Open Heart with RK: రూ. వేల కోట్లు దోచి.. దేశాటన

ABN , First Publish Date - 2023-06-05T03:59:12+05:30 IST

తొమ్మిదేళ్ల క్రితం కేసీఆర్‌ ఒక ప్రకటన చేశారు. ‘‘మాది ఇతర పార్టీలలా మూస పద్ధతి కాదు. మా మేనిఫెస్టో ఒక భగవద్గీత, ఒక ఖురాన్‌, ఒక బైబిల్‌’’ అని మాట్లాడారు.

Open Heart with RK: రూ. వేల కోట్లు దోచి.. దేశాటన

కేసీఆర్‌ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు.. 10-15 రోజుల్లో ఓ పార్టీలో చేరతా

కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు

తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయి?

ఎన్నికలు వస్తున్నాయనే కొత్త పథకాల ప్రకటన

నియంతృత్వ పోకడలకు జనం బుద్ధి చెబుతారు

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో జూపల్లి కృష్ణారావు

తొమ్మిదేళ్ల క్రితం కేసీఆర్‌ ఒక ప్రకటన చేశారు. ‘‘మాది ఇతర పార్టీలలా మూస పద్ధతి కాదు. మా మేనిఫెస్టో ఒక భగవద్గీత, ఒక ఖురాన్‌, ఒక బైబిల్‌’’ అని మాట్లాడారు. ఆ మేనిఫెస్టోలో మొట్టమొదటిది దళితులకు మూడెకరాల భూమి. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, రైతు రుణ మాఫీ, నిరుద్యోగ భృతి.. ఇలా చాలా చెప్పారు. ఏ ఒక్కటీ ఈ రోజు అమలు కాలేదు. ఎటుపోయింది మీ భగవద్గీత. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. పాత వాటన్నింటినీ మరిపించేలా దళితబంధు, కుల వృత్తుల వారికి రూ.లక్ష సాయం వంటివి తెరపైకి తెచ్చారు. 17 లక్షల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలంటే.. రూ.లక్షా డెబ్భై వేల కోట్లు కావాలి. ఏడాదికి రూ.5 వేల కోట్లు ఇచ్చినా.. పథకం అందరికీ అందాలంటే సుమారు 30-35 ఏళ్లు పడుతుంది. అసలు ఎందుకీ బోగస్‌ మాటలు చెప్పాలి.

జూపల్లి కృష్ణారావు.. ఈ మధ్య కాలంలో వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. తీవ్ర అసంతృప్తితో కారు దిగిపోయిన ఈ నేత.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితో ధిక్కార స్వరం కలిపారు. తన మద్దతుదారులతో వరుసగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. జూపల్లి, పొంగులేటి.. ఏ పార్టీలోకి వెళతారనే చర్చ కొంతకాలంగా తెలంగాణలో జోరుగా నడుస్తోంది. జూపల్లి బీజేపీలోకి వెళతారనే ఊహాగానాలు వచ్చినా.. కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలో ఏ పార్టీలో చేరాలనేదానిపై ఇప్పటికే ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. మరో 10-15 రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్న జూపల్లి.. ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో వివిధ అంశాలపై మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌ నుంచి మిమ్మల్ని సస్పెండ్‌ చేసినపుడు.. పంజరంలో నుంచి బయటపడిపోయాను అన్నారు. ఈ పక్షి ఇప్పుడు ఏ గూటికి చేరబోతోంది..?

సస్పెన్షన్‌ ఒక అర్థం లేని ప్రకటన. సస్పెన్షన్‌ ఎప్పుడు వస్తుంది? నేను సభ్యుడిని అయినపుడు. 2018 ఎన్నికల తర్వాత ప్లీనరీ జరిగినపుడు అందరికీ సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇచ్చారు. నేను ఓడిపోయాను కాబట్టి నాకు ఇవ్వలేదు. వెళ్లి కేటీఆర్‌ను అడిగాను. ఆయన మరొకరి వద్ద తీసుకోవాలని చెప్పారు. నాకేం ఖర్మ పట్టింది. పోయి తెలంగాణ ద్రోహులను అడుగుతానా? అని నేను సైలెంట్‌గా ఉన్నా. నాలుగేళ్ల పాటు సభ్యత్వమే లేనప్పుడు. సస్పెన్షన్‌ ఎక్కడి నుంచి వచ్చింది. ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో.. అది నెరవేరలేదు. ఆత్మగౌరవం లేదు, అబద్ధాలు, అవినీతి నడుస్తోంది. ప్రజాస్వామాన్ని పాతాళంలోకి తొక్కేశారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. లక్షలాది మందికి కనీసం ఇళ్లు లేవు.

దేశమంతా దళిత బంధు ఇచ్చి ప్రధాని అవుతానని కేసీఆర్‌ అంటున్నారు కదా..?

ప్రధాని కావడం కోసం గాలిలో మేడలు కడుతున్నారు. తొమ్మిదేళ్ల పాలనను చూసిన నాలుగు కోట్ల మంది ప్రజలు కేసీఆర్‌ మాటలను నమ్ముతారా? ప్రజలు అమాయకులు కాదు. 2018లో కేసీఆర్‌ 88 స్థానాలు గెలిచాక, 5 నెలల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలకు.. 9 సీట్లలో గెలిచారు. కేవలం 5 నెలల్లోనే ఇలా ఎందుకు జరిగింది. తెలంగాణలో ప్రతిపక్షాల గొంతును అణచివేస్తున్నారనే ఒక్క అంశాన్నే ప్రజలు సీరియ్‌సగా తీసుకున్నారు. అనేక పథకాలు అమలు కాలేదు. అయినా ప్రజలు ఓట్లు వేస్తారనుకుంటే భ్రమనే. కాకపోతే వీళ్లు ప్రజలు, ప్రజాస్వామాన్ని నమ్ముకోలేదు. డబ్బును నమ్ముకున్నారు. ఎక్కడివీ డబ్బులు.. ఏం వ్యాపారాలు చేశారు..? ఆనాడు ఉద్యమంలో ఎవరి పరిస్థితేంటో మనకు తెలియదా..? ఇవాళ రూ.వేల కోట్లు కూడబెట్టి దేశంలో పార్టీని విస్తరించడానికి బయలుదేరారు.

కేసీఆర్‌ మీకు చాలా క్లోజ్‌ కదా.. ఎక్కడ తేడా వచ్చింది?

కేసీఆర్‌ది నియంతృత్వం. ఎవ్వరినీ మాట్లాడనిచ్చే పరిస్థితి లేదు. ఆయన పద్ధతుల వల్ల మంత్రులుగా మేం కూడా అగౌరవ పడ్డాం. నేను ఒక మంత్రిగా ప్రజల సమస్యలు మాట్లాడటానికి వెళ్లినా.. ఫాంహౌస్‌ గేట్లు తెరవలేదు. ఆ క్రమంలో కళ్లలో నీళ్లు వచ్చాయి. ఒకటి రెండు సందర్భాల్లో ఇలాంటి అనుభవం ఎదురైంది. మంత్రులందరి కంటే అతి తక్కువసార్లు ప్రగతి భవన్‌కు వెళ్లింది నేనే. ‘‘ప్రభుత్వం అంటే 24 గంటలు పనిచేస్తుంది. ప్రభుత్వం నిద్రపోతుందా..? సీఎం, మంత్రులంటే ప్రభుత్వమే.’’ అని కేసీఆర్‌ పదే పదే మాట్లాడతారు. ఆయన చెప్పేదానికీ, చేసేదానికీ పొంతనే లేదు.

మీరు మళ్లీ గెలిచి, మంత్రి అయి ఉంటే.. రాజీ పడి ఉండేవారేమో కదా..?

నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు(తెలంగాణ రాకముందే) మూడున్నరేళ్ల ముందే రాజీనామా చేసి పాదయాత్రలో పాల్గొన్నా. పదవుల కోసం వెంపర్లాడే వాడిని కాదు. టీడీపీ హయాంలో మా దగ్గర ఓ గ్రామంలో 300 మంది రైతుల స్టార్టర్లు, మీటర్లు తీసుకెళ్లి బిల్లులు కట్టాలన్నారు. ఆ అంశంపై పోరాడిన నేను 15 రోజులు జైలులో ఉన్నా. 13 రోజులు ఉపవాసం ఉన్నా. రాజశేఖర్‌రెడ్డి జైలుకు వచ్చారు. ఆయన చెప్పినా పోరాటాన్ని ఆపలేదు. అదో తృప్తి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా.. రాష్ట్రం వచ్చింది. అదో సంతృప్తి. అంతకంటే ఏం కావాలి.

మిమ్మల్ని కేసీఆర్‌ ఓడించారా..?

అలా అనను. కేసీఆర్‌ పెంచి పోషించిన వారు, నేను గెలిస్తే మంత్రినవుతానని భయపడిన వాళ్లు, మంత్రి కావాలని ఆశపడిన వాళ్లు.. ఇలా అనేక కారణాలున్నాయి.

మీరు, పొంగులేటి.. ఈటలకే ఎదురు కౌన్సెలింగ్‌ చేశారట?

ఇద్దరి లక్ష్యం ఒకటే. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు. కాబట్టి ఈ సీఎం మూడోసారి ఓట్లడిగే అర్హత కోల్పోయారు. మా లక్ష్యం నెరవేరాలంటే మార్పు రావాలి. ఆ మార్పు కోసం సంఘటితంగా ఏదో ఒకటి చేయాలని ఒక ప్రయత్నం చేశాం. ఎవరు ఏ పార్టీలోకి వెళతారనేది ఇంకో పది రోజుల్లో స్పష్టత వస్తుంది. జూన్‌ 15 కల్లా తేటతెల్లమవుతుంది.

బీఆర్‌ఎస్‌ నుంచి రాయబారాలు రాలేదా?

2011లో నేను సీఎంకు రాజీనామా లేఖ ఇచ్చా. మీ రాజీనామాతో తెలంగాణ వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఏం కావాలో, ఎంత కావాలో అడగాలని కోరారు. రూ.వెయ్యి కోట్లు పెట్టి కూడా నన్ను కొనలేరని చెప్పా. నా నైజం తెలుసు కాబట్టి నన్ను ఎవరూ అలా ప్రలోభ పెట్టలేదు. ఇదంతా ఎందుకు.. గెలిచినోడినే కొంటే అయిపోతుంది కదా.. అనేది బీఆర్‌ఎస్‌ నేతల ఆలోచన అయి ఉండొచ్చు.

మీరు, పొంగులేటి కలిసి బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు కదా.. అందులో ఏం తేలింది?

ఇంకా ఫలితం రాలేదు. వచ్చే పది పదిహేను రోజుల్లో దీనికి ఫుల్‌స్టాప్‌ పడిపోతుంది. సమైక్య రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం ధర్నా చౌక్‌లో నిరసనలకు అనుమతి ఇవ్వకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా..? ఈ రోజు ఎక్కడ మీటింగ్‌ పెట్టుకోవాలన్నా అనుమతి ఇవ్వడం లేదు. హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇంత నియంతృత్వమా..?

కేసీఆర్‌ను దించడమే లక్ష్యంగా పార్టీ పెట్టాలని కొందరు ఆలోచన చేశారు. దాంట్లో మీ భాగస్వామ్యం ఉందా?

పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు. లక్ష్య సాధన కోసం అనేక మార్గాలను అన్వేషించాం. అన్వేషిస్తున్నాం. అందులో సఫలీకృతం అవుతామన్న నమ్మకం మాకుంది.

ఒక వేళ మళ్లీ కేసీఆర్‌ గెలిస్తే మీ పరిస్థితేంటి..?

నేను నిర్మాణ రంగాన్ని ఎప్పుడో వదిలేశాను. సంపాదనే లక్ష్యం అయితే మూడున్నరేళ్ల మంత్రి పదవిని ఎందుకు వదులుకునేవాణ్ణి. ఓడిపోయాక బీఆర్‌ఎ్‌సలో ఉంటే ఏదో పదవి వచ్చేదేమో. ఎందుకు ఆత్మ వంచన చేసుకుని బతకాలి. మేం ఏమీ లేకున్నా ఉంటాం.

కేసీఆర్‌కు ఆర్థికంగా సహాయం చేశారట కదా..?

అవన్నీ బోగస్‌ మాటలే. నా వ్యక్తిత్వం అలాంటిది కాదు.

కేసీఆర్‌ను ఢీకొని నిలదొక్కుకోగల బలం మీకుందా..?

ధన బలం అంటే.. మేం అడ్డగోలుగా సంపాదించలేదు. అది అన్ని చోట్లా పని చేయదు. హుజూరాబాద్‌, కర్ణాటకలో ఏమైంది.

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రె్‌సకు అవకాశాలు మెరుగుపడ్డాయని భావిస్తున్నారా?

కర్ణాటకలో అధికార పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంతకు పదింతల అవకతవకలు ఇక్కడ ఉన్నాయి. వంద శాతం ఈ ప్రభుత్వం పతనమవుతుంది.

మీతో పాటు 25-30 మంది నాయకులు ఒకేసారి కాంగ్రెస్‌లో చేరితే.. బాగుంటుందనేది ఒక అభిప్రాయం..

తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది. చేరే వారి సంఖ్యలో తేడాలు ఉండొచ్చు. కానీ చేరికలు పక్కా.

మీరు బీఆర్‌ఎ్‌సలో ఎవరినైనా సంప్రదించారా..?

లక్ష్యం నెరవేరాలంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఆత్మగౌరవాన్ని చంపుకుని బీఆర్‌ఎ్‌సలో ఎంత మంది నాయకులు లేరు. ఎన్నికలకు మరో 3-4 నెలలు ఉంది. ఇంకో నాలుగు రోజులు ఆగి చూద్దామనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు.

మీరు అవినీతికి పాల్పడ్డారని, తెలంగాణను వ్యతిరేకించిన వైఎ్‌స ఫొటోను ఇంట్లో పెట్టుకున్నారని ఆరోపణ?

నేను అవినీతి చేసే వాడినైతే మూడున్నరేళ్ల మంత్రి పదవిని ఎందుకు వదిలేస్తా. రాజశేఖర్‌రెడ్డి ఫొటో మా ఇంట్లో ఉంది. మా జిల్లాలో ఆనాడు నేను స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నపుడు కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు వచ్చాయి. అందులో కల్వకుర్తిని 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుతో రూపొందించారు. ఫొటో పెట్టుకోవడమే తప్పయితే.. ఇవాళ ఎంత మంది ఉద్యమ ద్రోహులను కేసీఆర్‌ పక్కన పెట్టుకున్నారు.

ఖమ్మం నుంచి ఒక్క బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను గెలవనివ్వనని పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి శపథం చేశారు. మీరు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలాగే చేస్తారా..? అంత శక్తి ఉందా..?

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోయినసారి 14 స్థానాల్లో 13 చోట్ల బీఆర్‌ఎస్‌ గెలిచింది. నేనొక్కడిని ఓడిపోయా. వచ్చే ఎన్నికల్లో 13 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోతుంది. కేసీఆర్‌ నియంత, భూస్వామ్య విధానాలను అనుసరిస్తున్నాడు. ఇవాళ మార్కెట్‌ యార్డుల్లో బస్తా వడ్లకు 3-4 కిలోల చొప్పున క్వింటాకు 10 కిలోలు తరుగు తీస్తున్నారు. నాయకులు, అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇటువంటి దోపిడీ జరగలేదు.

Updated Date - 2023-07-30T14:23:12+05:30 IST