Sri Sri Ravi Shankar: మన జీవితం ఒక ఆనందోత్సవం

ABN , First Publish Date - 2023-07-28T04:10:15+05:30 IST

భారతీయ ఆధ్యాత్మికతను, ధ్యాన ప్రక్రియలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చిన వారిలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌(Sri Sri Ravi Shankar) ప్రథమ స్థానంలో ఉంటారు. ఆగస్టులో వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌ ఎదురుగా నిర్వహించబోయే ‘ప్రపంచ సంస్కృతి సమ్మేళనం’ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు అమెరికా వచ్చిన రవిశంకర్‌ ‘నివేదన’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

Sri Sri Ravi Shankar: మన జీవితం ఒక ఆనందోత్సవం

భారతీయ ఆధ్యాత్మికతను, ధ్యాన ప్రక్రియలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చిన వారిలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌(Sri Sri Ravi Shankar) ప్రథమ స్థానంలో ఉంటారు. ఆగస్టులో వాషింగ్టన్‌ డీసీ(Washington DC)లోని వైట్‌హౌస్‌(White House) ఎదురుగా నిర్వహించబోయే ‘ప్రపంచ సంస్కృతి సమ్మేళనం’ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు అమెరికా వచ్చిన రవిశంకర్‌ ‘నివేదన’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

మన చుట్టూ అవిశ్వాసం, గొడవలు, ఒత్తిడి... ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తొలగించాలంటే- అందరూ కలిసి ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల అవిశ్వాసం తొలగిపోతుంది. జీవితం ఆనందకరంగా మారుతుంది.

ఇక్కడ మీరు అనేకమంది తెలుగు యువతీ, యువకులను కలుస్తున్నారు కదా... వారిపై మీ అభిప్రాయమేమిటి?

ముందుగా తెలుగు ప్రజలందరికీ నా శుభాభినందనలు. ఆశీస్సులు. ఈ ప్రపంచానికి తెలుగు ప్రజలు చేస్తున్న సేవను తప్పనిసరిగా గుర్తించాలి, ప్రశంసించాలి. ఉదాహరణకు అమెరికానే తీసుకోండి.... డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, న్యాయవాదులుగా, వాణిజ్యవేత్తలుగా వారు గణనీయమైన పాత్రను పోషిస్తున్నారు. వారిని కలవటం చాలా సంతోషంగా ఉంది.

భారతీయ సంస్కృతి పరిరక్షణలో తెలుగు యువత ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఎలాంటి పాత్ర పోషించాలి?

ఇక్కడ ప్రజలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల శ్రద్ధ ఎక్కువ. అయితే ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. వీరు మరింత చురుకుగా ఉండాలంటే- ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు నేర్చుకోవాలి. దైనందిక ఒత్తిడి నుంచి బయటకు రావాలి. అదే సమయంలో భారతదేశంలో ఉన్న వారి మూలాలను మరింత బలోపేతం చేసుకోవాలి. వీటన్నింటినీ ప్రోత్సహించటానికే ఆగస్టు 10వ తేదీన ‘ప్రపంచ సంస్కృతి సమ్మేళనా’న్ని వాషింగ్టన్‌ డీసీలో భారీగా నిర్వహిస్తున్నాం. ఇది అమెరికాలో జరిగే అతి పెద్ద సంస్కృతి ఉత్సవం అవుతుంది.

దీని గురించి మరింత వివరిస్తారా?

మన జీవితం ఒక పెద్ద ఆనందోత్సవం. ఒత్తిడిని వదిలేసి.. అందరూ కలిసి.. ఆనందంగా.. వైభవంగా బతకడమే నిజమైన జీవితం. నిజమైన సంస్కృతి, సంప్రదాయాలంటే అవే! గతంలో ఈ తరహా ఉత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించాం. కొన్ని లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు అమెరికాలో నిర్వహిస్తున్నాం. దీనిలో మన దేశానికి చెందిన అనేక మంది కళాకారులు పాల్గొంటున్నారు. కూచిపూడి, భరతనాట్యం, నాదస్వరం- ఇలా ఒకటేమిటి- రకరకాల సంప్రదాయాలు, సంస్కృతుల సమ్మేళనమిది.


ఆధునిక యువతకు మన సంస్కృతిని ఎలా చెప్పాలి? దీనిని ఒక సంప్రదాయమని చెప్పాలా? సైన్స్‌ అని చెప్పాలా?

ఒక కోణం నుంచి సంప్రదాయం. మరొక కోణం నుంచి అది సైన్స్‌. ఆధ్యాత్మికత ఏది చెబుతుందో- సైన్స్‌ కూడా అదే చెబుతుంది. గత ఏడాది నోబెల్‌ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు- ఈ విశ్వాన్ని ఒక స్వప్నంగా అభివర్ణించారు. శంకరాచార్యులవారు కూడా అదే చెప్పారు కదా! చాలాసార్లు- చాలామంది- ‘ఈ రెండిటిని ఎలా కలపాలి?’ అని అడుగుతూ ఉంటారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటే కదా... ‘కలపడం’ అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది... ఈ రెండూ కలిసే ప్రయాణిస్తున్నాయి.

ఆధ్యాత్మికత, సైన్స్‌- ఒకే తానులో ముక్కలని ఎలా చెప్పగలుగుతాం...?

సైన్స్‌ భౌతికమైన అంశాల గురించి చెబుతుంది. ఆధ్యాత్మికత అభౌతిక అంశాలపై దృష్టి సారిస్తుంది. ఈ రెండింటి లక్ష్యం మానవుడి జీవనాన్ని ఆనందమయం చేయటమే! ఉదాహరణకు భౌతికశాస్త్రం- ఈ ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే మూలాల గురించి, ధాతువుల గురించి తెలుసుకోవాలంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వ్యక్తి- మొదట తత్త్వజ్ఞానం తెలుసుకోవాలి. తత్త్వజ్ఞానమంటే- పృధ్వీ, జల, వాయు, ఆకాశ, అగ్నితత్త్వాల ఆనుపానులు తెలుసుకోవటం. ఆ తర్వాతే ఆత్మజ్ఞానం సాధ్యమవుతుంది. ఈ కోణం నుంచి చూస్తే ఈ రెండూ ఒకటే కదా..

ఈ మధ్యకాలంలో భారత్‌ను ‘విశ్వగురువు’గా అనేకమంది అభివర్ణిస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయమేమిటి?

కొన్ని వేల ఏళ్ల క్రితం భారత్‌ ప్రపంచానికి దారి చూపించింది. ఆ తర్వాత కాలంలో అనేక పరిస్థితుల వల్ల మనం ఆ స్థానం కోల్పోయి ఉండచ్చు. కానీ ప్రస్తుతం మనం ఆ స్థానాన్ని తిరిగి పొందటానికి ప్రయత్నిస్తున్నాం. యోగా, ఆధ్యాత్మిక, ఆయుర్వేద, టెక్నాలజీలలో ఇప్పటికే మనం ‘విశ్వగురు’ స్థానంలో ఉన్నాం. మిగిలిన రంగాల్లో కూడా మనకు అనేక అవకాశాలు ఉన్నాయి. మన వద్ద జనాభా ఎక్కువ. ప్రజలు కష్టపడి పనిచేస్తారు. దీనితో పాటుగా సంస్కృతి మూలాలు ఉన్నాయి. ఒక విశ్వగురు స్థానాన్ని చేరుకోవటానికి ఇంతకన్నా ఏమి కావాలి?

చివరిగా- ధ్యానం అనేది ఒక వ్యాపారవస్తువా? దానిని ఎలా చూడాలి?

యోగా, ధ్యానం అనేవి ప్రజల ప్రాథమిక హక్కులు. ఆహారం, నిద్ర, విద్య, ఆరోగ్యంలాంటివే ఇవి కూడా!

-సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2023-07-28T04:10:15+05:30 IST