Sri Mataji Nirmala Devi: లక్ష్మి... సృష్టి పరిణామ శక్తి

ABN , First Publish Date - 2023-09-07T23:42:29+05:30 IST

శ్రీ మహాలక్ష్మీదేవి మహాత్మ్యం గురించి, శక్తుల గురించి ఎన్నో గ్రంథాలు మనకు వివరంగా చెబుతున్నాయి. లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఆమె లక్షణాలను, గుణగణాలను మనలో స్థిరపరచుకోవాలి.

Sri Mataji Nirmala Devi: లక్ష్మి...  సృష్టి పరిణామ శక్తి

సహజయోగం

శ్రీ మహాలక్ష్మీదేవి మహాత్మ్యం గురించి, శక్తుల గురించి ఎన్నో గ్రంథాలు మనకు వివరంగా చెబుతున్నాయి. లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఆమె లక్షణాలను, గుణగణాలను మనలో స్థిరపరచుకోవాలి. మనలోని నిద్రాణంగా స్థితిలో ఉన్న కుండలినీ శక్తిని ఉత్థానం చేసుకొని, ఆత్మాసాక్షాత్కారం పొందినప్పుడే అది సాధ్యమవుతుంది. మహాలక్ష్మీ శక్తి వల్లనే కుండలినీ శక్తి సుషుమ్న మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఆమె శక్తి ద్వారానే ఈ సృష్టి పరిణామక్రియ జరిగింది. మనల్ని ధర్మ మార్గంలో నిలిపేది ఆ శక్తే. మానవుల్లో క్షమాగుణం, దయార్ద్రహృదయం, ఇతరులకు సాయపడాలనే కోరిక, ప్రతిఫలాపేక్ష ఆశించకుండా పని చెయ్యడం, ఆనందంగా ఉండడం, ఇతరులకు ఆనందం కలుగజేయడం... ఈ లక్షణాలు మనలోని మహాలక్ష్మీ తత్త్వం ఉన్నప్పుడే కలుగుతాయి. దీనికోసం మనలో అంతర్గతమైన మహాలక్ష్మీ తత్త్వం తాలూకు సమతుల్య స్థితిని స్థిరపరచుకోవాలి. మన చిత్తం ఎల్లప్పడూ ధర్మం మీదే ఉండాలి

మహాలక్ష్మికి వివిధ తత్త్వాలు అంటే స్వరూపాలు ఉన్నాయి. అవి:

ఆద్యాలక్ష్మి: అంటే ప్రప్రథమమైన లక్ష్మి. ఆది లక్ష్మి. పాలసముద్రంలోంచి జన్మించినది ఆమే. నీరు మనల్ని శుభ్రం చేసి మెరిసేలా చేసినట్టు... ఈ తత్త్వం మనల్ని పరిశుద్ధంగా మారుస్తుంది.

విద్యాలక్ష్మి: భగవంతుడి గొప్పతనాన్ని మనకు తెలియజేసేది విద్యాలక్ష్మీ శక్తే. మనలోని శక్తుల్ని భక్తితో, శ్రద్ధతో, కరుణతో ఎలా ఉపయోగించుకోవాలో నేర్పుతుంది.

సౌభాగ్య లక్ష్మి: మనకు సౌభాగ్యాన్నీ, అదృష్టాన్నీ కలుగజేస్తుంది. సౌభాగ్యం అంటే ధనం కాదు. కొందరికి అంతులేని ధనం ఉంటుంది. కొన్నిరోజులకు ఏదో విధంగా కరిగిపోతుంది. వారి ముఖంలో తేజస్సు కనిపించదు. సౌభాగ్యం ఎన్నో విధాలుగా ఉంటుంది. అది సుఖమయమైన జీవితం కావచ్చు, సంతృప్తికరమైన ఆహారం కావచ్చు. సంతోషం కలిగించేదే సౌభాగ్యం.

అమృత లక్ష్మి: ‘అమృతం’ అంటే మరణం లేనిది. సాధారణంగా లక్ష్మీదేవిని మనం సంపదగా పరిగణిస్తాం. అయితే మనకున్న సంపద ఏమిటి? అదే ఆత్మ. దానికి మరణం లేదు. ఆత్మ తాలూకు ప్రకాశమే అమృత లక్ష్మి. ఆమే మనకు శాశ్వతత్వాన్ని అనుగ్రహిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం పొంది, దాన్ని అనుభూతి చెందుతున్నవారు... ఇతరులకు పంచే చైతన్య తరంగాలు (వైబ్రేషన్స్‌) అద్భుతమైనవి. ఆ తరంగాలకు మరణం లేదు. ఇదంతా అమృత లక్ష్మి ఆశీస్సే.

గృహలక్ష్మి: మానవ పరిణామక్రమంలో కుటుంబ వ్యవస్థ ఏర్పాటు ఒక ప్రధాన ఘట్టం. ఆ వ్యవస్థలో గృహలక్ష్మీ తత్త్వం రూపుదిద్దుకుంది. ఈ పరిణామక్రమంలో మనం అభివృద్ధి చెందుతూ ఇల్లు, కుటుంబం, వ్యక్తిగత జీవితం లాంటివి సమకూర్చుకున్నాం. ఆ తరువాతనే సామూహిక జీవనం అలవరచుకున్నాం. ఇదే మనలోని గృహలక్ష్మీ తత్త్వం. ఇంటి ఇల్లాలే మన గృహలక్ష్మి. ఇంటికి ఆమె దేవత. ఆమె గృహలక్ష్మీ తత్త్వంతో మమేకం అయినప్పుడు... లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఆమె ఆశీస్సులతో శాంతి, సాంత్వన లభిస్తాయి. గృహిణులు హుందాతనంగా, గౌరవప్రదంగా మనసులుకోవడం వల్లనే ఇది సాధ్యమవుతుంది.

రాజ్యలక్ష్మి: మీరు సామూహికతలో ఆనందిస్తూ ఎదగడానికి రాజ్యలక్ష్మి ఆశీస్సులు అవసరం. మీ ఆర్థిక, కుటుంబపరమైన అంశాలను ఆమె పర్యవేక్షిస్తుంది. ఈ తత్త్వం కార్యశీలత ద్వారా సంక్రమిస్తుంది. బద్ధకంగా ఉన్న వారి దగ్గర రాజ్యలక్ష్మి నిలబడదు. కాబట్టి ఇతరులను గౌరవించాలి, ఇతరులనుంచి గౌరవం పొందేలా నడచుకోవాలి.

సత్యలక్ష్మి: సత్యం గురించి మనకు అవగాహన కల్పించేది సత్యలక్ష్మి. ఆధ్యాత్మికంగా మనం ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు... మనం భగవంతుడి పరికరాలమనే సత్యం తెలుస్తుంది. భగవంతుడి శక్తి మన ద్వారానే పని చేస్తుందనేది సత్యం. మనం కేవలం ఆత్మ మాత్రమే అనే సత్యాన్ని ఈ సత్యలక్ష్మీతత్త్వం ద్వారానే తెలుసుకుంటాం.

యోగలక్ష్మి: మనం యోగస్థితిని పొందినప్పుడు చేరుకొనే ఉన్నత స్థాయిలో... అలౌకికమైన అనుభూతిని ప్రసాదించేది యోగలక్ష్మీ శక్తి. యోగికి తేజస్సును ఈ శక్తి అనుగ్రహిస్తుంది. ఈ శక్తిని పొందినవారు ఎవరితోనూ వాదులాడడం, పోట్లాడడం లాంటివి జరగవు.

సృష్టి పరిణామక్రమానికి ప్రతీక లక్ష్మీదేవి అని మనం గ్రహించాలి. ఆమె ప్రసాదించిన పరిణామ శక్తి వల్లనే మనం సృష్టిక్రమంలో అట్టగుడు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి చేరుకున్నాం. లక్ష్మీదేవి అమృత మధన సమయంలో సముద్రం నుంచి ఉద్భవించింది. ఇది మానవులలోని అన్వేషణా తత్త్వానికి పునాది. ఈ అన్వేషణ సాగరం నుంచే మొదలైంది. ఎందుకంటే... మొదటి ప్రాణి సృష్టి సముద్రంలోనే జరిగింది. మొదటి అన్వేషణ... ఆహారం కోసం అక్కడే మొదలైంది. గృహలక్ష్మీతత్త్వం, రాజ్యలక్ష్మీతత్త్వం అక్కడే ప్రారంభమయ్యాయి. మనలో దుష్టశక్తులు, దుర్వ్యసనాలు, ఛాందస భావాలు, పరధర్మాల మీద ద్వేషం లాంటి లక్షణాలు ప్రవేశిస్తే... లక్ష్మి అక్కడ ఉండదు. లక్ష్మిని కేవలం ఐశ్వర్య చిహ్నంగా, ధనానికి ప్రతీకగా అపార్థం చేసుకోకూడదు. లక్ష్మీదేవి ఆమె ఒక చేత్తో అనుగ్రహిస్తుంది. మరొక చేత్తో తనను ఆరాధించేవారికి అభయం ఇచ్చి రక్షణ కల్పిస్తుంది. ప్రతిఒక్కరు సంతృప్తిగా ఉండడమే లక్ష్మీ తత్వం. అది మీలో ఆధ్యాత్మిక అన్వేషణను ప్రేరేపిస్తుంది.

400-1.jpg

-(శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)

Updated Date - 2023-09-07T23:48:09+05:30 IST