AP Minister Vidadala Rajini: వైసీపీ మంత్రి విడదల రజినీకి లైన్‌క్లియర్ చేసిన జగన్..!

ABN , First Publish Date - 2023-01-22T16:43:44+05:30 IST

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై (Telugu States Politics) కాస్తోకూస్తో అవగాహన ఉన్న ఎవరికైనా విడదల రజిని (Vidadala Rajini) పేరు తెలియకుండా ఉండదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన..

AP Minister Vidadala Rajini: వైసీపీ మంత్రి విడదల రజినీకి లైన్‌క్లియర్ చేసిన జగన్..!

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై (Telugu States Politics) కాస్తోకూస్తో అవగాహన ఉన్న ఎవరికైనా విడదల రజిని (Vidadala Rajini) పేరు తెలియకుండా ఉండదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన ఈ చిలకలూరిపేట (Chilakaluripet MLA) ప్రజా ప్రతినిధిని జగన్ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఏకంగా.. ఏపీ ప్రజల ఆరోగ్యాన్నే ఆమె చేతుల్లో పెడుతూ వైద్యఆరోగ్య శాఖ మంత్రి (AP Health Minister Rajini Vidadala) పదవిలో ఆమెను జగన్ (Jagan) కూర్చోబెట్టారు. కానీ.. జగన్ మాట తప్పి, మడమ తిప్పి రజినీని అందలం ఎక్కించారు. జగన్ మాటిచ్చింది మరెవరికో కాదు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు (Ex MLA Marri Rajasekhar). ‘రజినీని ఎమ్మెల్యేగా గెలిపించండి.. రాజశేఖర్ అన్నను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసుకుందాం’ అని చిలకలూరిపేట ప్రజల సాక్షిగా 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ మర్రికి మాటిచ్చారు. కానీ.. ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఆ మాటిచ్చిన వ్యక్తికి మొండిచెయ్యి చూపారు.

వైసీపీలో చేరక ముందు.. సైబరాబాద్‌లో చంద్రబాబు నాటిన మొక్క తాను అని, రాక్షసుడు ఎలా ఉంటాడని అడిగితే జగన్ ఫొటో చూపించమని చెప్పిన విడదలకు మంత్రి పదవి కట్టబెట్టడంపై మర్రి వర్గం ఆ సందర్భంలో అసంతృప్తితో రగిలిపోయింది. కానీ.. మర్రి రాజశేఖర్‌ మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ఇన్నేళ్ల తర్వాత జగన్‌కు గుర్తొచ్చిందట. మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు త్వరలో ఎమ్మెల్సీ పదవి దక్కనుందని టాక్. జగన్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వెంటనే నెరవేర్చుకోవాల్సిన హామీని ఎంతో ఆలస్యంగా కార్యరూపం చేయనున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న మర్రికి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వాల్సి ఉండగా ఆయనకు మొండిచేయి చూపారు. ఆ సమయంలో సామాజిక సమీకరణల్లో భాగంగా ఆయనను పక్కన పెట్టి బీసీ సామాజికవర్గానికి చెందిన రజినీకి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో మర్రి అలిగారు. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గానికి వచ్చిన జగన్‌ ఎన్నికల్లో రజినీని గెలిపిస్తే మర్రికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడమే కాకుండా మంత్రిని కూడా చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన అనుయాయులు ఇప్పటి వరకు అంటే ఇంచుమించు మూడున్నరేళ్లకు పైగా తమ నేత మర్రిని జగన్‌ అందలం ఎక్కిస్తారని ఎదురుచూసి అలసిపోయారు.

Marri-Rajasekhar.jpg

మర్రికి మంత్రి పదవి అటుంచి కనీసం ఎమ్మెల్సీ పదవి అందని ద్రాక్షగా మారింది. ఎమ్మెల్యే అయిన నాటి నుంచి రజినీకి మర్రికి మధ్య తరచూ వివాదాలు ఉత్పన్నం కావడం, దీనికి తోడు స్థానిక ఎంపీకి రజినీకి కూడా పడకపోవటంతో నియోజకవర్గంలో వైసీపీ రెండుగా చీలిపోయింది. ఎంపీ వర్గీయుడికిగా మర్రికి ముద్ర పడింది. దీంతో అప్పుడు రజిని జగన్‌ వద్దకు వెళ్లి నియోజకవర్గంలో ఎంపీ, రాజశేఖర్‌లు ఇద్దరూ కలిసి తనను బలహీన పరుస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో గత ఏడాది జగన్‌ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులను, మాజీ ఎమ్మెల్యే మర్రిని తన వద్దకు పిలిపించుకుని పంచాయితీ నిర్వహించారు. 2023లో శాసనమండలిలో వచ్చే ఖాళీల్లో మర్రికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని ఈలోగా రజినీని ఎలివేట్‌(మంత్రిగా ప్రమోట్‌) చేస్తానని చెప్పి నియోజకవర్గంలో పార్టీ విజయావకాశాలను మెరుగు పర్చాలని హితవు చెప్పారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీలో అంతర్గత విభేదాలు కొంత మేరకు సద్దుమణిగాయి. అన్నట్లుగానే ఆమెను మంత్రి చెయ్యడంతో నియోజకవర్గంలో రజిని వ్యతిరేకవర్గం సైలెంట్‌ అయిపోయింది.

అంతేకాకుండా ఇటీవలే మర్రికి పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ పదవి కూడా కల్పించడంతో ఆ హోదాలో ఆయన జిల్లాలో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయనకు జగన్‌ ఇచ్చిన హామీల్లో ఒకటి హుళక్కి అయినప్పటికీ కంటితుడుపుగా ఎమ్మెల్సీ పదవిని మాత్రం ఈ ఏడాది కట్టబెట్టడం ఖాయమని ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో కూడా రజినీకి టికెట్ ఇచ్చేందుకే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారనే టాక్ కూడా చిలకలూరిపేట నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది. రజినీకి లైన్ క్లియర్ చేసేందుకు జగన్ ఈ స్ట్రాటజీని ఎంచుకున్నారనే ప్రచారం నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తోంది.

Updated Date - 2023-01-22T16:44:05+05:30 IST