Share News

Subbalakshmi @ 78 : సుబ్బలక్ష్మీ @ 78.. అన్‌స్టాపబుల్‌!

ABN , First Publish Date - 2023-11-28T23:57:32+05:30 IST

ఆరు పదులు దాటితే కొందరు జీవితానికి రాజీనామా ఇచ్చేసి.. మనమళ్లు, మనవరాళ్లను చూసుకుంటూ.. గతానుభవాలు నెమరువేసుకుంటూ బతకేస్తూ ఉంటారు.

Subbalakshmi @ 78 : సుబ్బలక్ష్మీ @ 78.. అన్‌స్టాపబుల్‌!

ఆరు పదులు దాటితే కొందరు జీవితానికి రాజీనామా ఇచ్చేసి.. మనమళ్లు, మనవరాళ్లను చూసుకుంటూ.. గతానుభవాలు నెమరువేసుకుంటూ బతకేస్తూ ఉంటారు. కానీ 78 ఏళ్ల అమలాపురపు వెంకట సుబ్బలక్ష్మి దీనికి పూర్తి భిన్నం. వయసు శరీరానికి మాత్రమే.. మనసుకు కాదంటారు ఆమె. కాలేజీలో ఉపాధ్యాయురాలిగా మూడున్నర దశాబ్దాలు పనిచేసిన సుబ్బలక్ష్మీ.. రిటైరైన తర్వాత క్రీడారంగంలోకి ప్రవేశించారు. స్విమ్మింగ్‌, రన్నింగ్‌, జావెలిన్‌ త్రో, డిస్కస్‌ త్రో లాంటి క్రీడల్లో పాల్గొని సుమారు 150 పతకాలు సాధించారు. 78 ఏళ్ల వయసులోనూ 18 ఏళ్ల అమ్మయిలా ఆలోచిస్తూ ఐయామ్‌ అన్‌స్టాపబుల్‌ అంటున్న బెజవాడ బామ్మ ‘నవ్య’తో పంచుకున్న విశేషాలు..

‘‘నేను పుట్టింది.. పెరిగింది పోలవరం. అక్కడే ఎస్‌ఎ్‌సఎల్‌సీ వరకు వరకు చదువుకున్నా. అమ్మ మంగమ్మ- స్కూలో టీచర్‌. నాన్న సూర్యనారాయణ- రైల్వే ఉద్యోగి. మాది సనాతన సంప్రదాయ కుటుంబం. నాన్నకు బాగా చదువుకొని.. పెద్ద ఉద్యోగం చేయాలని ఆశ ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నాన్న ఎస్‌ఎ్‌సఎల్‌సీతో ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రైల్వేలో చేరారు. తనలా తన పిల్లలు చదువు విషయంలో ఇబ్బంది పడకూడదని మమ్మల్ని బాగా చదివించారు. ఎస్‌ఎ్‌సఎల్‌సీలో ఉత్తీర్ణత సాధించాక మైసూరు రీజినల్‌ కళాశాలలో బీఎస్సీ-ఈడీ చేశా. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ బొటనీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరా. ఆ వెంటనే సత్యసూర్య అమ్మన్న శాస్త్రితో వివాహమైంది. ఆయన కూడా అధ్యాపకులే. పెళ్లి తర్వాత విజయవాడ రామకృష్ణాపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాం.

33 ఏళ్ల సర్వీసు... వంద శాతం ఉత్తీర్ణత

కావలి జవహర్‌ భారతి కళాశాలలో మొదలైన నా ఉద్యోగ ప్రస్థానం మచిలీపట్నంలోని శ్రీ పద్మావతి మహిళల హిందు కళాశాలలో బొటని విభాగాధిపతిగా పదవి విరమణ పొందా. నా 33 ఏళ్ల సర్వీసులో వేల మంది విద్యార్థులను పట్టభద్రులుగా తీర్చిదిద్దా. నేను పాఠాలు చెప్పిన అన్ని బ్యాచ్‌లు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా పరీక్షల్లో ఫెయిల్‌ కాలేదు. ముక్కు పిండి చదివించి విద్యార్థులకు రెండ్రోజులకో టెస్టు పెట్టేదాన్ని. వాళ్లు అప్పుడు నన్ను తిట్టుకున్నా..ఇప్పుడు జీవితంలో సంతోషంగా ఉన్నారు. నా పూర్వ విద్యార్థులు ఎప్పుడైనా తారసపడి వాళ్ల గురించి చెబుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది.

మనవడి సవాల్‌తో క్రీడల్లోకి...

మా అమ్మాయి సుచిత్రకు ఇద్దరు కొడుకులు. సెలవులకు వాళ్లు మా దగ్గరకు వచ్చినప్పుడు ఖాళీగా ఉంచడం ఎందుకని గాంధీనగర్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌కి తీసుకెళ్లి కోచ్‌ మాల్యాద్రి వద్ద శిక్షణ ఇప్పించేవాళ్లం. పెద్దోడు బాగానే సాధన చేసేవాడు కానీ, చిన్నోడు శ్రీవాత్సవ్‌ సరిగ్గా ప్రాక్టీసు చేయకుండా కాలక్షేపం చేసేవాడు. నేను స్విమ్మింగ్‌ పూల్‌ పైనుంచి వాడిపై కేకలు వేసేదాణ్ణి. ఒక రోజు వాడు అమ్మమ్మ పైనుంచి మాటలు చెప్పడం కాదు, పూల్‌లోకి వచ్చి నువ్వు ఈత కొట్టూ తెలుస్తుందని సవాల్‌ చేశాడు. వాడిని గాడిన పెట్టేందుకు ఆరోజు నేను పూల్‌లోకి దిగా. అలా వాడితో కలిసి సాధన ప్రారంభించా. సెలవులయ్యాక వాళ్లు వెళ్లిపోయినా కోచ్‌ మాల్యాద్రి, నా భర్త ప్రోత్సాహంతో పదేళ్ల కిందట స్విమ్మింగ్‌ చేయడం ప్రారంభించా. ఆరు నెలల్లోనూ మంచిగా ఈత కొట్టడం నేర్చుకున్నా. ఒక రోజు మా కోచ్‌ నా దగ్గరకొచ్చి అమ్మ మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో మీరు పాల్గొనండని సూచించాడు. పోటీల్లో పాల్గొనాలంటే సాధారణ ఫ్రీస్టయిల్‌ స్విమ్మింగ్‌ ఒక్కటొస్తే సరిపోదు. బటర్‌ఫ్లయ్‌, బ్యాక్‌ స్ట్రోక్‌, బ్రెస్ట్‌ స్ట్రోక్‌ ఇలా నాలుగైదు శైలిలు నేర్చుకోవాలి. ఏడాదిలో అవి కూడా నేర్చుకొని పోటీల బరిలోకి దిగా. తొలిసారి పాల్గొన్న రాష్ట్ర స్థాయి పోటీల్లోనే నాలుగు స్వర్ణాలు సాధించా. మా వారు చాలా సంతోషించారు.

కృష్ణా నది మూడుసార్లు ఈదా...

ఇప్పటివరకు 40కి పైగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో దాదాపు 150 పతకాలు సాధించా. ఇందులో 120 వరకు పసిడి పతకాలే! వీటిలో అథ్లెటిక్స్‌లో 60 మెడల్స్‌ నెగ్గాను. దక్షిణకొరియాతో పాటు ఐదు దేశాల్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తెలుగు మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించా. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా.. పోటీల సమయంలో ఒక్కోసారి ఆరోగ్యం సహకరించకపోయినా.. దేశం, రాష్ట్రం పరువు ఏమవుతుందనే ఆలోచనతో మొండిగా పోటీల్లో పాల్గొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక విజయవాడలో 1.6 కిలోమీటర్ల దూరం గల కృష్ణా నదిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు మూడుసార్లు (2019, 2021, 2022లో) దిగ్విజయంగా ఈదా. తొలిసారి నేను కృష్ణా నది ఈదుతా అన్నప్పుడు, మావారు అంత దూరం ఎలా ఈదుతావని కంగారు పడ్డారు. అవతలి ఒడ్డు వరకు వస్తానో? లేనో? అని కంగారు పడ్డారు. నేను మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా చక్కగా ఈదుకుంటూ వచ్చేసరికి ఆయన ముఖంలో పట్టలేనంతా సంతోషం చూశా.

నచ్చితే ఏదైనా చేసేస్తా...

నాకు నచ్చితే, చేయాలనుకుంది ఏదైనా చేసేస్తా. కొవిడ్‌కు ముందు స్విమ్మింగ్‌ ఒక్కటే చేసేదాణ్ణి. కొవిడ్‌ సమయంలో స్విమ్మింగ్‌ పూల్‌ మూసేయడంతో అప్పటివరకు రోజుకి గంటలు గంటలు ఈది, ఒక్కసారి ఆపేసరికి కాళ్లు, చేతులు పట్టేసినట్టు అనిపించింది. దీంతో ఇంటి సమీపంలోని పార్క్‌లో పరిగెత్తడం ప్రారంభించా. అలా అథ్లెటిక్స్‌లో ప్రవేశించా. రన్నింగ్‌, డిస్క్‌సత్రో, ట్రిపుల్‌ జంప్‌, లాంగ్‌ జంప్‌, జావెలిన్‌ త్రో అన్నింట్లో పోటీ పడి పతకాలు గెలిచా. స్విమ్మింగ్‌, రన్నింగ్‌ పర్వలేదు కానీ, లాంగ్‌, ట్రిపుల్‌ జంప్‌లో దూకినప్పుడు ఎముకులు ఏమైనా విరుగుతాయోమోనని పిల్లలు ఆందోళన పడుతున్నారని ఈ మధ్య ఆ రెండింటికి దూరంగా ఉంటున్నా. నాకు బీపీ, షుగురు, థైరాయిడ్‌ ఉన్నాయి. అయినా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం క్రీడలే. అందుచేత యువత చదువు, ఉద్యోగాలకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ రాణించాలి.

కృష్ణా నదిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు మూడుసార్లు (2019, 2021, 2022లో) దిగ్విజయంగా ఈదా. తొలిసారి నేను కృష్ణా నది ఈదుతా అన్నప్పుడు, మావారు అంత దూరం ఎలా ఈదుతావని కంగారు పడ్డారు. అవతలి ఒడ్డు వరకు వస్తానో? లేనో? అని కంగారు పడ్డారు.

సంజయ్‌ ఎస్‌ఎ్‌సబి

Updated Date - 2023-11-28T23:57:33+05:30 IST