Buddha: దాస్యవృత్తి నుంచి సన్యాసిగా...

ABN , First Publish Date - 2023-09-07T23:30:19+05:30 IST

బుద్ధుడి కాలానికి మన భారతావనిలో ఎంతోమంది తాత్త్వికులు ఉండేవారు. వారిలో మనకు తెలిసినవారు చాలా కొద్దిమందే. ఇక్కడ జన్మించిన ఎన్నో సిద్ధాంతాలు, సంప్రదాయాలు ఆనవాళ్ళైనా లేకుండా అంతరించిపోయాయి.

Buddha: దాస్యవృత్తి నుంచి సన్యాసిగా...

ధర్మపథం

బుద్ధుడి కాలానికి మన భారతావనిలో ఎంతోమంది తాత్త్వికులు ఉండేవారు. వారిలో మనకు తెలిసినవారు చాలా కొద్దిమందే. ఇక్కడ జన్మించిన ఎన్నో సిద్ధాంతాలు, సంప్రదాయాలు ఆనవాళ్ళైనా లేకుండా అంతరించిపోయాయి. వాటి అనంతమైన సాహిత్యం కాలగర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో కొందరు కర్మే ప్రధానమైనదని అనేవారు. మరికొందరు అకర్మణ్యతను బోధించేవారు. అకర్మణ్యత అంటే దైవం వల్లనే అంతా జరుగుతుందని వారి భావం. కానీ బుద్ధుడు కర్మాచరణకే ప్రాధాన్యాన్ని ఇచ్చాడు.

ఆనాటి దైవవాదులలో మక్ఖలి గోసాలుడు ప్రముఖుడు. బుద్ధుడికి సమకాలికులైన తీర్థంకరులలో ప్రసిద్ధుడు. అతని పేరు మక్ఖలి. అతను జన్మించిన చోటు గోశాల. అలా అతని పేరు మక్ఖలి గోసాలునిగా ప్రసిద్ధి గాంచింది. అతని పేరు జైన సాహిత్యంలో కూడా కనిపిస్తుంది. ‘ఉవాసగ దసా ఓ’, ‘భగవతీ సూత్రం’ లాంటి ప్రాకృత గ్రంథాలలో అతను మహా వీరుడి శిష్యుడని ఉంది. ఆ తరువాత అతనికి అజీవక సంప్రదాయంతో సంబంధం ఏర్పడింది.

గోసాలుడు మొదట్లో సామాన్యమైన వ్యక్తి. ఆ తరువాత సన్యసించాడు. గోసాలుడు సన్యసించిన ఘట్టం వెనుక ఒక కథ ఉంది. అతను సన్యాసి కాకమునుపు దాసుడు. అంటే దాస్యవృత్తిలో... ఇతరుల దగ్గర పని చేసేవాడు. ఒకసారి గోసాలునికి అతని యజమాని ఒక నూనె కుండను ఇచ్చి, నూనె తొణికి కింద పడకుండా సురక్షితంగా ఇంటికి చేర్చమన్నాడు. గోసాలుడు వెడుతున్నప్పుడు, మార్గమధ్యంలో అసావధాన చిత్తం వల్ల ఆ నూనె కుండ కింద పడిపోయింది. నూనె వ్యర్థమైపోయింది. యజమాని దండిస్తాడనే భయంతో అతను అక్కణ్ణించి పారిపోయాడు. యజమాని అతణ్ణి వెతికి పట్టుకొని చితకబాదాడు. గోసాలుడు చాలా బాధపడ్డాడు. పిచ్చివాడిలా తిరగసాగాడు. తన దుస్తులను కూడా విడిచిపెట్టి, దిగంబరంగా తిరుగుతూ ఒక గ్రామంలోకి ప్రవేశించాడు. గ్రామస్తులు అతణ్ణి మహాపురుషుడిగా భావించారు. భయభక్తులతో సత్కరించారు. ఎంతో వైరాగ్యం ఉంటే తప్ప అలా దిగంబరంగా తిరగడం సాధ్యపడదంటూ... గోసాలుణ్ణి అనేక రకాలుగా గౌరవించారు. వారి ఆదరణ చూసి అతను ఆశ్చర్యపోయాడు. ‘తీర్థంకరుడి వేషంలో ఉంటేనే ఇంత ఆదరణ లభిస్తే... నిజంగా సన్యసిస్తే ఎలా ఉంటుంది? ప్రజల ఆదరాభిమానాలు మరింత ఎక్కువగా దొరుకుతాయి’ అనుకున్నాడు. సన్యాస దీక్షను స్వీకరించాడు. ఎంతో సాధన చేసి, బుద్ధి వికాసాన్ని పొందగలిగాడు. పెద్ద భక్త సముదాయానికి గురువయ్యాడు. క్రమంగా... అపారమైన జ్ఞానాన్ని ఆర్జించి, ఆచార్యుడై, లోకంలో యశస్సును సంపాదించాడు. ఆనాటి సమాజంలో తీర్థంకరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇవన్నీ కథలు కావు. మనం చేజార్చుకున్న ఇతిహాసం. ఆ రోజుల్లో అతనొక అనుభవజ్ఞుడు, వయోవృద్ధుడు అయి మేధావి అని పాళీ సాహిత్యం పేర్కొంది.

300.jpg

-ఆచార్య చౌడూరి ఉపేంద్ర రావు

జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, 9818969756

Updated Date - 2023-09-07T23:47:54+05:30 IST