్వారా సమగ్ర బోధనను అందిస్తున్నాం. ప్రస్తుతం 27 మంది విద్యార్థులున్నారు. పిల్లలతో వారి తల్లితండ్రులను కూడా తరగతి గదుల్లోకి అనుమతిస్తున్నాం. తద్వారా పిల్లలకు కావలసిందేమిటనేది వారు మరింత చక్కగా అర్థం చేసుకోగలరు. ఇలాంటి పాఠశాలను ఉచితంగా నడపడం పెద్ద సవాలు. ఇన్నేళ్ళూ మా సంఘానికి ఎందరో సాయం చేశారు. ఇప్పుడు కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. ‘‘మా బడికి రండి, మా కార్యక్రమాలను పరిశీలించండి. ఇక్కడి అవసరాలేమిటో గమనించండి’ అంటూ వారిని ఆహ్వానిస్తున్నాం.

మా సామర్థ్యాన్ని గుర్తించండి...

నా వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఈ పనుల్లో బిజీగా ఉంటూనే చదువు కొనసాగించాను. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఎమ్మెస్సీ బోటనీ... తరువాత ఎంఇడి, బయో-ఇన్ఫర్మేటిక్స్‌లో పిజీ డిప్లమా, పిహెచ్‌డి చేశాను. కొన్నాళ్ళు బోటనీ టీచర్‌గా పనిచేసి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరాను. చదువు, ఉద్యోగం ఉన్నా నేను అనేక సందర్భాల్లో వివక్ష ఎదుర్కొన్నాను. మన దేశంలో... వైకల్యాన్ని ధ్రువీకరించే సర్టిఫికెట్‌ పొందడం, వికలాంగులకు ఉద్దేశించిన పథకాల ద్వారా లబ్ధి పొందడం ఎంతో కష్టమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఈసడింపులు, వెక్కిరింపులు ప్రతి రోజూ కనిపిస్తాయి. ‘మా వైకల్యాన్ని చూసి కాదు, మా సామర్థ్యాన్ని చూసి గుర్తించండి’ అని కోరుతున్నాను. సమాజ దృక్పథంలో, అధికారుల వైఖరిలో మార్పు రావాలి. ప్రత్యేక అవసరాలున్న పిల్లల పాఠశాలలను ప్రభుత్వాలు ప్రతిచోటా ఏర్పాటు చేయాలి. ఉచిత విద్య, రవాణా సదుపాయాలు కల్పించాలి. వికలాంగులు గౌరవంగా జీవించేలా నెలవారీ పింఛన్ల మొత్తాన్ని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచాలి. గృహాల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవన్నీ మా కలలు. అవి నెరవేరడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తాను.’’

Updated Date - 2023-11-29T00:00:22+05:30 IST