దాంపత్య జీవితం ఆనందమయం

ABN , First Publish Date - 2023-02-23T10:57:44+05:30 IST

పూర్వానుభవం ఉంటేనే దాంపత్య జీవితాన్ని సంపూర్తిగా ఆస్వాదించవచ్చని అంటూ ఉంటారు. కానీ మా ఇద్దరికీ

దాంపత్య జీవితం ఆనందమయం

పూర్వానుభవం ఉంటేనే దాంపత్య జీవితాన్ని సంపూర్తిగా ఆస్వాదించవచ్చని అంటూ ఉంటారు. కానీ మా ఇద్దరికీ అలాంటి అనుభవాలు లేవు. కొత్తగా పెళ్లై కాపురం మొదలుపెట్టాం. ఎలాంటి లోటు లేకుండా దాంపత్య జీవితాన్ని సంతృప్తికరంగా ఆనందించడానికి ఏమైనా మార్గాలున్నాయా? అసలు కొత్త దంపతులు దాంపత్య జీవితంలో ఎలా మసలుకోవాలి?

- ఓ సోదరి, వరంగల్‌

దంపతులు శారీరకంగా దగ్గరవటానికి ముందు మానసికంగా చేరువవ్వాలి. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. ఎదుటి వ్యక్తి ఆనందానికి ప్రాధాన్యమివ్వాలి. ఇలాంటి అంశాలన్నీ ఉన్న దాంపత్యం కచ్చితంగా ఆనందమయమవుతుంది. దాంపత్య జీవితం సంతృప్తికరంగా సాగటానికి తోడ్పడే అంశాలు మరికొన్ని ఉన్నాయి. అవేంటంటే...

వాస్తవిక అంచనాలు: పెళ్లికి ముందు దాంపత్య జీవితం గురించి ఎన్నో కలలు క ంటాం. ఇతరుల అనుభవాల ఆధారంగా ఏదేదో ఊహించుకుంటాం. దాంతో పెళ్లయ్యాక వాస్తవం ఊహకు ఏ కాస్త దగ్గరగా లేకపోయినా అసంతృప్తికి లోనవుతాం. కానీ లైంగిక విషయాల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి. వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తూ జీవితంలో సెక్స్‌ ఓ భాగం మాత్రమేననే నిజాన్ని గ్రహించాలి.

నిదానమే ప్రధానం: తక్కువ సమయంలో ఎక్కువ తెలుసుకోవాలనే తత్వం దాంతప్య జీవితంలో పనికిరాదు. ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకుని మసలుకోవటానికి సమయం పడుతుంది. ఇదంతా నెమ్మదిగా జరిగే చర్య. లైంగికోద్రేకానికి గురయ్యే చర్యలు, మార్గాల మీద అవగాహన ఏర్పరుచుకోవాలి. ఈ విషయంలో ఒకర్నొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇందుకోసం శరీరాలు, అవి స్పందించే తీరుల్ని ఇద్దరూ తెలుసుకోవాలి.

ఎదుటి వారి తృప్తి మీదే దృష్టి: యాంత్రికంగా మసలుకోకుండా ఎదుటి వ్యక్తి సంతృప్తే ప్రధానంగా మసలుకోగలిగితే దంపతులిద్దరూ సమంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒకరి ఆనందం మీద మరొకరు దృష్టి పెడితే మనసులోని అర్థం లేని భయాలు పటాపంచలవుతాయి. ఆత్మవిశ్వాసంతో మెలగగలుగుతారు. ఫలితంగా మీ ప్రతి చర్యా జీవిత భాగస్వామి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

డాక్టర్‌. షర్మిల మజుందార్‌

కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌, హైదరాబాద్‌.

www.doctorsharmila.in

Updated Date - 2023-02-23T10:57:50+05:30 IST