CBN Family : కుటుంబ సభ్యులను చూసి కంటతడి పెట్టిన చంద్రబాబు
ABN , First Publish Date - 2023-11-01T12:38:54+05:30 IST
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అర్థరాత్రి అయినా సరే చంద్రబాబును చూడాలని.. రాజమండ్రి నుంచి విజయవాడ వరకూ టీడీపీ శ్రేణులు, తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు...
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అర్థరాత్రి అయినా సరే చంద్రబాబును చూడాలని.. రాజమండ్రి నుంచి విజయవాడ వరకూ టీడీపీ శ్రేణులు, తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. కొందరు గజమాలలతో సత్కరించారు. ఇంకొందరు రోడ్డుపైనే కొబ్బరి కాయలు కొట్టి ఘన స్వాగతం పలికారు. ఆయన రాకతో ఉండవల్లి పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారిపోయాయి. బాణ సంచాలు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు. అప్పటి వరకూ టీడీపీ శ్రేణులు ఆనందంలో ఉండగా.. బాబు ఇంట్లోకి అడుగుపెట్టగానే ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది.
నన్నెవరూ ఏమీ చేయలేరు!
చంద్రబాబును చూడగానే కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులను అలా చూడగానే చంద్రబాబు కూడా కంటతడి పెట్టారు. కేసులో అక్రమంగా ఇరింకించారని.. పదే పదే ప్రభుత్వం మరిన్ని కేసులతో ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలువురు కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకొన్న చంద్రబాబు.. ‘ఎన్ని కేసులు పెట్టినా నన్నేమీ చేయలేరు.. అంతా మంచే జరుగుతుంది.. ధైర్యంగా ఉండండి’ అని చెప్పారు. దీంతో కాసేపు చంద్రబాబు నివాసం అంతా ఒక్కసారిగా ఎమోషనల్‌తో నిండిపోయింది.!.
ఇప్పుడిదే చర్చ!
అంతకుముందు ఉదయం ఆరు గంటలకే బాబు ఉండవల్లిలోని ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా.. చంద్రబాబుకు భువనేశ్వరి హారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతించారు. అనంతరం ఇద్దరూ కలిసి పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను టీడీపీ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోల గురించే చర్చ నడుస్తోంది. కాగా.. ఉదయం నుంచి విశ్రాంతి తీసుకున్న చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలను ఎవరిని కలవరనీ ఇప్పటికే ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు. కార్యకర్తలు, నేతలు ఎవరు ఇంటికి రావద్దని కూడా అచ్చెన్న విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.