Muharram: కర్బలా యుద్ధం... ధర్మం కోసం త్యాగం

ABN , First Publish Date - 2023-07-28T04:05:48+05:30 IST

ఇస్లామీయ సంవత్సరం ముహర్రం లేదా మొహర్రంతోనే ప్రారంభమవుతుంది. ఏడాదిలోని మొదటి నెల ముహర్రం కాగా, జిల్‌ హజ్జ చివరి మాసం. ముహర్రం పేరు వినగానే జ్ఞాపకం వచ్చే మొదటి చారిత్రక సంఘటన...

 Muharram: కర్బలా యుద్ధం...  ధర్మం కోసం త్యాగం

సందేశం

ఇస్లామీయ సంవత్సరం ముహర్రం లేదా మొహర్రంతోనే ప్రారంభమవుతుంది. ఏడాదిలోని మొదటి నెల ముహర్రం కాగా, జిల్‌ హజ్జ చివరి మాసం. ముహర్రం పేరు వినగానే జ్ఞాపకం వచ్చే మొదటి చారిత్రక సంఘటన... కర్బలా మైదానంలో జరిగిన అపూర్వ సంగ్రామం. ఆ సంఘటన అద్వితీయమైనది. ఖిలాఫత్‌ వ్యవస్థను సుస్థిరంగా ఉంచడానికి ఇమామ్‌ హుసేన్‌ చేసిన మహత్తరమైన త్యాగానికి అది చిహ్నం.

రాజకీయపరంగా ఇస్లాం ధర్మంలో ఖలీఫా వ్యవస్థ ఉంది, కానీ రాచరిక వ్యవస్థ లేదు. రాజు కుమారుడు రాజు కావడం, మంత్రి కుమారుడు మంత్రి కావడం అనే అనువంశిక వ్యవస్థ అసలే లేదు. ఖలీఫా ఎన్నిక మూడు సూత్రాల ప్రకారం... ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతుంది. మొదటిది... మహా ప్రవక్త పాటించిన విధంగా... ఎవరినీ ఖలీఫాగా నియమించకూడదు. ప్రజలే ఎన్నుకోవాలి. రెండవది... మొదటి ఖలీఫా హజ్రత్‌ అబూబకర్‌ చేసినట్టు... తమతో ఎలాంటి సంబంధమూ లేని వ్యక్తిని ఖలీఫాగా సూచించవచ్చు. మూడోది... రెండో ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ మాదిరిగా ఖలీఫా ఎన్నికను మేధావులతో కూడిన సలహా సంఘానికి అప్పగించవచ్చు. వారు తమ నుంచి ఒకరిని ఖలీఫాగా ఎన్నుకుంటారు. కానీ హజ్రత్‌ మావియా తన కుమారుడైన యజీద్‌కు యువరాజ పట్టాభిషేకం చేసి, పై మూడు ధర్మ సూత్రాలనూ కాలరాశారు. అప్పటి నుంచే రాచరిక వ్యవస్థ మొదలయింది.

మహా ప్రవక్త మహమ్మద్‌ దివంగతులైన తరువాత... హజ్రత్‌ అబూబకర్‌, హజ్రత్‌ ఉమర్‌, హజ్రత్‌ ఉస్మాన్‌, నాలుగో ఖలీఫాగా హజ్రత్‌ అలీ ఎన్నికయ్యారు. ఆ తరువాత హజ్రత్‌ మావియా ఖలీఫా అయ్యారు. అరేబియా దేశాన్ని పంతొమ్మిది సంవత్సరాలు పాలించారు. కానీ పుత్ర ప్రేమతో... అయోగ్యుడైన, దురలవాట్లకు లోనైన తన కుమారుడు యజీద్‌ను యువరాజుగా నియమించారు. యజీద్‌ ఎన్నిక ఇస్లాం ధర్మసూత్రాలకు పూర్తిగా వ్యతిరేకం. అది అనువంశిక వ్యవస్థే తప్ప ప్రజాస్వామిక వ్యవస్థ ఎంతమాత్రం కాదు. అందుకే దీన్ని ఇమామ్‌ హుసేన్‌, దైవ ప్రవక్త అనుచరులు బాహాటంగా వ్యతిరేకించారు. యజీద్‌ను రాజుగా ఒప్పుకొనేది లేదని తిరుగుబాటు చేశారు. అదే సమయంలో... ఇమామ్‌ హుసేన్‌ తమ దగ్గరకు రావాలనీ, ఆయనను ఖలీఫాగా గుర్తిస్తామనీ కూఫా నగర ప్రజలు అసంఖ్యాకంగా ఆయనకు సందేశాలు పంపారు. సత్యం కోసం, న్యాయం కోసం ప్రజలు సముద్ర తరంగాల్లా ఉవ్వెత్తున లేచారు. ప్రజల తరఫున... యజీద్‌తో ముఖాముఖి చర్చలు జరపడం కోసం మక్కా పట్టణం నుంచి ఇమామ్‌ హుసేన్‌ తన 72 మంది ప్రత్యక్ష సహచరులతో, కుటుంబ సభ్యులతో బయలుదేరారు. వారు కూఫా నగరానికి చేరకముందే... తన ప్రభుత్వాన్ని ఇమామ్‌ హుసేన్‌ గుర్తించేలా చెయ్యడానికి యజీద్‌ కుట్రలు పన్నాడు. కానీ యజీద్‌ను రాజుగా గుర్తించడానికి ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. తనలో ప్రాణం ఉన్నంత వరకూ అధర్మంతో పోరాడుతూనే ఉంటాననీ, యజీద్‌ ముందు తలవంచేది లేదనీ ఆయన బాహాటంగా ప్రమాణం చేశారు. దాని ఫలితమే కర్బలా పోరాటం.

ఇమామ్‌ హుసేన్‌ ప్రదర్శించిన ధిక్కారానికీ, తిరుగుబాటు ధోరణికీ యజీద్‌ ఆగ్రహించాడు. హుసేన్‌ను, ఆయన పరివారాన్నీ కర్బలా అనే ప్రదేశంలో యజీద్‌ సైన్యం అటకాయించింది. నీటిబొట్టు కూడా వారికి అందకుండా ఫరాత్‌ నదీ తీరంలో గట్టి బందోబస్తు చేసింది. ఇరు పక్షాల మధ్యా భయంకరమైన యుద్ధం జరిగింది. నాలుగువేల మందికి పైగా శత్రువులతో తలపడిన ఇమామ్‌ హుసేన్‌ సైన్యంలో చాలామంది అమరులయ్యారు. ఆ అమర వీరుల రక్తంతో కర్బలా మైదానం తడిసిపోయింది. చివరకు ఇమామ్‌ హుసేన్‌ ఒంటరిగా యుద్ధమైదానంలో మిగిలిపోయారు. దప్పికకు తట్టుకోలేక... శత్రు మూకను చెండాడుతూ ఫరాత్‌ నది వైపు నీటి కోసం వెళ్ళారు.

ఇతలో మహిళలు, పిల్లలు ఉన్న గుడారాలకు నిప్పు పెట్టారనే వదంతి రావడంతో... దప్పిక తీర్చుకోకుండానే వెనుతిరిగారు. అయితే గుడారాలకు నిప్పు పెట్టలేదు కానీ, తన కుమారుడు అలీ అస్గర్‌ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసింది. ఆ పసిబాలుణ్ణి చేతుల్లో ఎత్తుకొని... అతని కోసం గుక్కెడు నీళ్ళయినా ఇవ్వాల్సిందిగా శత్రు సైనికులను అభ్యర్థించారు. కానీ పాషాణ హృదయులైన ఆ సైనికులు... ఆ పసిబాలుడి మీద బాణాల వర్షం కురిపించారు. ఒక బాణం ఆ పసికందు కొందులో దిగి రక్తం చిమ్మింది. ఇది చూసి ఆగ్రహించిన ఇమామ్‌ హుసేన్‌... శత్రుసైన్యం మీద విరుచుకుపడ్డారు. ఆ రోజు శుక్రవారం జుమా నమాజ్‌ చేయాల్సి ఉంది. ఆయనను హతమార్చడానికి శత్రు సైనికులు చుట్టూ కమ్ముకొని ఉన్నారు. అయినా ఆయన నమాజ్‌ను వదిలిపెట్టలేదు. సజ్దా చేయడానికి తన శిరస్సును ఆయన నేల మీద పెట్టగానే... శత్రు సైనికులు దాడి చేశారు. ఆయన తలను, చేతులను ఖండించారు. వాటిని బల్లేలకూ, బరిసెలకూ తగిలించి గంతులు వేశారు. ఆ విధంగా ఇమామ్‌ హుసేన్‌ ధర్మ సంరక్షణ కోసం చివరి వరకూ పోరాడి... అమరుడయ్యారు. కర్బలా యుద్ధం, ఇమామ్‌ హుసేన్‌ త్యాగం చరిత్రలో కలకాలం నిలిచిపోయే ఘట్టాలు.

ముహర్రం మాసంలో సంభవించిన చారిత్రకమైన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ మాసంలోని పదవ రోజున ప్రథమ దైవ ప్రవక్త స్వర్గంలో ప్రవేశించారు. దైవ ప్రవక్త హజ్రత్‌నూ, ఆయన అనుచరులను అల్లాహ్‌ నావలో రక్షించి, దుష్టులను శిక్షించినది ఆరోజే. అదే విధంగా దుర్మార్గుడైన రాజు వల్ల అగ్నిగుండంలో పడిన ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీంను కాపాడిందీ, ఫిరౌన్‌ రాజునూ, అతని లక్షలాది సైన్యాన్ని సముద్రంలో ముంచి... దైవప్రవక్త ముసానూ, ఆయన అనుచరుల్నీ రక్షించినది కూడా ఈ రోజే. అలాగే అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్‌ మనుమడైన ఇమామ్‌ హుసేన్‌ కూడా ఈ మాసంలోని పదో రోజున ప్రాణ త్యాగం చేశారు. అందుకే ఈ మాసానికి ఇంత ప్రాధాన్యత, ఎనలేని గౌరవం ఉన్నాయి.

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2023-07-28T04:05:48+05:30 IST